సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 20:52:58

ఆచార్య టీజర్ ఎలా ఉండబోతోంది..రామ్ చరణ్ కూడా ఉంటాడా?

ఆచార్య టీజర్ ఎలా ఉండబోతోంది..రామ్ చరణ్ కూడా ఉంటాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ఆచార్య‌ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైరా సినిమా భారీ హిట్‌కాక‌పోవ‌డంతో   ఇప్పుడు ఆచార్యతో కచ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెరకెక్కిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం  ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.   ఆచార్య సినిమాను చిరు సతీమణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.   ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్ లో అడుగు పెట్టాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర మోషన్ పోస్టర్ లోనే కథేంటి అనేది చెప్పేసాడు కొరటాల శివ. సినిమా అంతా దేవాదాయ భూముల విషయంలో జరిగిన అక్రమాల నేపథ్యంలోనే జరగనుంది. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ రాకపోయినా కూడా అప్పట్లో విడుదలైన చిరు స్టిల్ చూసిన తర్వాత అదే కన్ఫర్మ్ అని అర్థం అయిపోతుంది.   రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో క‌నిపించ‌బోతోంది. చిరు, చరణ్ ఇద్దరూ కలిసి దాదాపు 29 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.  ఈ సినిమా టీజర్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న‌ది.      త్వరలోనే టీజర్ విడుదల కానుండ‌టంతో  

మోషన్ పోస్టర్ లో దేవాదాయ భూములను చూపించిన కొరటాల శివ.. టీజర్ లో ఏం చూపించబోతున్నాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా అసలు టీజర్ విడుదలైతే అందులో రామ్ చరణ్ ఉంటాడా? లేదంటే మొత్తం చిరుపైనే  టీజ‌ర్ ఉంటుందా?   అనేది కూడా అనుమానంగా మారింది. ఎందుకంటే రామ్ చరణ్ పాత్రేంటి అనేది నేరుగా సినిమాలో రిలీజ్ చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నాడు కొరటాల శివ. అందుకే టీజర్ లో మెగా వారసుడు కనిపించకపోవచ్చనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ ఫిబ్రవరిలో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఆచార్య సినిమా మాత్రం మెగాభిమానులకు పండగే.

VIDEOS

logo