శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 10:58:48

ప్రాణం ఖ‌రీదు టూ ఆచార్య‌..42 ఏళ్ళ మెగా జ‌ర్నీ

ప్రాణం ఖ‌రీదు టూ ఆచార్య‌..42 ఏళ్ళ మెగా జ‌ర్నీ

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు ఒక ప్ర‌భంజ‌నం. మెగాస్టార్‌గా తెలుగు చిత్ర సీమ‌ని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్ళిన‌ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేసి వాటితో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఆయ‌న డ్యాన్స్, ఫైట్స్ , యాక్ష‌న్ ఎంతో మందికి స్పూర్తిని క‌లిగించింది. ఇప్ప‌టి చాలా మంది కుర్ర హీరోలు చిరు స్పూర్తితోనే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో క‌ష్టాలు, అవ‌మానాలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వ‌చ్చిన చిరంజీవి నేటితో  త‌న కెరీర్‌లో 42 ఏళ్ళ ప్ర‌యాణం పూర్తి చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదట నటించిన  తెలుగు సినిమా ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 42 ఏళ్ళు పూర్తి చేసుకుంది. చిత్రంలో  మెగాస్టార్ చిరంజీవి  అచ్చం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ లుక్‌లోనే క‌నిపిస్తారు. రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు.  పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలు అని సినిమా చివర సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగించి ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. రావు గోపాల్ రావు చిరంజీవి చేతిలో చనిపోతాడు దీనితో సినిమా ముగుస్తుంది.

ప్రాణం ఖ‌రీదు టూ ఆచార్య .. త‌న 42 ఏళ్ళ కెరీర్‌లో 152 సినిమాలు చేసిన చిరు ప్రేక్ష‌కుల‌కి వైవిధ్య‌మైన వినోదాన్ని అందించారు. దాదాపు అన్ని జాన‌ర్‌ల‌లో న‌టిస్తూ ఉత్సాహ‌ప‌రిచారు. ఇటీవ‌ల వ‌చ్చిన సైరా అనే చారిత్రాత్మ‌క చిత్రంతో ఇన్నాళ్లు ఉన్న లోటుని కూడా తీర్చేసుకున్నారు. ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వ‌స్తున్న మెగాస్టార్ చిరంజీవి మ‌రెన్నో మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని కోరుకుంటున్నారు.

చిరంజీవి మ‌ధ్య‌లో సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్లారు. దాదాపు 9 ఏళ్ళ త‌ర్వాత తిరిగి ఖైదీ నెంబ‌ర్ 150 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాసింది. చిరంజీవి మానియా ఏంటో మ‌రోసారి నిరూపించింది. అభిమానులు ఇంకా త‌మ హీరోని గుండెల్లో పెట్టుకొని ఉన్నార‌ని ప్రూవ్ అయింది. ప్ర‌స్తుతం హీరోగానే కాక ఇండ‌స్ట్రీకు సంబంధించి అన్ని విష‌యాల‌లోను చొర‌వ చూపిస్తూ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌లా వ్యవ‌హ‌రిస్తున్న మెగాస్టార్ ఇంకెన్నోరికార్డులు తిర‌గరాయాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న చిరు త్వ‌ర‌లో ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నారు.


logo