శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 04:03:41

తెలుగు తెరపై జయ’ ప్రకాశం

తెలుగు తెరపై జయ’ ప్రకాశం

స్వచ్ఛమైన రాయలసీమ మాండలికంలో తెలుగు తెరపై రౌద్రరసభరిత విలనిజంతో పాటు గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పండించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు జయప్రకాష్‌రెడ్డి. రంగస్థల నేపథ్యం నుంచి రావడంతో ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయప్రవేశం చేసేవారు. ఎక్కడా నాటకీయత, కృత్రిమత్వం కనిపించకుండా సహజత్వంతో ప్రతి పాత్రను రక్తికట్టించారు. ముఫ్పైఏళ్లకుపైగా నటప్రస్థానంలో ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా  తెలుగు చిత్రసీమపై తనదైన సంతకాన్ని లిఖించారు. జయప్రకాష్‌రెడ్డి మరణంతో తెలుగు పరిశ్రమ ఓ బహుముఖప్రజ్ఞాశీలియైన గొప్ప నటుణ్ణి కోల్పోయినట్లయింది.

రంగస్థలం నుంచి మొదలైన ప్రస్థానం

జయప్రకాష్‌రెడ్డి కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో 1946 మే 8న జన్మించారు. ఆయన తండ్రి సాంబిరెడ్డి పోలీస్‌ అధికారిగా పనిచేసేవారు. నాటకాల మీద ఆసక్తి ఉండేది.  చిన్నతనం నుంచి తండ్రి నాటకాలు చూస్తూ పెరగడం వల్ల జయప్రకాష్‌రెడ్డికి పాఠశాల రోజుల్లోనే రంగస్థలంపై ఆసక్తి ఏర్పడింది. తండ్రీకొడుకులిద్దరూ కలిసి నాటకాలు వేసేవారు. పోలీస్‌ వృత్తిలో తండ్రికి బదిలీలు జరుగుతుండటంతో జయప్రకాష్‌రెడ్డి బాల్యమంతా నెల్లూరులో సాగింది. పదోతరగతి వరకు అక్కడే చదివారు. స్కూల్‌రోజుల్లో రుద్రమదేవి నాటకంలో అంబదేవుడు పాత్ర వేయడం ద్వారా ఆయన తొలిసారి స్టేజీ ఎక్కారు. 

కళాశాలలో ‘ఉత్తమనటి’గా అవార్డు

గుంటూరు ఏసీ కళాశాలలో చదువుకునే సమయంలో జయప్రకాష్‌రెడ్డి ‘స్టేజీ రాచరికం’ అనే నాటికను వేశారు. రాజు, రాణి, చెలికత్తె...మూడు పాత్రలు మాత్రమే ఉండే ఆ నాటికలో ఆయన చెలికత్తె పాత్రలో నటించారు. ఆ నాటకానికి ఆయనకు ‘ఉత్తమనటి’గా బహుమతి వచ్చింది. ఆ గుర్తింపుతో కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొత్తాన్ని జయప్రకాష్‌రెడ్డి పర్యవేక్షించేవారు. కాలేజీ రోజుల్లో సన్నగా, పొడుగ్గా ఉండటంతో ఎక్కువగా కామెడీ పాత్రలు పోషించేవారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత జయప్రకాష్‌రెడ్డి గుంటూరు మున్సిపల్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడే ఉద్యోగ విరమణ కూడా చేశారు.

‘ప్రేమించుకుందాం రా’ తో తిరుగులేని గుర్తింపు

వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం జయప్రకాష్‌రెడ్డి కెరీర్‌ను మలుపుతిప్పింది. అందులో ప్రతినాయకుడు, ఫ్యాక్షనిస్ట్‌ వీరభద్రయ్యగా  రౌద్రరసపూరిత అభినయంతో జయప్రకాష్‌రెడ్డి యావత్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు.  తొలుత ఈ సినిమాలో విలన్‌ పాత్రకోసం అమ్రిష్‌పురి, నానాపటేకర్‌ వంటి హిందీ నటుల పేర్లను పరిశీలించారు. అయితే రామానాయుడు సిఫార్సుతో జయప్రకాష్‌రెడ్డిని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. ఈ సినిమా సంభాషణల్లో అచ్చమైన రాయలసీమ మాండలికాన్ని పలికించడానికి ఎంతో కసరత్తు చేశానని చెప్పేవారు జయప్రకాష్‌రెడ్డి. యాస మీద పట్టు సాధించడం కోసం నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో రెండు వారాల పాటు తిరిగారు. అక్కడి కుగ్రామాలకు వెళ్లి  ప్రజలు మాట్లాడే భాషను జాగ్రత్తగా గమనించేవారు. టేప్‌రికార్డుల్లో వాళ్ల మాటల్ని రికార్డు చేసుకొని హైదరాబాద్‌కు వచ్చి ప్రాక్టీస్‌ చేసేవారు ఆ సినిమాలో వీరభద్రయ్య పాత్రలో ఫ్యాక్షనిస్ట్‌గా అచ్చమైన విలనీ పండించారు. ఆ చిత్ర విజయంతో జయప్రకాష్‌రెడ్డి కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి,  జయం మనదేరా, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, ఢీ, రెడీ, కింగ్‌, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, టెంపర్‌, సరైనోడు వంటి అనేక చిత్రాలతో కెరీర్‌లో దూసుకుపోయారు. జయప్రకాష్‌రెడ్డి చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు.

రాయలసీమ మాండలికానికి పెట్టింది పేరు..

తెలుగు వెండితెరపై రాయలసీమ మాండలికానికి చిరునామాగా నిలిచారు జయప్రకాష్‌రెడ్డి. సీమ యాసలో విలనీతో పాటు అద్భుతమైన హాస్యాన్ని పండించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన ముద్రను వేశారు. సుదీర్ఘ కెరీర్‌లో సీనియర్‌ కథానాయకులతో పాటు యువహీరోలతో తెరను పంచుకొని తనదైన నటనతో మెప్పించారు. ‘శివుడు...మీ నాయన నాకు ఎదురొచ్చినాడు..చంపేసినా..రైటా రాంగా’ ‘సీమసందుల్లోకి రారా చూసుకుందాం..నీ పెతాపమూ నా పెతాపమూ’ అంటూ రౌద్రరసాన్ని పండించినా..‘యాందిరయ్యా యాంజేత్తన్నా’ ‘ఒరేయ్‌ పులీ..ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్యావ్‌..బోడెమ్మ లెక్క’ వంటి డైలాగ్స్‌తో హాస్యాన్ని పండించినా అది జయప్రకాష్‌రెడ్డికే చెల్లింది.

మూడు యాసల్లో దిట్ట...

జయప్రకాష్‌రెడ్డిది రాయలసీయ నేపథ్యమైనా తెలుగునాట ఏ మాండలికాన్నైనా అద్భుతంగా తన గళంలో పలికించగల నేర్పును సొంతం చేసుకున్నారు. అందుకు ఆయనకు నాటకరంగం తోడ్పడింది. ‘నేను కర్నూల్‌లో పుట్టినప్పటికి బాల్యమంతా నెల్లూరులో గడవడంతో ఆ యాసపై మంచి పట్టుదొరికింది. అనంతపురం, కర్నూల్‌, కడప, ప్రొద్దుటూరులో చదువుకోవడం వల్ల రాయలసీమ యాసపై సాధికారత సంపాదించాను. గుంటూరులో కాలేజీ విద్య వల్ల అక్కడి యాసపై పట్టు దొరికింది. మా నాన్న్ల డీఎస్పీగా పదోన్నతిపై నల్లగొండకు వచ్చారు. అక్కడే ఇల్లు కూడా కొన్నారు. నేను గుంటూరు నుంచి తరచు నాన్నను కలవడానికి నల్లగొండకు వచ్చి పోతుండేవాణ్ణి. అక్కడి మిత్రుల ద్వారా తెలంగాణ యాసపై ప్రేమ కలిగింది. తెలంగాణ యాసలో అనుబంధం, ఆత్మీయత ఉంటుంది’ అని జయప్రకాష్‌రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. జయప్రకాష్‌రెడ్డికి సాహితీ అభినివేశం ఎక్కువ. లెక్కల మాస్టారుగా పాఠాలు చెప్పినా తెలుగు సాహిత్యంపై మక్కువ కనబరిచేవాడు. పాలగుమ్మి పద్మరాజు, వంశీ రచనలు ఇష్టమని చెప్పేవారు. నాటకాలపై అనురక్తితో తెలుగునేలపై కొన్ని వేల ప్రదర్శనలిచ్చారు జయప్రకాష్‌రెడ్డి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో మెప్పించారు.

‘బ్రహ్మపుత్రుడు’తో సినీ అరంగేట్రం

జయప్రకాష్‌రెడ్డి నల్లగొండలో ‘గప్‌చుప్‌' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా..ఆ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అతిథిగా విచ్చేశారు.  నాటకంలో జేపీ అభినయానికి పరవశించి పోయారు. హైదరాబాద్‌కు పిలిచి అగ్ర నిర్మాత రామానాయుడుని పరిచయం చేశారు. ‘గప్‌చుప్‌' నాటకాన్ని రామానాయుడు కుటుంబ సభ్యుల ముందు ప్రదర్శించి మెప్పించారు జయప్రకాష్‌రెడ్డి. అనంతరం ‘బ్రహ్మపుత్రుడు’ (1988) సినిమా ద్వారా జయప్రకాష్‌రెడ్డి సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా ఆయనకు ఆశించిన గుర్తింపును తీసుకురాలేదు. దాంతో తిరిగి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. అలా తొమ్మిదేళ్లు అదే వృత్తిలో కొనసాగారు.

నల్లగొండ నుంచే నట  ప్రస్థానం! 

జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం గుంటూరు అయినా తండ్రి ఉద్యోగ రీత్యా నల్లగొండలో పదేళ్లపాటు నివాసం ఉన్నారు. తండ్రి సాంబిరెడ్డి  ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా నల్లగొండకు బదిలీపై వచ్చారు. ఇక్కడే కుటుంబంతో పాటు ఉండేవారు. జయప్రకాష్‌రెడ్డి కూడా నల్లగొండలోనే ఉంటూ స్థానికంగా 1979 నుంచి 1981వరకు లెక్కల మాస్టారుగా పనిచేశారు.  నల్లగొండకు వచ్చాక కూడా ఇక్కడి నాటక రంగ మిత్రులతో అనేక నాటకాల్లో తనదైన శైలిలో పాత్రలు పండించారు. ఈ క్రమంలో 1984లో నల్లగొండలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఓ పత్రిక వార్షికోత్సవంలో ‘గప్‌చుప్‌' అనే నాటకాన్ని ప్రదర్శించారు. అందులో జేపీదే ముఖ్య పాత్ర. ఈ వార్షికోత్సవానికి సినీదర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేపీ నటనకు దాసరి మంత్రముగ్ధుడయ్యారు.  ఇలాంటి వారు ఉండాల్సింది నాటకరంగంలో కాదు... సినిమా రంగంలో అంటూ ప్రశంసించారు. సరిగ్గా వారం రోజుల్లోనే జయప్రకాశ్‌రెడ్డిని దాసరి పిలిపించుకున్నాడు.  జేపీ సినిమారంగంలో ఏ స్థాయిలో ఉన్నా... నల్లగొండను మర్చిపోలేదు. జిల్లాలో సాంస్కృతికంగా ఏ కార్యక్రమం జరిగినా హాజరయ్యేవారు. రెండేళ్ల కిందట కూడా నల్లగొండలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా జేపీ ‘అలెగ్జాండర్‌' అనే నాటకంలో తనదైన పాత్ర పోషించారు. 


‘జయప్రకాష్‌రెడ్డి మృతి చిత్రసీమకు తీరనిలోటు. నేను ఆయనతో చివరగా ‘ఖైదీ నెంబర్‌ 150’లో నటించా. నాటకరంగం అంటే అమితమైన ప్రేమ కనబరిచేవారు. ‘శని, ఆదివారాల్లో ప్రదర్శనలు చేస్తాను. మీకు వీలుంటే రావాలి’ అని ఎప్పుడూ అడిగేవారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తొచ్చే పేరు ఆయనదే. విలక్షణ పాత్రలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ బ్రాండ్‌ సృష్టించుకున్నారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా’.   

   -చిరంజీవి.

‘రాయలసీమ మాండలికాన్ని పలికించడంలో జయప్రకాష్‌రెడ్డిగారు ప్రత్యేకతను సృష్టించుకున్నారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా కమెడియన్‌గా, చక్కటి క్యారెక్టర్‌ నటుడిగా పేరుపొందారు. ‘గబ్బర్‌సింగ్‌'లో పోలీస్‌ కమిషనర్‌గా మెప్పించారు. తెలుగు సినిమా, నాటకరంగాలకు జయప్రకాష్‌రెడ్డిగారి మరణం తీరని లోటుగా మిగిలిపోతుంది’

- పవన్‌కల్యాణ్‌

‘జయప్రకాష్‌రెడ్డిగారి మరణం నన్నెంతగానో కలచి వేసింది. కొన్ని దశాబ్దాలుగా తనదైన శైలి విలనీ, హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చింది. తెలుగు పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’             - రాజమౌళి

‘నా దర్శకత్వంలోని ప్రతి సినిమాలో ఆయన నటించారు. జయప్రకాష్‌రెడ్డిగారి హాస్యం, టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిభావంతుడు, సహృదయుడైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’.             

- వి.వి.వినాయక్‌

‘జేపీగారిని నేను అంకుల్‌ అని ప్రేమగా పిలిచేవాడిని. ఆయన నాన్న అనేవారు. నా తొలిచిత్రం నుంచి దాదాపు అన్ని సినిమాల్లో నటించారు. జేపీగారు నిజమైన కళాకారుడు. ఏ పాత్రలోనైనా లీనమైపోయేవారు. డబ్బుల కోసం ఎప్పుడూ నటించలేదు. మా రచయితతో మాట్లాడి ఆయన కోసం మంచి పాత్ర రాయించాలనుకున్నా. ఆలోపే ఆయన లేరనే వార్త విని ఆవేదన చెందా. జెపీగారి మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటు’.

- శ్రీనువైట్ల