అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘ఏజెంట్’ అనే పేరుని ఖరారు చేశారు. గురువారం అఖిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో అఖిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. వక్కంతం వంశీ కథనందించారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో నాగార్జున క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి అమల కెమెరా స్విఛాన్ చేశారు. స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, అఖిల్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ ‘ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. అఖిల్‌ను మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, సంగీతం: తమన్, సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.