బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 22:48:14

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అరంగేట్రం

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అరంగేట్రం

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ వీడియోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. జలం, అగ్నికి ప్రతీకలుగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రల్ని అభివర్ణించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.  ఈ సినిమాలో ఓ కథానాయికగా అలియాభట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.  అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వెలువడ్డాయి. సినిమా మోషన్‌పోస్టర్‌ను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్‌ చేసి ఆ పుకార్లకు చెక్‌పెట్టింది అలియాభట్‌. తాజా సమాచారం ప్రకారం మే నెలలో పూణేలో జరగనున్న షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈ  విషయాన్ని చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య ధృవీకరించారు. ‘ఇప్పటికే డెభ్భైఐదు శాతం చిత్రీకరణ పూర్తయింది. మే నెలలో అలియాభట్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది’ అని డి.వి.వి.దానయ్య చెప్పారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. ఏప్రిల్‌ 15 నుంచి ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినప్పటికీ లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణను కొన్ని వారాల పాటు వాయిదా వేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఇద్దరు పోరాటయోధుల చారిత్రక నేపథ్యానికి కాల్పనిక అంశాల్ని జోడించి దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


logo