మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 23:46:48

థియేటర్లకు అనుమతినివ్వండి

థియేటర్లకు అనుమతినివ్వండి

థియేటర్ల పునఃప్రారంభంపై జూలై 31వరకు నిషేధాన్ని కొనసాగిస్తూ  కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్ని జారీ చేసింది.  ప్రభుత్వ నిర్ణయంపై మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లలో థియేటర్ల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ఓ ప్రకటనలో పేర్కొంది.  నిషేదిత జాబితాలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను కొనసాగించడం తమను ఆవేదనకు గురిచేసిందని చెప్పింది. ‘మల్టీప్లెక్స్‌ రంగంపై ప్రత్యక్షంగా రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అరవై శాతం రెవెన్యూను రాబడుతూ భారతీయ చిత్ర పరిశ్రమకు థియేటర్లు వెన్నుముకగా నిలుస్తున్నాయి.  నటీనటుల నుంచి స్పాట్‌బాయ్స్‌ వరకు లక్షలాది మంది థియేటర్లపై ఆధారపడుతు జీవనోపాధిని పొందుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో సినీ పరిశ్రమతో పాటు థియేటర్ల రంగం చాలా  నష్టపోతున్నది. అసంఘటిత రంగంలో ఉన్న ఎన్నో వ్యాపారాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం సంఘటితరంగంగా ఉన్న థియేటర్ల వ్యవస్థకు అనుమతులు నిరాకరించడంతో లక్షలాది మంది ఉపాధిలేక సతమతమవుతున్నారు.  వనరులన్నింటిని సమీకరించుకొని ఇండస్ట్రీ పూర్వస్థితికి రావాలంటే థియేటర్ల ప్రారంభం ఒక్కటే పరిష్కారం. భౌతికదూరాన్ని పాటించడంతో పాటు రద్దీని నియంత్రించే చర్యలను చేపడితే థియేటర్లను పూర్తి రక్షణతో నడిపించవొచ్చు. ప్రభుత్వం జారీచేసిన ప్రమాణాల్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, మలేషియాతో పలు దేశాల్లో భద్రతా ప్రమాణాలతో థియేటర్లు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తున్నారు. నాన్‌ కంటైన్‌మెంట్‌జోన్‌లలో థియేటర్‌ల ప్రారంభానికి అనుమతులు  ఇచ్చేలా  చర్యలు చేపట్టాలి’ అని పేర్కొంది.


logo