కళాతపస్వికి జన్మదిన శుభాకాంక్షలు

Fri,February 19, 2016 02:12 PM
vishwanath birhday

సాహిత్యం, సంగీతం, నాట్యం ...ఈ మూడు కళల అద్భుత సంగమాలు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కమనీయ దృశ్య కళాకావ్యాలు. ఆయన తీసిన ప్రతి చిత్రంలోనూ కళాత్మకత ఉంటుంది. కళా రమణీయత ఉంటుంది. నేడు ఆ కళా దర్శకుడి పుట్టిన రోజు.

కమర్షియల్ మూవీస్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కళాత్మక సినిమాలు తీసి, విజయం సాధించడం మామూలు సంగతి కాదు. అటువంటి నిరంతర కార్యసాధకుడు కాశీనాథుని విశ్వనాథ్. కళాత్మక చిత్రాలు తీయాలంటే గుండెల్లో తపన ఉండాలి. అభిరుచిని గుర్తించి వెన్ను తట్టే నిర్మాత ఉండాలి. ఈ రెండూ ఉన్న అదృష్టవంతుడు కళాతపస్వి కె. విశ్వనాథ్.

విశ్వనాథ్ సినిమా అంటే దేశంలో ఎంతో మందికి ఎంతో గౌరవం ఉంది. ఏదో తీశామంటే తీశామని సినిమా చుట్టేసే ఆలోచన ఆయనకు అసలు లేదు. మొదట సౌండ్ ఇంజినీర్ గా సినిమాల్లోకి వచ్చిన విశ్వనాథ్ తర్వాత రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా మారారు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.

విశ్వనాథ్ సినిమాల్లో స్వరం ఉంది. రాగం ఉంది. పాత్రల అభినయంలో ఒక లయ ఉంది. చిత్రీకరణలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. తన హృదయంలో మెదిలిన ఆలోచన సరిగా దృశ్య రూపం దాల్చేవరకు విశ్వనాథ్ విశ్రమించరు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతి కిరణం, శుభసంకల్పం, స్వరాభాషేకం,వంటి సంగీత నాట్యసంబంధమైన చిత్రాలను విశ్వనాథ్ తన హృదయంతో మలిచారు.

విశ్వనాథ్ కళాత్మక చిత్రాలు మాత్రమే తీయలేదు. శారద, కాలంమారింది, చెల్లెలి కాపురం, ఉండమ్మా బొట్టు పెడతా, మాంగల్యానికి మరో ముడి సూత్రధారులు, ఆపద్భాంధవుడు, స్వయంకృషి వంటి సందేశాత్మక సినిమాలూ తీశారు. ఆత్మగౌరవం, నేరము-శిక్ష, ఓ సీత కథ, సీతామాలక్ష్మి, శుభోదయం వంటి అభ్యుదయ దృక్పథం ఉన్న సినిమాలూ తీశారు.

కళ అజరామరమైంది. ఆ కళకు జీవమిచ్చి, జీవితాన్నివ్వాలి. తరతరాలుగా కొనసాగేలా చేయాలి. కె. విశ్వనాథ్ ఆ పని చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి.

3298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles