ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 16, 2020 , 16:35:05

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఫిర్యాదు

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఫిర్యాదు

న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ ను రెండుగా చీల్చింది. జయాబచ్చన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా తయారై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ వరుసలో బాలీవుడ్ లో డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఎమ్మెల్యే ఒకరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. కరణ్ జోహార్ నివాసంలో గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీపై దర్యాప్తు జరుపాలని అకాలీదళ్ జాతీయ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా .. ఎన్సీబీ చీఫ్ రాకేశ్ అస్తానాకు ఫిర్యాదు అందజేశారు. ఢిల్లీలో జరిగిన ఈ పార్టీకి చెందిన వైరల్ వీడియోను ఎన్సీబీ చీఫ్ కు అందజేశారు. గత ఏడాది కూడా ఫిర్యాదు చేశానని, ఆ సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇవాల సుశాంత్ సింగ్ బ్రతికి ఉండేవాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరణ జోహార్ తో పాటు దీపికా పదుకొనే, విక్కీ కౌషల్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్ తదితరులు డ్రగ్స్ తీసుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నందున తక్షణమే దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని మంజిందర్ సింగ్ సిర్సా కోరారు. 

అంతకుముందు సెప్టెంబర్ 14 న ఇదే వీడియోను పంచుకున్న సిర్సా.. 'ఈ వీడియోలో కనిపించే ప్రతి ముఖం కొద్ది రోజుల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం వెలుపల వరుసలో నిలబడి ఉంటుందని గుర్తుంచుకోండి! # ఉడ్తాబాలీవుడ్' అని రాసుకొచ్చాడు.

ఈ రోజు ఎన్‌సీబీ చీఫ్ రాకేశ్ అస్తానాతో సమావేశమై ఫిర్యాదు చేశాను. సుమారు 12 నెలల క్రితం కూడా మహారాష్ట్ర ముంబై పోలీసులకు ఇదే ఫిర్యాదు చేశాను. అందులో కరణ్ జోహార్ నిర్వహించిన పార్టీపై విచారణ జరిపించాలని కోరాను. 2019 ఆగస్టు 1 న కూడా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని సిర్సా చెప్పారు. ముంబై పోలీసులు తన ఫిర్యాదుపై విచారణ జరిపి ఉంటే ఈ రోజు మనం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కోల్పోయి ఉండేవారం కాదన్నారు. మహారాష్ట్రలోని పోలీసులకు డ్రగ్స్ తేలికపాటి సమస్య, దానిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వారు అనుకోలేదని తెలిపారు. తాను మొత్తం బాలీవుడ్ పరిశ్రమనే తప్పుపట్టడం లేదని, భవిష్యత్ లో నైనా డ్రగ్స్ కు బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. logo