విధ్వంస వినాశ నామా.. వినయ విధేయ రామా..

Fri,January 11, 2019 01:45 PM

రంగస్థలం చిత్రంతో కెరీర్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్. ఆయనలోని నటనను పతాక స్థాయిలో ఈ సినిమా ఆవిష్కరించింది.నటనా పరంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న రామ్‌చరణ్ రంగస్థలంఘన విజయం తర్వాత.. అంతకు మించిన కథను ఎంచుకుంటాడని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా చరణ్ మాస్ కమర్షియల్ సినిమాలతో ఊర మాస్ డైరెక్టర్‌గా పేరున్న బోయపాటి శ్రీనుతో వినయవిధేయరామ లాంటి మాస్ కథను ఎంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు రామ్‌చరణ్. రొటిన్‌గా వుండే ఫ్యామిలీ ఎమోషన్స్, పతాకస్థాయిలోని యాక్షన్ హంగులకు మేఘాల్లో తేలిపోయే హీరోయిజాన్ని మేళవిస్తూ మాస్ ప్రేక్షకులకు అభిరుచులకు తగ్గట్లుగా సినిమాల్ని రూపొందించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కలయికలో తొలిసారి రూపొందిన సినిమా కావడంతో ప్రారంభం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది?బోయపాటి శ్రీను రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించడా?లేదా? అన్నది చూద్దాం


భువన్‌కుమార్(ప్రశాంత్)తో పాటు మరో ముగ్గురు అనాథ పిల్లలు చిత్తుకాగితాలు ఏరుకుంటూ బతుకుతుంటారు. వారికి మరో అనాథ రామ్(రామ్‌చరణ్) జతచేరుతాడు. అంతా ఓ కుటుంబంలా కలిసిపోతారు. తన అన్నయ్యల బాగు కోసం రామ్ తన చదువును పక్కనపెడతాడు. అతడి కష్టం ఫలించి అన్నయ్యలంతా ఉన్నత ఉద్యోగాలు చేపట్టి భార్యపిల్లలతో సంతోషంగా ఉంటారు. రామ్‌కు కుటుంబమే ప్రపంచం. వారిని కంటికిరెప్పలా కాపాడుతుంటాడు. బీహార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యతను భువన్‌కుమార్ చేపడతాడు. బీహార్‌లోని ఓ ప్రాంతానికిరాజా భాయ్ మున్నా(వివేక్ ఒబెరాయ్) అధినేతగా ఉంటాడు. తనకు ఎదురుతిరిగిన వారిని చంపుతుంటాడు. అతడికి భువన్‌కుమార్ ఎదురునిలుస్తాడు. దాంతో భువన్‌ను రాజా భాయ్ చంపేస్తాడు. అన్నయ్యను చంపిన రాజాభాయ్‌పై రామ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.


ఆయన గత చిత్రాల తరహాలోనే కుటుంబ బంధాలకు ప్రతీకార నేపథ్యాన్ని జోడించి బోయపాటి శ్రీను ఈ కథను సిద్ధంచేసుకున్నారు. ఈ చిన్న కథను రామ్‌చరణ్ ఇమేజ్, భారీ పోరాట ఘట్టాలతో ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. కథ, కథనాల్లోని లోపాలతో ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. చూసే ప్రేక్షకులు కూడా బెదిరిపోయారు. నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా ఈ సినిమా నిలిచింది. కథ అనేది లేకుండా పూర్తిగా పోరాట ఘట్టాలపైనే దృష్టిపెట్టారు దర్శకుడు. వాటిని రొమాంచితంగా తీస్తే ప్రేక్షకులు సినిమా చూస్తారని భావించినట్లున్నారు. భారీ ఫైట్‌తో సినిమాను మొదలుపెట్టిన ఆయన ప్రతి ఐదు నిమిషాలకో పోరాట ఘట్టాన్ని చూపిస్తూ కథను నడిపించారు. వందలాది మందిని హీరో అవలీలగా చంపుతూ పోవడం, తనకన్న బలవంతులను కూడా ఒక్కో దెబ్బతో మట్టికరిపించే సన్నివేశాలతో అవన్నీ అసహజంగా, వాస్తవికతను పూర్తి దూరంగా సాగాయి.. హీరో చేసే పోరాటాల్ని చూసి సీఏం, పోలీసులతో పాటు చివరకు ఆర్మీ కూడా అతడిని సహాయం కోరడం విచిత్రంగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో రక్తపాతం, హింస ఎక్కువైంది. చాలాచోట్ల హద్దులు దాటారు దర్శకుడు.

ఐదుగురు అనాథలు అన్నదమ్ములా కలిసి మెలసి బతకడం అనే పాయింట్ బాగానే ఉన్నా వారి మధ్య అనుబంధాన్ని దర్శకుడు సరిగా చూపించలేకపోయారు. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలల్లో ఎమోషన్ ఎక్కడ కనిపించదు. అవన్నీ కృత్రిమంగా ఉన్నాయి. అలాగే నాయకానాయికల మధ్య ప్రేమకథను అందంగా తీర్చిదిద్దే అవకాశం ఉండి ఉపయోగించుకోలేకపోయారు. కేవలం ఒక సన్నివేశానిక వారి రొమాన్స్‌ను పరిమితం చేశారు.

మహిళ హక్కులపై పోరాడుతున్న నాయకురాలిగా హేమ, పృథ్వీ బృందంతో చేసిన కామెడీలో హాస్యం తక్కువ, బూతు ఎక్కువ కనిపించింది. అవన్నీ నవ్వించకపోగా చిరాకును తెప్పించాయి. ఆద్యంతం లాజిక్‌లకు దూరంగా ఈ సినిమా సాగింది. రంగస్థలం లాంటి కథతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చరణ్.. వెంటనే ఈ కథను ఒప్పుకోవడానికి అసలు ఆయనకు నచ్చిందేమిటి? అనేది ఈ కథలో మిలియన్ డాలర్ల ప్రశ్న.


కుటుంబం కోసం అనుక్షణం తపనపడే యువకుడిగా రామ్‌చరణ్ నటన బాగుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో చరణ్ నటనలో ఏ మాత్రం ఉత్సాహం కనిపించలేదు. అయిష్టతతో చేసిన సినిమాలా అనిపించింది. అయితే కథలో కూడా నవ్యత లోపించడంతో తన అభినయాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం రాలేదు. కేవలం యాక్షన్ సన్నివేశాల్లో ఆయన్ని ధీరోదాత్తుడిగా చూపించడానికే ప్రాధాన్యతనిచ్చారు దర్శకుడు. కియారా అద్వానీ అతిథిగా మాత్రమే కనిపించింది. పాటల కోసమే ఓ హీరోయిన్ కావాలి కాబట్టి ఆమెను తీసుకున్నారు. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్‌రాజేష్, వివేక్ ఒబెరాయ్ లాంటి ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో ఉన్నా వారిని సహాయ పాత్రలకే పరిమితం చేశారు దర్శకుడు. వివేక్ ఒబెరాయ్‌ను భయంకరమైన ప్రతినాయకుడిగా చూపించే సన్నివేశాల్లో ఆసక్తి లోపించింది.


నాలుగేళ్ల పాటు కష్టపడి తయారు చేసుకున్న కథ ఇదని ప్రచార వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. ఈ కథకు నాలుగేళ్లు పట్టిందా? అనిపించే స్థాయిలో ఈ కథ వుండటం విశేషం. అతడు చెప్పిన మాటలకు సినిమాకు ఎక్కడ పొంతన కుదరదు. లెజెండ్ నుండి జయజానకినాయక వరకు తాను రూపొందించిన కథలకు మార్పుల చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపించింది. కొత్తదనం పూర్తిగా కరువైంది. తన ప్రతి సినిమా ప్రమోషన్‌లో నా సినిమాను గుండెల మీద చేయి వేసుకొని చూడండి...అని బోయపాటి చెబుతుంటాడు. అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల గుండె అదుపు తప్పకుండా వుండాలంటే ఆయ‌న చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ చిత్రంలో దర్శకుడిగా అతడి ప్రతిభకు తార్కాణంగా నిలిచే సన్నివేశం ఒక్కటి కనిపించదు. అయితే హీరో విలన్‌ల తలలు నరుకుతుంటే ఆ తలలను గాల్లో వుండగానే గద్దలు తన్నుకుపోవడం బోయపాటిలోని దర్శకత్వ పరాకాష్టకు అద్దం పడుతుంది.కథ లేకుండా కేవలం హంగులు, యాక్షన్ సన్నివేశాలతో సినిమా చేసి హిట్ కొట్టడం ప్రతిసారి సాధ్యం కాదు అనే విషయాన్ని ఈ చిత్రం నిరూపించింది. దేవిశ్రీప్రసాద్ బాణీలు కేవలం నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి. రత్నం అందించిన ప్రాసలతో కూడిన సంభాషణల కథకు సరిగా అతకలేదు. కొత్త సినిమాలు.. సరికొత్త కాన్సెప్ట్‌లతో తెలుగు సినిమాలో మార్పులు కనిపిస్తున్న ఈ రోజుల్లో ఐదు పాటలు, ఆరు ఫైట్లు మూస ఫార్ములా కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. కథలో కొత్తదనం లేకపోతే స్టార్ హీరోల సినిమాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రొటీన్ ఫ్యామిలీ డ్రామాతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడం అసాధ్యమనే చెప్పాలి. కథను కాకుండా ఇతర హంగుల్ని నమ్ముకొని సినిమా చేసి విజయాల్ని అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది.రంగస్థలంలో
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రీసౌండ్ వచ్చే హిట్ కొట్టి అందరి హృదయాలను గెలుచుకున్న రామ్‌చరణ్ వినయ విధేయ రామతో ఆ సౌండ్‌ని రిపీట్ చేయలేకపోయాడు..!

ఫైనల్ పంచ్: కత్తులతో బ్యాటింగ్... గద్దలతో ఫీల్డింగ్!
రేటింగ్: 2/5

11444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles