e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home సినిమా ‘మా’లో చతుర్ముఖ పోటీ

‘మా’లో చతుర్ముఖ పోటీ

తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రసవత్తరమైన పోరుకు తెర తీయబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడునెలల సమయం ఉండగానే అప్పుడే కోలాహలం మొదలైంది. అధ్యక్ష అభ్యర్థులు తమ ప్యానల్స్‌ జాబితాను ప్రకటిస్తూ ఎన్నికల రణంలోకి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నట్లుగా మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌, హేమ ప్రకటించారు. వీరితో పాటు జీవితా రాజశేఖర్‌ బరిలో నిలవనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చతుర్ముఖ పోటీ ఉత్కంఠగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి మద్దతుతో

సినిమా బిడ్డలు పేరుతో ప్యానల్‌ను ఏర్పాటుచేసిన ప్రకాష్‌రాజ్‌ తమ సభ్యుల జాబితాను ప్రకటించి అందరికంటే ముందుగానే ఎన్నికల కోసం సంసిద్ధుడయ్యారు. తాను ఎన్నికల్లో పోటీచేయాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదని, రెండేళ్ల నుంచే ఆలోచన ఉందని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన కార్యాచరణను చాలా కాలంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, జయసుధ, బండ్లగణేష్‌, సాయికుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. మరోవైపు ఇండస్ట్రీలోని అగ్రనటీనటులందరితో ప్రకాష్‌రాజ్‌కు సాన్నిహిత్యం ఉండటం వారి ప్యానల్‌కు కలిసిరావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌కు చిరంజీవి మద్దతు ఉందని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో నాగబాబు ప్రత్యక్షంగానే ప్రకటించారు. గత ఎన్నికల్లో మెగా హీరోలపై విమర్శలను గుప్పించిన ప్రకాష్‌రాజ్‌ విభేదాల్ని పక్కనపెట్టి వారి మద్దతును సంపాదించుకోవడంతో అతడికి విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన అగ్ర హీరోల్లో చాలా మందిని ప్రకాష్‌రాజ్‌ ఇప్పటికే కలిసి తన ఆలోచనల్ని పంచుకుంటూ మద్దతు కోరినట్లు తెలిసింది. ఈ మూడు నెలల విరామంలో మిగతా ‘మా’ సభ్యుల్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రకాష్‌రాజ్‌. చిత్రసీమలో ఆయన ప్యానల్‌ సభ్యులకు ఉన్న సుదీర్ఘ అనుభవమే ప్రకాష్‌రాజ్‌కు కలిసివచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఎన్నికలు సామరస్యపూర్వకంగా జరిగితే బాగుంటుందని అంటోన్న ప్రకాష్‌రాజ్‌ తాము ఎవరిపై అపనిందలు వేయమని చెబుతున్నారు. తమపై వచ్చే విమర్శల ధాటిని తట్టుకుంటూ వారు ఆ మాటకు ఏ మాత్రం కట్టుబడి ఉంటారో చూడాల్సిందే.

కొత్త తరం ఆలోచనలతో

మరోవైపు సీనియర్‌ హీరో మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు ప్రకాష్‌రాజ్‌తో పోటీకిసై అంటున్నారు. అతడికి కృష్ణ, కృష్ణంరాజు లాంటి దిగ్గజ నటుల మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్లతో పాటు యువ కథానాయకుల ప్రోద్బలాన్ని కూడగట్టుకునే పనిలో విష్ణు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కొత్త తరం ఆలోచనలతో ముందుకెళ్లాలనే ప్రయత్నాల్లో అతడు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే విష్ణు తన ప్యానల్‌ను ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. వర్గ సమీకరణాలు, రాజకీయాలు లేవని చెబుతున్నా ఇద్దరి మధ్య పోటీ బలంగానే ఉన్నట్లు సమాచారం. ప్రకాష్‌రాజ్‌ కన్నడ వ్యక్తి కావడంతో కొత్తగా నాన్‌లోకల్‌ వాదన తెరపైకి వచ్చింది. ఆ వాదనను ప్రధానాస్త్రంగా చేసుకుంటూ ప్రకాష్‌రాజ్‌ను ఎదుర్కొనేందుకు మిగతా ప్యానల్‌లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ పోటీచేసినప్పుడు నాన్‌లోకల్‌ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. ఆ వాదన ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో ఎలాంటి గందరగోళానికి దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది.

అనుభవం కలిసివస్తుందా?

ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణులకు పోటీగా జీవితా రాజశేఖర్‌, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీపడబోతున్నారు. ‘మా’లో వివిధ పదవులు చేపట్టిన అనుభవం ఉండటం, మహిళా సభ్యుల మద్దతుతో రాబోవు ఎన్నికల్లో ప్రభావాన్ని చూపేందుకు జీవితా, హేమ సన్నద్ధమవుతున్నారు. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణులను తట్టుకొని వారు ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపించేసరికి వీరిలో ఎవరు బరిలో ఉంటారు? ఇంకా కొత్తవారెవరైనా పోటీలోకి వస్తారనే విషయాల్లో స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే అంటున్నారు.

అప్పుడు నాన్‌లోకల్‌ ప్రస్తావన రాలేదు: ప్రకాష్‌రాజ్‌

‘కోపంతో కాకుండా ఆవేదన నుంచి పుట్టిన ప్యానల్‌ ఇది. పదవుల కోసం కాకుండా పనిచేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం’ అని అన్నారు ప్రకాష్‌రాజ్‌. శుక్రవారం హైదరాబాద్‌లో తన ప్యానల్‌తో కలిసి ప్రకాష్‌రాజ్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమా బిడ్డలు ప్యానల్‌ నిన్న, మొన్న ఆలోచించి ఏర్పాటుచేసింది కాదు. దీని వెనుక ఏడాది కృషి ఉంది. చిత్తశుద్ధితో పనిచేయాలనే లక్ష్యంతో మొదలుపెట్టాం. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్‌ కొంతకాలంగా వినోదంగా మారిపోయింది. సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తూ కూర్చోకుండా ఎలాంటి వాళ్లు ప్యానల్‌లో ఉండాలో నిర్ణయించి..అందరితో మాట్లాడి ఏర్పాటుచేశాం. ఎవరికీ పోటీగా ఈ ప్యానల్‌ను మొదలుపెట్టలేదు. ఇది పొలిటికల్‌ పార్టీ కాదు. మరొకరి మీద అపనిందలు వేయడానికి మేము రాలేదు. గత అధ్యక్షులు నిర్వర్తించలేకపోయిన పనుల్ని పూర్తిచేయాలనే లక్ష్యంతోనే పోటీచేస్తున్నాం . చేతల ద్వారా మా బాధ్యతల్ని పూర్తిచేస్తాం. తప్పు జరిగితే ప్రశ్నించేవారే మా ప్యానల్‌లో ఉన్నారు. అందరూ సమస్యలపై పోరాడుతారు. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది.

ఈ సమయంలో మా ప్రణాళికలేమిటో అందరికీ క్లారిటీగా చెబుతాం. నేను పోటీచేస్తున్నానని తెలియగానే లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని లేవనెత్తారు. కళాకారులకు ప్రాంతీయతత్వం ఉండదు. వారు యూనివర్సల్‌. వెలుగులాంటి వారు. భాషతో కళాకారులకు పనిఉండదు. గత ఎన్నికల్లో నాన్‌లోకల్‌ ప్రస్తావన రాలేదు. నా అసిస్టెంట్‌కు ఇక్కడ ఇళ్లు కట్టించినప్పుడు, తెలంగాణలో రెండు గ్రామాల్ని దత్తత తీసుకున్నప్పుడు ఈ మాటలు వినబడలేదు. తొమ్మిది నందులు, జాతీయ అవార్డులు తీసుకున్నప్పుడు నన్ను నాన్‌ లోకల్‌ అని ఎవరూ అనలేదు. అది చాలా సంకుచితమైన మనస్తత్వంగా భావిస్తున్నా. పరిచయాన్ని అడ్డుపెట్టుకొని మేము ఎవరినీ ఓటు అడగటం లేదు. ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉంటాం.

అసోసియేషన్‌ కోసం సొంత భవనాన్ని నిర్మించి అందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తాం. మాకు ఎవరితో అకారణ శత్రుత్వం లేదు. మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారని తెలియగానే వివాదాలు, దూషణలు లేకుండా ఎన్నికలు జరుపుకొందామని ఫోన్‌ చేసి మాట్లాడాను. మోహన్‌బాబుగారికి నేను పోటీచేస్తున్న విషయాన్ని చెప్పాను. జీవితగారు ఇండస్ట్రీలో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని నిలబడ్డారు. అలాగే అన్ని ప్యానల్స్‌లో పనిచేసిన అనుభవం హేమకు ఉంది. వారికి ఎన్నికల్లో పోటీచేసే హక్కు ఉంది. నాకున్న సమయంలో సినిమాలు, వ్యవసాయం, డైరెక్షన్‌ చేస్తూనే ‘మా’ బాధ్యతల్ని నిర్వర్తిస్తా’ అని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana