మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 13:45:04

రుద్ర‌మ‌దేవి@5.. ఎమోష‌న‌ల్ అయిన అనుష్క‌

రుద్ర‌మ‌దేవి@5.. ఎమోష‌న‌ల్ అయిన అనుష్క‌

కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ 12 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి రూపొందించిన కథ కోసం రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్  కేటాయించి సినిమా తెర‌కెక్కించారు.  తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందిన రుద్ర‌మదేవి గుణ‌శేఖ‌ర్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కి మంచి విజయం సాధించింది. 

ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రంలో అనుష్కశెట్టి, అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లు న‌టించారు. రుద్రమ‌దేవి హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి 150 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ముఖ్యంగా గోన గ‌న్నారెడ్డిగా అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది .

రుద్ర‌మ‌దేవి చిత్రం 2015 అక్టోబ‌ర్ 9న విడుద‌ల కాగా, నేటితో ఈ చిత్రం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన అనుష్క శెట్టి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. ఈ ప్ర‌యాణం నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. అల్లు అర్జున్, రానాలు ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. చ‌రిత్ర‌ని ఇంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొచ్చినందుకు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. రుద్ర‌మ‌దేవి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అంద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని అనుష్క త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 


logo