శుక్రవారం 29 మే 2020
Cinema - Feb 05, 2020 , 22:56:38

ప్రతి రూపాయికి సరిపడే వినోదం

ప్రతి రూపాయికి సరిపడే వినోదం

“త్రీ మంకీస్‌' టైటిల్‌ సుధీర్‌, రాంప్రసాద్‌, శీనులకు  పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకనే సందేశంతో అర్థవంతంగా సినిమాను తెరకెక్కించినట్లుగా కనిపిస్తున్నది’ అని అన్నారు సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌, గెటప్‌శీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రీ మంకీస్‌'. అనిల్‌కుమార్‌.జి దర్శకుడు. నగేష్‌.జి నిర్మించారు. కారుణ్యచౌదరి కథానాయిక. ఈ నెల 7న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘జబర్ధస్త్‌  ఆరంభమైన రోజున ఈ సినిమా విడుదల కావడం యాదృచ్ఛికం. ఈసినిమాకు డబ్బులతో పాటు అవార్డులు రావాలి’ అని చెప్పారు. 


హిందీ చిత్రం ‘త్రీ ఇడియట్స్‌' మాదిరిగానే ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని హాస్యనటుడు అలీ తెలిపారు.  ప్రేక్షకులు సినిమా కోసం వెచ్చించే ప్రతి రూపాయికి సరిపడా వినోదాన్ని పంచే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎందుకు కలుస్తారో తెలియదనే పాయింట్‌తో ఈసినిమాను  రూపొందించాం. సాటిమనిషికి సహాయం చేయడం ముఖ్యమనే సందేశం ఉంటుంది. వినోదం, భావోద్వేగాల సమాహారమిది. ప్రేక్షకుల మనసుల్ని కదిలించే మంచి సినిమా అవుతుంది’ అని చెప్పారు.  నటులుగా తమను వెండితెరపై నిలబెట్టే చిత్రమిదని సుధీర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి, ఆకాష్‌ పూరి, రాంప్రసాద్‌, శీను తదితరులు పాల్గొన్నారు. 

logo