టాక్సీవాలా రివ్యూ

Sat,November 17, 2018 01:43 PM
Vijay Devarakondas Taxiwala film review

పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి సంచలన విజయంతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. గీతగోవిందంతో 100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచిన విజయ్ సినిమా వస్తోందంటే క్రేజ్‌తో పాటు అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. నోటాతో కొంత నిరాశపరిచిన విజయ్ తాజాగా టాక్సీవాలాతో ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విడుదలకు ముందే పైరసీకి గురైన ఈ సినిమా ఫలితంపై చిత్ర వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. రాహుల్ సంక్రీత్యన్ దర్శకుడిగా, మీడియా నుంచి వచ్చి నిర్మాతగా మారిన ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలు తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాలకు చేరువైందా? విజయ్ టాక్సీవాలాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

శివకుమార్(విజయ్ దేవరకొండ) అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి తన అన్నా వదినలకు భారంగా వుండకూడదని సిటీకి వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ వస్తాడు. కార్ మెకానిక్ బాబాయ్( మధునందన్) మాల్‌లో సెక్యురిటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. అతి తన వల్ల కాకపోవడంతో డెలివరీబాయ్ అవతారం ఎత్తుతాడు. అదీ కుదరకపోవడంతో చివరికి తన వదిన అమ్మిన నగలతో ఓ కారు కొని టాకీస డ్రైవర్‌గా మారాలనుకుంటాడు. ఇందులో భాగంగా ఓ పాత వింటేజ్ కార్‌ని కొంటాడు. దానికి హంగులద్ది టాక్సీగా మార్చేసి కొత్త జీవితం మొదలుపెడతాడు. అప్పుడే అతనికి అను(ప్రియాంక జవాల్కర్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న దశలో తను వాడుతున్న కారే తనకు ఇబ్బందికరంగా మారుతుంది. ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీరిగింది? ఇంతకీ ఆ కారులో వున్న పవరేంటి?? దానికి శిశిరకు ఉన్న సంబంధం ఏంటి? ఆమె కోసం శివ ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ (మనిషి బ్రతికుండగానే ఆత్మను శరీరం నుంచి వేరు చేసే ప్రక్రియ) అనే సరికొత్త పాయింట్‌తో తెరకెక్కిన సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో చిత్రాన్ని అంతే గ్రిప్పింగ్‌గా నడిపించడంలో దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ నూటికి నూరుశాతం విజయం సాధించాడు. తొలి భాగాన్ని అసలు కథలోకి వెళ్లకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి నడిపించిన తీరు బాగుంది. సూపర్ నేచురల్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో లాజిక్‌లను పట్టించుకోకుండా సినిమా ఆస్వాదిస్తే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునే చిత్రమిది. తొలి భాగాన్నంతా హాలీవుడ్ (సైన్మా షార్ట్ ఫిల్మ్‌లోని గలీజ్)తో కామెడీ చేయించి ప్రేక్షకులకు రిలీజ్ ఇచ్చిన రాహుల్ సెకండ్ హాఫ్‌లోనూ కథ సీరియస్ టర్న్ తీసుకుంటున్న సందర్భంలోనూ మళ్లీ హాలీవుడ్‌తో చేయించిన కామెడీ ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ అంశాలు కొంత నిరాశ పరిచినా ైక్లెమాక్స్‌లో వచ్చే పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని ద్రవింపజేస్తాయి. చిత్రీకరణ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే సుజిత్ సారంగ్ అందించిన విజువల్స్, తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నా జేక్స్ బిజోయ్ సినిమాకు అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం విశేషం. ఎస్‌కెఎస్‌కు నిర్మాతగా తొలి సినిమా అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదని నిర్మాణ విలువలు అద్దంపడతాయి. పాటల్లో సిడ్ శ్రీరామ్ ఆలపించిన మాటే వినదుగా.. అనే పాట ఆకట్టుకుంటుంది.

నటీనటుల గురించి మాట్లాడాలంటే ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తనదైన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ నటనే. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో విజయ్ పలికిన డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకుంటాయి. కత కొత్తదైనా తన మార్కు నటనతో సినిమాను విజయతీరాలకు మోసుకెళ్లాడు. ఈ సినిమాతో పరిచయమైన ప్రయాంక జవాల్కర్ ఫరావాలేదనిపించింది. తన పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. శిశిర పాత్రలో ఆత్మగా నటించి మాళవికా నాయర్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. ప్రొఫెసర్‌గా రవివర్మ, స్టెప్ ఫాదర్‌గా విలన్ పాత్రలో సిజ్జు, తల్లి పాత్రలో యమున, విజయ్ దేవరకొండకు అన్నా వదినల పాత్రల్లో రవికాంత్, కల్యాణి, స్నేహితుడిగా మధునందన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇలాంటి సీరియస్ కథలో నవ్వులు పూయించిన హాలీవుడ్ రూపంలో టాలీవుడ్‌కు మరో కమేడియన్ లభించాడు.

సినిమా విడుదలకు నెల రోజులు ముందు రఫ్ కట్ పైరసీకి గురైనా సినిమా ఫలితం విషయంలో కొంత టెన్షన్ వెంటాడినా ధైర్యం చేసి వరుస వాయిదాల తరువాత ఫైనల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలు, విజయ్ నటన ఈ చిత్ర బలాలు. విజయ్ కున్న స్టార్‌డమ్‌తో ఈ చిత్రానికి మంచి ప్రారంభ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ (మనిషి బ్రతికుండగానే ఆత్మను శరీరం నుంచి వేరు చేసే ప్రక్రియ) అనే సరికొత్త పాయింట్‌కు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే వినోదం తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం వుంది. తప్పకుండా టాక్సీవాలా విజయ్ దేవరకొండ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్‌గా ఫిల్మ్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
రేటింగ్: 3.25/5


4008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles