అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం టైటిల్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో వేదికపై మైక్ ముందు నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. ఓ వైపు జేబులో నోట్ల కట్టలు, మరోవైపు మందుసీసా ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే నాయకుల శైలిని విమర్శిస్తూ రాజకీయ వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు కనిపిస్తోంది. పొలిటికల్ జోనర్లో అల్లరి నరేష్ నటించనున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు. ‘సెప్టెంబర్ రెండో వారాంతంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాం. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.