e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home సినిమా నాయికలే నిర్మాతలు

నాయికలే నిర్మాతలు

నాయికలే నిర్మాతలు

ఒకప్పుడు కథానాయికలు కెరీర్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు. తారాపథంలో అగ్రస్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ఉండేది. ఆర్థిక పరిపుష్టి చేకూరిన తర్వాత తమ అభిరుచి మేరకు వ్యాపారరంగాల్లోకి అడుగుపెట్టేవారు. సినీ నిర్మాణంలో నాయికలు పాలుపంచుకోవడం అరుదుగా జరిగేది. అయితే ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు వస్తోంది. అగ్ర కథానాయికలు మొదలుకొని కెరీర్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ముద్దుగుమ్మలు సైతం చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. సినీరంగంలో తాము సంపాదించిన అనుభవంతో చక్కటి కథల్ని ఎంచుకుంటూ నిర్మాతలుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు.

నాలుగు చిత్రాల నిర్మాతగా దీపికా..
హిందీ చిత్రసీమలో మంగళూరు సోయగం దీపికాపడుకోన్‌ ప్రస్థానాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓం శాంతి ఓం’ మొదలుకొని ‘పద్మావత్‌’ సినిమా వరకు ఆమె కెరీర్‌లో వాణిజ్యపరంగా భారీ హిట్‌ చిత్రాలున్నాయి. పదిహేనేళ్ల కెరీర్‌లో అగ్ర నాయికగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2018లో ‘కా’ ప్రొడక్షన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా తానే ప్రధాన పాత్రను పోషిస్తూ ‘చపాక్‌’ సినిమాను తెరకెక్కించింది. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీఅగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొంది. సామాజిక బాధ్యతతో దీపికా చిత్ర నిర్మాణ బాధ్యతను తీసుకుందని అందరు అభినందించారు. ఈ సినిమా అందించిన స్ఫూర్తితో దీపికాపడుకోన్‌ ‘83’ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరింది. 1983లో భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తుండగా ఆయన భార్యగా దీపికాపడుకోన్‌ కనిపించనుంది. కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. మహాభారతంలో ఓ ఘట్టం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ద్రౌపది’చిత్రానికి కూడా దీపికాపడుకోన్‌ నిర్మాణ భాగస్వామిగా చేరింది. తాను టైటిల్‌ రోల్‌ను పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు అమెరికన్‌ కామెడీ మూవీ ‘ది ఇన్‌టర్న్‌’ ఆధారంగా బాలీవుడ్‌లో తీయబోతున్న ఓ సినిమాకు సైతం దీపికాపడుకోన్‌ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

- Advertisement -

ఫైర్‌బ్రాండ్‌ నుంచి మణికర్ణిక ఫిల్మ్‌..
బాలీవుడ్‌ పరిశ్రమలో తరచు వివాదాలు, విమర్శలతో ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనారనౌత్‌ ఏడాది క్రితం మణికర్ణిక ఫిల్మ్స్‌ పేరుతో ముంబయిలో ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘టికూ వెడ్స్‌ షేరూ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. పరిమిత బడ్జెట్‌లో జనరంజక చిత్రాల్ని తీసే లక్ష్యంతో తాను నిర్మాణ సంస్థను స్థాపించానని కంగనారనౌత్‌ చెబుతోంది. ఏడాదికి రెండు సినిమాల్ని తీసేలా సన్నాహాలు చేసుకుంటున్నానని పేర్కొంది.

తాప్సీ ‘అవుట్‌సైడర్‌’ ఫిల్మ్స్‌…
ఇటీవలకాలంలో బాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది పంజాబీ సొగసరి తాప్సీ. ‘పింక్‌’ ‘నామ్‌ షబానా’ ‘ముల్క్‌’ ‘థప్పడ్‌’ వంటి చిత్రాలు హిందీ చిత్రసీమలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. సినీరంగంలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తాప్సీ ఇటీవలే ‘అవుట్‌సైడర్‌ ఫిల్మ్స్‌’ పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌ను స్థాపించింది. తాను ప్రధాన పాత్రలో నటిస్తూ ‘బ్లర్‌’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అజయ్‌భల్‌ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సినీరంగానికి తనవంతు సేవ చేస్తూ ఔత్సాహికులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్మాణ సంస్థను ఆరంభించానని తాప్సీ పేర్కొంది. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తానని చెప్పింది.

నిత్యామీనన్‌ ప్రొడక్షన్స్‌…
సహజత్వం ప్రతిబింబించే నటనకు పెట్టింది పేరు మలయాళీ సోయగం నిత్యామీనన్‌. సుదీర్ఘ కాలంగా దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న ఈ భామ ఎప్పుడూ నిర్మాణ వ్యవహారాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా తెలుగు చిత్రం ‘స్కైలాబ్‌’ లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తూ సహనిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. సత్యదేవ్‌, రాహుల్‌రామకృష్ణ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. 1979లో కక్ష్య తప్పి భూవాతావరణంలో మండిపోయిన స్కైలాబ్‌ స్పేస్‌స్టేషన్‌ ఉదంతం, ఆనాటి ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. విశ్వక్‌ కందెరావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌ సమర్పణలో…
తెలుగు వెండితెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ తెలుగు చిత్రం ‘మనుచరిత్ర’తో సహ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వడ్లమాని నటిస్తున్న ఈ చిత్రాన్ని యాపిల్‌ ట్రీ ఎంటర్‌టైమెంట్స్‌తో కలిసి నిర్మిస్తోంది కాజల్‌. వరంగల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా తాను విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉంది కాజల్‌ అగర్వాల్‌. గతంలో పోల్చితే నేటి చిత్ర నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ జోరు పెరగడంతో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు డిమాండ్‌ ఎక్కువైంది. అదే సమయంలో నిర్మాణరంగంలోకి వచ్చే ఔత్సాహికుల సంఖ్య పెరిగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కథానాయికలు సైతం నిర్మాణరంగం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన ప్రియాంకచోప్రా, అనుష్కశర్మతో పాటు పలువురు సీనియర్‌ నాయికలు నిర్మాతలుగా రాణిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాయికలే నిర్మాతలు
నాయికలే నిర్మాతలు
నాయికలే నిర్మాతలు

ట్రెండింగ్‌

Advertisement