టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవని..చేతితో రాసే ప్రతి అక్షరం ఒక్కో ఉద్వేగాన్ని పలికిస్తుందని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ అక్షరాల వెనుక దాగివున్న కథేమిటో తెలుసుకోవాలంటే ‘18పేజీస్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన నిర్దేశకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18పేజీస్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. మంగళవారం నిఖిల్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కళ్లకు గంతలు కట్టుకొని కనిపిస్తున్నారు. దానిపై కథానాయిక అనుపమపరమేశ్వరన్ అక్షరాల్ని లిఖిస్తూ కనిపిస్తోంది. ‘నా పేరు నందిని, నాకు మొబైల్లో అక్షరాలకు టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నా కెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’ అంటూ కళ్ల గంతలపై రాసిన వాక్యాలు ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో నిఖిల్..సిద్ధు అనే యువకుడిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, రచన: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్, కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్.