భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన నటులలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తప్పక ఉంటారు. ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలని సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా చెహ్రే అనే సినిమాలో అమితాబ్ నటించగా, ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత ఆనంద్ పండిట్, బిగ్‌బీ, ఇమ్రాన్ హష్మీ కలసి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు.
చర్చా కార్యక్రమంలో మాట్లాడిన అమితాబ్.. సినిమా మనల్ని ఉత్సాహపరుస్తుంది. కొత్త సినిమా, స్క్రిప్ట్ నా దగ్గరకి వచ్చిందంటే, అందులో నా పాత్ర ఏంటి, కథ ఏంటనే ఆసక్తి చాలా ఉంటుంది. రూమీ జాఫ్రీ తన వద్దకు తెచ్చిన ‘చెహ్రే’ కథ తనకు బాగా నచ్చిందని, ఇంతకాలం కామెడీ సినిమాలు చేసిన తను ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదని బిగ్‌బీ అన్నారు. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇక ఇమ్మాన్ హష్మీ.. అమితాబ్ గురించి మాట్లాడుతూ.. సినిమా కోసం బిగ్ బీ చేయాల్సిందంతా చేస్తారు.ఆయన నూటికి నూరు శాతం తప్పక న్యాయం చేస్తారు అని అన్నారు.దీనిపై స్పందించిన అమితాబ్ అలా న్యాయం చేయకపోతే అవమానించినట్టే అవుతుంది. ఎక్కువ రిహార్సల్స్ గురించి మాట్లాడిన ఆయన తన వయసులో పెద్ద పెద్ద డైలాగులు మర్చిపోతామనీ, అందుకే సాధ్యమైనన్ని ఎక్కువసార్లు రిహార్సల్స్ చేస్తానని అమితాబ్ చమత్కరించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘చెహ్రే’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.