ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 23:48:50

పనిచేసుకుపోవడమే పరిష్కార మార్గం

పనిచేసుకుపోవడమే పరిష్కార మార్గం

‘ఇరవై ఐదో సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటితో చేయాలని ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. ఆయన చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను అంగీకరించాను. నంబర్స్‌ను నేను పట్టించుకోను. ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ నెల 5న ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.  గురువారం నాని  సినిమా విశేషాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు.. 

ఈ సినిమాలో  విలన్‌గా నటించడానికి కారణమేమిటి?

ఇందులో నేను విలనా?కాదా? అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నెగెటివ్‌ షేడ్స్‌ కోసం  ప్రత్యేకంగా కసరత్తులేమీ చేయలేదు. రెగ్యులర్‌ సినిమాల కంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేసిన సినిమా ఇది. 

ఓటీటీలో విడుదలకావడం నిరూత్సాహపరిచిందా?

హీరోగా నాకో కొత్త అనుభవమిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఓటీటీ మినహా మరో మార్గం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో వాయిదావేయాల్సివచ్చింది.  వారం రోజుల వాయిదా అనుకున్నది కాస్తా నాలుగు నెలలు దాటిపోవడంతో నిరుత్సాహపడ్డాను.  సినిమా బాగుండటంతో ఎప్పుడూ ప్రేక్షకులకు చూపించాలా అనే కోరిక మరింత ఎక్కువైంది.  ఓటీటీ ద్వారా విడుదల చేయాలని  కరెక్ట్‌ టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నాం అనిపించింది. 

ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే దిల్‌రాజు నిర్ణయానికి మీరు ఎంతవరకు మద్దతునిచ్చారు?

పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్‌గా, నిర్మాతగా ఎంతో అనుభవమున్న దిల్‌రాజుగారు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకొని అందరికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు.   ఇలాంటి తరుణంలో ఇమేజ్‌, అభిమానగణం, ఒత్తిడుల్ని పక్కనపెట్టి నిర్మాతకు అండగా నిలవడం నా బాధ్యత అనిపించింది. ఆయన తీసుకునే  నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అని చెప్పాను. 

కరోనా ప్రభావం కారణంగా హీరోలు పారితోషికం తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?

ఒక సినిమాకు పెట్టిన బడ్జెట్‌ కంటే తక్కువ బిజినెస్‌ అయినప్పుడు పారితోషికాల్ని తగ్గించుకోవాలి. పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశముంటే ఆ అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు లెక్కలు మారిపోతాయి. నిర్మాతలు నష్టపోకుండా చూసుకోవడం అందరి బాధ్యత. పరిస్థితులను బట్టి నిర్మాతలకు  అండగా నిలవాలి.  అంతేకానీ   చాంబర్‌ రూల్‌ పెట్టిందనో,  ఇండస్ట్రీలోని  వారందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారనో  పారితోషికాలు తగ్గించుకోవాలని స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం సరికాదు. 

భవిష్యత్తులో సినిమా చిత్రీకరణల్లో ఎలాంటి మార్పులు వస్తాయని అనుకుంటున్నారు?

భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.  కరోనా అంతం ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. ఇలాంటి తరుణంలో పని చేసుకుపోవడమే పరిష్కారమార్గం.  రోజువారి కార్మికుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని నెమ్మదిగా షూటింగ్‌లను ప్రారంభించాలి. ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇచ్చి, నెలకు సరిపడా సరుకులు పంపిస్తే పూర్తిగా వారిని ఆదుకున్నట్లు కాదు. చిత్రీకరణల పునఃప్రారంభంపై దర్శకులు, నటీనటులు వీలైనంత తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. తొలినాళ్లతో పోలిస్తే కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు చేస్తే ఇబ్బందులు ఉండవనుకుంటున్నాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

‘టక్‌ జగదీష్‌' చిత్రీకరణను ఈ నెలలోనే పునఃప్రారంభించబోతున్నాం. ఇప్పటికే నల భై నుంచి యాభై శాతం షూటింగ్‌ పూర్తయిం ది. ఈ సినిమా తర్వాత ‘శ్యామ్‌సింగరాయ్‌' షూటింగ్‌ మొదలుపెడతాం. వీటితో పాటు మరో రెండు చిత్రాల్ని అంగీకరించాను.

లాక్‌డౌన్‌ విరామాన్ని ఎలా గడిపారు?

లాక్‌డౌన్‌ విరామాన్ని మా అబ్బాయి జున్నుతో  ఆస్వాదించా. ఇంతకుముందు షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లినప్పుడు జున్నుతో ఆనందక్షణాల్ని మిస్‌ అవుతున్నాననే బెంగ ఉండేది.  లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలలు పూర్తిగా వాడితోనే గడిపాను. ఈ విరామంలో అమ్మ దగ్గర వంట చేయడం నేర్చుకోవాలని, సిక్స్‌ప్యాక్‌ చేయాలని అనుకున్నా. కానీ ఏదీ చేయలేకపోయా.


logo