వెంక‌ట‌ల‌క్ష్మీ మూవీ రివ్యూ.. వేర్ ఈజ్ ది కథ..!

Fri,March 15, 2019 04:13 PM

హాస్యనటులు కథానాయకులుగా మారే ట్రెండ్ తెలుగులో కొత్తేమీ కాదు. సునీల్, వేణుమాధవ్, షకలక శంకర్, సప్తగిరితో పాటు పలువురు హాస్యనటులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా వినూత్నమైన డైలాగ్ డెలివరీతో తెలుగు చిత్రసీమలో హాస్యనటులుగా మంచి పేరుతెచ్చుకున్న ప్రవీణ్, మధునందన్.. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో హీరోలుగా మారారు. కథానాయికగా కంటే ప్రత్యేక గీతాలతో తెలుగులో గుర్తింపును తెచ్చుకున్న రాయలక్ష్మి సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అనే వినూత్నమైన టైటిల్‌తో సినిమా రూపొందడటంతో వినోదంతో పాటు ఇందులో కొత్తదనం తప్పకుండా ఉంటుందని అంతా భావించారు. కానీ పేరులో ఉన్న వైవిధ్యం సినిమాలో మాత్రం కనిపించలేదు.


చంటిగాడు(ప్రవీణ్), పండుగాడు(మధునందన్) పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక తగాదా పెట్టుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులు పెడుతుండటంతో ఊరంతా వారిని ద్వేషిస్తుంటారు. చంటి, పండు.. ఎన్ని తప్పులు చేసినా చిన్ననాటి స్నేహితులు కావడంతో శేఖర్(రామ్‌కార్తిక్) వారికి అండగా నిలుస్తుంటాడు. ఆ ఊరికి కొత్తగా వెంకటలక్ష్మి(రాయ్‌లక్ష్మి) అనే టీచర్ వస్తుంది. ఆమె అంద చందాలకు ఆకర్షితులవుతారు చంటి, పండు. ఇద్దరు ఆమెను ప్రేమిస్తుంటారు. తమ ప్రేమను ఆమెకు వ్యక్తం చేయాలని అనుకుంటున్న తరుణంలోనే ఆమె మనిషి కాదని దయ్యం అనే నిజం వారికి తెలుస్తుంది.

వెంకటలక్ష్మి ఎవరు? చంటి, పండులను వెతుక్కుంటూ ఆమె ఎందుకొచ్చింది? వీరారెడ్డి(పంకజ్‌ కేసరి) అనే రౌడీతో ఆమెకున్న వైరం ఏమిటి? వీరారెడ్డి చెల్లెలు గౌరి(పూజిత పొన్నాడ)ని ప్రాణంగా ప్రేమించిన శేఖర్‌కు చంటి, పండు చేసిన తప్పు కారణంగా ఆమెకు ఎలా దూరమయ్యాడు? అన్నదే మిగతా కథ.

తమ కుటుంబానికి అన్యాయం చేసిన రౌడీపై ఇద్దరు జులాయి యువకులతో కలిసి ప్రతీకారం తీర్చుకునే యువతి కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ పాయింట్‌కు గ్లామర్ తళుకులు, హాస్యం అనే సొబగుల్ని అద్ది రెండు నిమిషాల కథను రెండు గంటల పాటు సాగతీశారు దర్శకుడు.

చంటి, పండు పాత్రలను పరిచయం చేస్తూ వారి వల్ల ఊరంతా ఇబ్బందులు పడుతుంటారని చెప్పే సన్నివేశాలన్నింటిలో బూతు తప్ప హాస్యం మచ్చుకైనా కనిపించదు. ఆడవాళ్లను కామెంట్ చేస్తూ అందులోనే ఆనందం పొందడం, వీడియోలను చూపిస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ తమ పనుల్ని చక్కబెట్టుకోవడం లాంటి సన్నివేశాలపై దర్శకుడు చూపించిన శ్రద్ధ కథ విషయంలో మాత్రం చూపలేదు. సినిమా ఆద్యంతం కొత్త పాత్రలు ప్రవేశిస్తూ హాస్యం పేరుతో అడుగడుగునా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారు చేసే పనులు నవ్వు తెప్పించకపోగా ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయంలో ప్రేక్షకుడిని పడేస్తాయి.

తమ మాటలతో బోల్తా కొట్టించే చంటి, పండులను దెయ్యం పేరుతో వెంకటలక్ష్మి బెదిరించినా వారు తెలుసుకోలేకపోవడం ఏమిటో అంతుపట్టదు. విలన్ ఇంట్లో ఉన్న ఓ చిన్న పెట్టె కావాలనే వెంకటలక్ష్మి కోరిక కోసం చంటి, పండు శుభం కార్డు వరకు చేసే ప్రయత్నాలు ఎందుకో, అందులో ఏముందో దర్శకుడు చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచుతాడు. పతాక ఘట్టాల్లో వీడిన ఆ చిక్కుముడి చూసి బిత్తరపోవడం ప్రేక్షకుల వంతవుతుంది. రచయిత, దర్శకుడు చెప్పిన ఈ చిన్న పాయింట్‌లో నిర్మాతకు ఏం నచ్చి సినిమా తీశాడో అనే అనుమానం వస్తుంది.

ఈ హారర్ ఎంటర్‌టైనర్ కథలో అంతర్లీనంగా చూపించిన రామ్‌కార్తిక్, పూజిత పొన్నాడల ప్రేమకథలో గ్లామర్ తప్ప ఏమోషన్ కనిపించదు. తెలుగులో ఓ సినిమా చేశాననే పేరు తప్ప రాయ్‌లక్ష్మికి ఈ సినిమా వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆమెలోని గ్లామర్‌ను రకరకాల యాంగిల్స్‌లో చూపించడం తప్ప నటనను మాత్రం రాబట్టుకోలేదు దర్శకుడు. ఈ సినిమాతో కథానాయకులుగా మారిన ప్రవీణ్, మధునందన్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తొలి సినిమా విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ సన్నివేశాల్ని, పాత్రల్ని రాసుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు కిషోర్, రచయిత కిరణ్ ఏ మాత్రం కష్టపడలేదని అనిపిస్తుంది. కథనేది లేకుండా బూతు డైలాగ్‌లు, కథానాయికల అందాల ప్రదర్శనతో సినిమాను తీసినట్లుగా అనిపిస్తుంది. చంటి, పండు చెప్పే సంభాషణల్లో సెన్సార్ వారు మ్యూట్ చేసినవే ఎక్కువ కనిపించాయి.

ప్రస్తుతం హాస్యానికి అర్థం మారుతోంది. బూతు డైలాగ్‌లు, గ్లామర్‌ను నమ్ముకొని సినిమాల్ని తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకునే రోజులకు కాలం చెల్లింది. ఇంకా అలాంటి ప్రయత్నాలు కొందరు దర్శకులు చేస్తూనే ఉన్నారనడానికి ఈ సినిమా నిదర్శనం. కథనేది లేకుండా సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ఉదాహరణగా నిలిచింది.

రేటింగ్:2

2860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles