గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 01:53:30

అదాశర్మ కథానాయికగా ‘క్వశ్చన్‌మార్క్‌'

అదాశర్మ కథానాయికగా ‘క్వశ్చన్‌మార్క్‌'

‘తెలుగులో ఇప్పటివరకు నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాను. ఆ జాబితాలో నిలిచే మరో మంచి సినిమా ఇది. ఇందులో నా నటన విభిన్నంగా ఉంటుంది’ అని చెప్పింది అదాశర్మ. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘క్వశ్చన్‌మార్క్‌'. విప్రా దర్శకుడు. గౌరీకృష్ణ నిర్మాత. ఈ చిత్రంలోని ‘రామసక్కనోడివిరో’ అనే గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. రఘు కుంచె స్వరాలను అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. బండి సత్యం సాహిత్యాన్ని అందించారు. ఈ సందర్భంగా అదాశర్మ మాట్లాడుతూ  ‘హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని తెలిపింది. కరోనా టైమ్‌లో ప్రారంభమై విడుదలకు సిద్ధంగా ఉన్నా మొదటి సినిమా తమదేనని దర్శకద్వయం పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ ఈ పాట క్రెడిట్‌ మొత్తం సంగీత దర్శకుడు రఘు కుంచెకే దక్కుతుంది. శేఖర్‌మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. తన జీవితంలో ఎదురైన ప్రశ్నల్ని అన్వేషిస్తూ యువతి సాగించే ప్రయాణం ఏమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అదాశర్మ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా కొత్తపంథాలో సాగుతుంది. అన్ని వర్గాలను అలరించే చిత్రమవుతుంది. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని చెప్పారు. తొలుత పాటలు లేకుండా సినిమా చేయాలనుకున్నామని, కానీ షూటింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చిన ఆలోచనతో సినిమాకు జోడించిన పాట ఇదని సంగీత దర్శకుడు రఘు కుంచె తెలిపారు.