'యాత్ర' మూవీ రివ్యూ

Fri,February 8, 2019 01:07 PM
yatra movie review

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పేరు పొందిన నటీనటులతో పాటు వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచి వారి జీవిత కథలని వెండితెరపై దృశ్యమానం చేస్తూ చాలా సినిమాలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో తమదైన ముద్రవేసిన కీలక నేతల జీవిత కథల పరంపర ఇటీవ‌లే మొదలైంది. వారి బయోపిక్‌ల పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొనడంతో జీవిత చరిత్రల దృశ్యమానం తెలుగులో కొనసాగుతోంది. ఇటీవల నందమూరి తారక రామారావు జీవిత కథ నేపథ్యంలో ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చిన విషయం తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో మహానేతగా అభిమానాన్ని సొంతం చేసుకున్న నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన రాజకీయ జీవితాన్ని పాదయాత్ర ఎలాంటి మలుపులు తిప్పిందో అందరికి తెలిసింది. ఆ అంశాన్ని ప్రధాన కథగా తీసుకుని దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితచరిత్రపై తెరకెక్కిన చిత్రం యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన పాదయాత్ర నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై వై.ఎస్ అభిమానులతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. ఇది రాజకీయ సినిమా కాదు. పాదయాత్రలోని భావోద్వేగాలని మాత్రమే తీసుకుని దానికి సినిమా స్వేచ్ఛను జోడించి చేసిన సినిమా ఇదని మేకర్స్ చాలా సందర్భాల్లో వెల్లడించారు. వారు చెప్పినట్టే సినిమా వుందా?. ప్రజలు చేతులెత్తి మొక్కిన వైఎస్ పాదయాత్రని ఏ కోణంలో ఆవిష్కరించారు? ప్రత్యర్థి పార్టీలపై ఏమైనా పంచ్‌లు వేశారా? వైఎస్ పాదయాత్ర ఎలా, ఎక్కడ మొదలైంది? వైఎస్ అభిమానుల అంచనాలకు యాత్ర అనుగుణంగానే వుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:


వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలోని భావోద్వేగ సన్నివేశాల సమాహారంగా సాగే చిత్రిమది. రాజకీయ నాయకుడిగా లక్షల మందికి అండగా నిలవాలన్న తండ్రి వై.ఎస్. రాజారెడ్డి కలని నిజం చేయాలన్న సంకల్పంతో వై.ఎస్. రాజశేఖరరెడ్డి(మమ్ముట్టి) రాజకీయాల్లోకి ప్రవేశించి జనం మెచ్చిన నేతగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో మన దేశం(పేరు మార్చిన ప్రత్యర్థి పార్టీ) పార్టీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అసెంబ్లీని రద్దు చేస్తుంది. ఈ దఫా పార్టీని అధికారంలోకి తీసుకరాకుంటే ఇక రాజకీయాల్లో వుండలేం అనుకున్న రాజశేఖరరెడ్డి ప్రజలతో మమైకం కావడానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్రే కరెక్ట్ అనుకుంటాడు. అందుకు అతనికి మిత్రుడు కేవీపీ(రావు రమేష్) అండగా నిలబడతాడు. కాంగ్రెస్ హైకమాండ్ పాదయాత్రకు నిరాకరిస్తుంది. అయినా లక్ష్యపెట్టని రాజశేఖరరెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి (సుహాసిని) నియోజక వర్గం నుంచి పాదయాత్ర మొదలుపెడతాడు. ఈ యాత్రలో పేదల కష్టాల్ని, బాధల్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతుంటాడు. ఈ క్రమంలో అరెస్టులు, వెన్నుపోట్లు, మనదేశం పార్టీ కోవర్టు రాజకీయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వై.ఎస్ పాదయాత్రపై సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో క్రమంగా హైకమాండ్ అతను చెప్పినట్టు వినడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో వైఎస్ ఏం చేశారు? ఎలా తన గమ్యాన్ని చేరుకున్నాడు? తన తండ్రి కల కోసం, ఇచ్చిన మాట కోసం మడమతిప్పని నేతగా ఎలా జేజేలందుకున్నాడు? అన్నది తెరపైన చూడాల్సిందే.

ఆర్టిస్టుల పనితీరు


జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పలు మార్లు అవార్డుల్ని సొంతం చేసుకున్న మమ్ముట్టిని వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాత్ర కోసం తీసుకున్నారేంటీ?. ఈ పాత్రకు ఆయనను ఎంచుకుని దర్శకుడు తప్పుచేస్తున్నాడా?. ఆ పాత్రకు స్వయంగా మమ్ముట్టితో డబ్బింగ్ చెప్పించారేంటీ? అనే అనుమానాలు సర్వత్రా వినిపించాయి. అయితే థియేటర్‌లో స్క్రీన్‌పై సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడికి ఇవేమీ కనిపించకుండా వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారా అన్నంతగా నటించి ప్రేక్షకులు సహానుభూతిని పొందేలా చేశారు. వై.ఎస్ చేయి ఊపే మేనరిజమ్ నుంచి తన పంథాలో సైగ చేస్తూ చిరునవ్వుతో పలకరించే వరకు ప్రతీ మేనరిజమ్‌ని తన పంథాలో ఆవిష్కరించి వెండితెరపై వైఎస్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసేప్రయత్నం చేశారు. ఈ పాత్రకు తనని ఎంచుకున్న దర్శకుడి నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిజం చేశారని చెప్పొచ్చు. ఇక వై.ఎస్. తండ్రిగా వై.ఎస్. రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయారు. వై.ఎస్ ఆప్త మిత్రుడు కెవీపీ రామచంద్రారావు పాత్రలో రావు రమేష్ రక్తికట్టించారు. చేవెళ్ల చెల్లెమ్మగా సబితా ఇంద్రరెడ్డి పాత్రలో సుహాసిని, విజయమ్మగా బాహుబలి ఫేమ్ అశ్రిత వేముగంటి, పోసాని కృష్ణమురళి, మనదేశం నాయకులుగా జీవి, ఫృధ్వీ, కేశవరెడ్డిగా వినోద్‌కుమార్, వీ. హనుమంతరావు పాత్రలో తోటపల్లి మధు, కాంగ్రెస్ హైకమాండ్ దూతగా సచిన్ ఖేడేకర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రలోని భావోద్వేగాలని ప్రధానంశాలుగా తీసుకుని దర్శకుడు మహి.వి.రాఘవ్ కథను నడిపించిన తీరు ఆకట్టుకునే విధంగా వుంది. ఒక రాజకీయ నాయకుడి జీవితంపై సినిమా అంటే అది ఫక్తు డ్యాక్యుమెంటరీగా వుంటుంది. అయితే అలాంటి ఛాయలు కనిపించకుండా పక్కా స్క్రీన్‌ప్లేతో మనసుకు హత్తుకునే సంభాషణలతో చిత్రాన్ని నడిపించడంలో దర్శకుడు మహి. వి. రాఘవ్ నూటికి నూరు శాతం విజయం సాధించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగాల సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ ఏంటో నిరూపించింది. సీరియస్‌గా సాగే ఇలాంటి కథకు పాటలు, నేపథ్య సంగీతం స్పీడు బ్రేకర్లుగా నిలుస్తుంటాయి. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు, నేపథ్య సంగీతంతో సినిమా మూడ్‌ను మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లేలా జాగ్రత్త పడ్డాడు. తమిళ యువ సంగీత దర్శకుడు కే అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టకునే స్థాయిలో వుండటం ఈ సినిమాకు ప్రధాన బలం. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం, సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అనుభవం, ఏ విషయంలోనూ రాజీపడని నిర్మాతల నిర్మాణ విలువలు సాంకేతికంగా ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చాయి.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర ఎలాంటి కీలక భూమికను పోషించిందో ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రేక్షకులకు సుపరిచితమే. వై.ఎస్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన పాదయాత్రని ప్రధాన కథగా ఎంచుకుని చేసిన ప్రయత్నం యాత్ర. వై.ఎస్‌ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ మళ్లీ ఆనాటి సంగతుల్ని గుర్తు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులకు విసుగు పుట్టించే అతి.. వెగటు పుట్టించే అతిశయోక్తులు లేకుండా చరిత్రను చరిత్రగా చూపించడంతో యాత్రను వై.ఎస్ అభిమానులనే కాకుండా ప్రతీ ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం వుంది. రానున్న ఎన్నికల వేళ వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి పార్టీకి, ఆ పార్టీ శ్రేణులకు యాత్ర నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వైఎస్‌ఆర్ అభిమానులతో పాటు సినిమాను సినిమాగా చూసే తెలుగు ప్రేక్షకుల అండతో యాత్ర కమర్షియల్‌గా కూడా విజేతగా నిలిచే అవకాశం వుంది. ఎన్నికల ముందు వైఎస్ పాదయాత్ర ఎంతటి సక్సెస్‌ఫుల్ యాత్రగా నిలిచిందో.. ఈ వెండితెర యాత్ర కూడా ఫలించిన పాదయాత్ర మిగిలిపోతుంది.

రేటింగ్: 3.25/5

6354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles