త‌మ‌ది ప్రేమ వివాహ‌మ‌ని చెప్పిన విశాల్

Fri,January 11, 2019 08:39 AM
vishal confirmed about his marriage

సినీ హీరో, నడిగర్ సంఘం సెక్రటరీ, తమిళ చలనచిత్ర నిర్మాత మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. విశాల్ తండ్రి జీకే ఇటీవ‌ల ఈ విష‌యాన్నితెల‌ప‌గా, త‌న పెళ్లి విష‌యంపై విశాల్ తాజాగా స్పందించాడు. త‌మ‌ది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని.. ప్రేమ వివాహమని విశాల్ తెలిపాడు. విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా కాగా, ఆమె హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ కుమార్తె. త్వ‌ర‌లో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటాన‌ని విశాల్ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే .

ప్ర‌స్తుతం బిల్డింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే ఏడాది పూర్తి కానుంది. బిల్డింగ్ పూర్తైన త‌ర్వాత‌నే విశాల్ వివాహం చేసుకోనున్నాడ‌ని అంటున్నారు. వచ్చే వారంలో ఈ రెండు కుటుంబాలు క‌లిసి విశాల్, అనీషాల నిశ్చితార్ధం జ‌ర‌ప‌నుండ‌గా, ఆ రోజే పెళ్ళి తేదీ ప్ర‌క‌టిస్తాడ‌ని తెలుస్తుంది. త‌న పెళ్ళి నడిగర్ సంఘం కొత్త భవనంలో జ‌ర‌గ‌నుందని విశాల్ పేర్కొన‌డం విశేషం . విశాల్ ఇటీవ‌ల పందెం కోడి 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ప్ర‌స్తుతం త‌మిళంలో టెంప‌ర్ రీమేక్ చేస్తున్నాడు. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ విడుద‌ల కాగా, దీనిపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

2833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles