భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా నెగెటివ్

- ప్రాక్టీస్ ప్రారంభించిన టీమ్ఇండియా
- రెండో టెస్టుకు 50% ప్రేక్షకులకు అనుమతి
కరోనా వైరస్ దెబ్బతో ఏడాదికి పైగా భారత గడ్డపై నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి ఇంగ్లండ్‌తో టీమ్ఇండియా ఆడే తొలి టెస్టుతో ఇంటర్నేషనల్ క్రికెట్ మళ్లీ మొదలుకానుంది. బయోబబుల్‌లో క్వారంటైన్ పూర్తి కావడం.. కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సన్నాహాలకు సిద్ధమయ్యారు. స్టేడియాల్లో ప్రేక్షకుల హాజరుకు అనుమతి రావడంతో ఇక స్వదేశంలో క్రికెట్ సందడి నెలకొననుంది.
చెన్నై: స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమ్ఇండియా టెస్టు సిరీస్ ప్రారంభమయ్యేందుకు మరో మూడు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరు రోజుల క్వారంటైన్ ముగించుకున్న ఇరు జట్ల ఆటగాళ్లందరికీ కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో మంగళవారం నుంచి భారత్, ఇంగ్లిష్ జట్ల ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు దిగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ నెల 5న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ‘భారత బృందం క్వారంటైన్ వ్యవధిని పూర్తి చేసుకుంది. మూడు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఔట్‌డోర్ సెషన్ నేటి నుంచి.. నెట్ ప్రాక్టీస్ రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభించనుంది’ అని బీసీసీఐ వెల్లడించింది. తమ జట్టు క్వారంటైన్ ముగిసిందని, ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చిందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మంగళవారం నుంచి పూర్తి జట్టు ప్రాక్టీస్ మొదలుపెడుతుందని పేర్కొంది. శ్రీలంక పర్యటనలో పాల్గొనని ఇంగ్లిష్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ భారత్‌కు ముందుగానే వచ్చి ఇప్పటికే సన్నాహకాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక విజయం సాధించిన జోష్‌లో టీమ్ఇండియా ఉంటే.. శ్రీలంకను ఆ దేశంలోనే క్వీన్‌స్వీప్ చేసిన ఆత్మవిశ్వాసంలో ఇంగ్లండ్ ఉంది.
ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలువదు: గంభీర్
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవకాశం లేదనిపిస్తున్నదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. ఇంగ్లిష్ జట్టు స్పిన్ విభాగం పటిష్టంగా లేదని, ఆ దళంతో భారత పిచ్‌లపై సత్తాచాటడం కష్టమేనన్నాడు. అయితే డే అండ్ నైట్ టెస్టులో రూట్‌సేనకు కాస్త గెలుపు అవకాశం ఉండవచ్చని గౌతీ సోమవారం ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను చెప్పాడు. ‘ఈ స్పిన్ దళంతో భారత్‌పై ఇంగ్లండ్ ఒక్క టెస్టు కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. అయితే పింక్‌బాల్ టెస్టులో 50-50 చాన్స్‌లు ఉండొచ్చు. ఇంగ్లండ్‌కు ఆశాజనకంగా ఉన్న మ్యాచ్ అదొక్కటే. అందుకే ఈ సిరీస్‌ను భారత్ 3-0 లేదా 3-1తో గెలువొచ్చు’ అని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే కెప్టెన్ రూట్ విజృంభించడంతో శ్రీలంకను 2-0 ఇంగ్లండ్ చిత్తు చేయడంపై మాట్లాడుతూ.. భారత్‌పై ఆడడం అతడికి భిన్నమైన సవాల్ అని గౌతీ అన్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో సారథిగా మెరుగ్గా ఉన్నాడని గంభీర్ చెప్పాడు. తానెప్పుడూ విరాట్ టీ20 కెప్టెన్సీనే ప్రశ్నిస్తానని, సుదీర్ఘ ఫార్మాట్లో అతడే కొనసాగడం మంచిదని గంభీర్ చెప్పాడు. ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ, డోమ్ బెస్, జాక్ లీచ్ స్పిన్నర్లుగా ఉన్నారు. వీరిలో అలీకి 60 టెస్టుల అనుభవం ఉండగా.. బెస్, లీచ్ తలా 12 మ్యా చ్‌లు మాత్రమే ఆడారు. మరోవైపు శ్రీలంకతో టెస్టుల్లో ఓ ద్విశతకం సహా భారీ సెంచరీతో కెప్టెన్ రూట్ విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
50 శాతం ప్రేక్షకులకు అనుమతి
భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే రెండో టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయంపై చర్చించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) సోమవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. క్రీడా ప్రాంగణాల్లోకి ప్రేక్షకులను అనుమతించేలా కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాల్లో సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్-19 తాజా మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎస్వోపీ జారీ చేసింది. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ రెండో టెస్టు 50 శాతం మంది ప్రేక్షకులు రావొచ్చు’ అని టీఎన్‌సీఏ అధికారి ఒకరు వెల్లడించారు. చెపాక్ స్టేడియం మొత్తం సామర్థ్యం 50 వేలు కాగా.. 25 వేల మందికి అనుమతి లభించనుంది. రెండో టెస్టు ఫిబ్రవరి 13న ప్రారంభం కానుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో జరిగే తదుపరి రెండు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ప్రేక్షకులు హాజరు కానున్నారు. అయితే ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరుగాలని ఇంగ్లండ్ బోర్డు కోరుతున్నట్లు సమాచారం. ఈసీబీ అధికారులతో మాట్లాడి అన్ని విషయాలను వివరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.