బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 20:04:55

ప్రదీప్ కోసం దిగొచ్చిన అనసూయ, రష్మి , శ్రీముఖి

ప్రదీప్ కోసం దిగొచ్చిన అనసూయ, రష్మి , శ్రీముఖి

తెలుగు యాంకర్స్ అంతా ఒకేమాట ఒకేబాట మీదుంటారు. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. ఎప్పుడు ఎవరికి సాయం కావాల్సి వచ్చినా కూడా వెంటనే ముందుకొస్తుంటారు. గతంలో యాంకర్ రవి హీరోగా నటించిన సినిమా కోసం అనసూయ నుంచి అంతా సపోర్ట్ చేసారు. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈయన హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా జనవరి 29న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రమోషన్ లో భాగంగానే ప్రదీప్ కోసం స్టార్ యాంకర్స్ అంతా వచ్చేసారు. ఆయన సినిమాలో చిందేసారు.. డాన్సులు చించేసారు. 

వాహ్ బావా.. అంటూ సాగే ఈ మాస్ బీట్ ను అనూప్ రూబెన్స్ అదిరేలా ఇచ్చాడు. ట్యూన్ వినగానే డాన్సులు చేసేలా ఉన్నాయి లిరిక్స్ కూడా. ఇదిలా ఉంటే ఈ వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో ప్రదీప్ కోసం జబర్దస్త్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ ఇద్దరూ వచ్చారు. డాన్సులు చేయడమే కాకుండా అందాలతో పిచ్చెక్కించారు కూడా. అను, రష్మితో పాటు శ్రీముఖి కూడా ఈ పాటలో చిందేసింది. ప్రదీప్ కు ఈ ముగ్గురు యాంకర్స్ కూడా మంచి స్నేహితులు. గతంలో శ్రీముఖితోనే ప్రదీప్ కెరీర్ మొదలైంది. 


ఈ ఇద్దరూ కలిసి ఒకేసారి బుల్లితెరకు వచ్చారు. ఆ తర్వాత సందర్భాన్ని బట్టి అనసూయ, రష్మి గౌతమ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురితో కలిసి ప్రదీప్ డాన్సులు చేసాడు. సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రదీప్ గతంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఇప్పుడు లీడ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణ. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మొత్తానికి జబర్దస్త్ యాంకర్స్ మస్త్ మస్త్ ప్రమోషన్స్ ప్రదీప్ కు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలిక.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo