సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాలు ఇటీవలి కాలంలో పెద్ద విజయాలు అందుకోవడం లేదు. అభిమాన హీరో నుండి మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కరోనా వారి ఆశలను ఆవిరి చేస్తూ వచ్చింది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం అన్నాత్తె ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సన్ పిక్చర్స్ ఓ తీపి వార్త అందించింది. ‘అన్నాత్తే.. దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
అంటే శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మించిన అన్నాత్తె చిత్రం దీపావళికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ రోజు రజనీ అభిమానులకు రెండు పండుగలు వచ్చినట్టే. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గ్రామ పెద్ద పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్య పరీక్షల కోసం రజనీ అమెరికాకు వెళ్లారు. మరి కొద్ది రోజులలో తిరిగి ఇండియాకు రానున్నారు.