శుక్రవారం 10 జూలై 2020
Cinema - Feb 14, 2020 , 11:28:57

అమిత్‌ పంగల్‌ నంబర్‌వన్‌

 అమిత్‌ పంగల్‌ నంబర్‌వన్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ 52 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) బాక్సింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ గురువారం ప్రకటించిన ర్యాకింగ్స్‌లో అమిత్‌ 420 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. దశాబ్ద కాలంలో ఓ భారత బాక్సర్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు విజేందర్‌ సింగ్‌ (2009లో) ఈ ఘనత సాధించాడు. గత మూడేండ్లుగా నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న అమిత్‌.. 2018లో ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గడంతో పాటు గతేడాది ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీకి ముందు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కడం చాలా ఆనందంగా ఉందని అమిత్‌ పేర్కొన్నాడు. 


‘క్వాలిఫయర్స్‌కు ముందు ఈ ఘనత దక్కడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచ నంబర్‌వన్‌గా రింగ్‌లో అడుగు పెట్టనుండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఇదే ఊపులో తొలి క్వాలిఫయర్‌ టోర్నీలోనే ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకోవాలనుకుంటున్నా’అని పంగల్‌ అన్నాడు. ఇతర విభాగాల్లో మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) 12వ ర్యాంక్‌లో, శివ థాపా (69 కేజీలు) 36వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాంకింగ్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌.. 51 కేజీల విభాగంలో ఐదో స్థానం దక్కించుకోగా.. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి అర్హత సాధించేందుకు మేరీతో బౌట్‌ నిర్వహించాలని పట్టుబట్టి పోటీలో ఓటమి పాలైన తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 22వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు) అత్యుత్తమంగా మూడో స్థానం దక్కించుకుంది.
logo