విజయ పాత్రికేయుడు బాపినీడు

Tue,February 12, 2019 06:47 PM

మంగళవారం ఎనభయ్యోవడిలో దివంగతులైన విజయ బాపినీడును అంతా సినీ నిర్మాత-దర్శకునిగానే స్మరించుకున్నారు. నామమాత్రంగా కొందరు పూర్వాశ్రమంలో ఆయన పత్రికలు నడిపారని ఒకటిరెండు పేర్లు గుర్తు చేసుకున్నారు. సినిమారంగంలో చిరంజీవికి కెరీర్ మలుపు తిప్పిన సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిపెట్టిన దర్శకునిగా బాపినీడు గుర్తింపు ఎవరూ కాదనలేనిది. కానీ పత్రికారంగంలో ఆయన చేసిననన్ని ప్రయోగాలు బహుశ ఎవరూ చేయలేదేమో. పాత్రికేయునిగా ఆయన కెరీర్ అంత తక్కువేమీ కాదు. చందమామకు పోటీగా వచ్చిన బాలమిత్రకు కథలు రాస్తూ కలంజీవితం ప్రారంభించిన బాపినీడు సొంతంగా బొమ్మరిల్లు అనే పిల్లల పత్రిక పెట్టారు. అది పాఠకాదరణను కూడా పొందింది. తర్వాత దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు హిందీలో గుడియా అనే పత్రిక నడిపారు. ఇక ఆయన పాత్రికేయ కెరీర్‌లో ముఖ్యమైనది విజయ పత్రిక. పత్రికలు అప్పుడప్పుడూ అనుబంధాలు ఇవ్వడం వేరు. కానీ వివిధ సెక్షన్లను అనుబంధాలుగా మలచి అన్నిటిని ఒకే బైండులో సమర్పించడం విజయ ప్రత్యేకం. పత్రికకు అనుబంధంగా సంపూర్ణ నవల, ఫ్యామిలీ సెక్షన్, పిల్లల సెక్షన్, సినిమా సెక్షన్ ఇలా మొత్తం ఐదు బౌండ్లను కలిపి ఒకేబౌండుగా కలిపి ఇచ్చేవారు. పాఠకులు ఆ పత్రికను ఎంతగానో ఆదరించారు. సినిమా సెక్షన్‌లో సినిమాల రివ్యూలు బాపినీడు రాసేవారు. కొంచెం ముక్కుకుసూటిగా, చాలా సరదాగా రాసే ఆ రివ్యూలలో రేటింగ్స్ ఇచ్చేవారు. అలాంటి సంప్రదాయం అంతకుముందు లేదు. బాపినీడు రివ్యూలకు నిర్మాతలు కూడా ఎదురుచూసేవారు.


పత్రికల నిర్వహణలో భరణి ఆయనకు సహాయంగా ఉండేవారు. తర్వాత పూర్తిగా సినిమారంగానికి వెళ్లిపోయిన తర్వాత పత్రికల బాధ్యతను బాపినీడు భరణికే అప్పగించారు. నీలిమ అనే సరసమైన పత్రికను నడిపిన బాపినీడు రమణి, రాధిక అనే బూతు పత్రికలు కూడా నడిపారు. అప్పట్లో స్టాల్‌వాళ్లు వాటిని న్యూస్‌పేపర్లో చుట్టి ఇచ్చేవారు. ఆయన సినిమాల్లోనూ బూతుకు ఓ ప్రత్యేక స్థానముండేది. ప్రధాన కథకు ప్యారలల్ బూతుట్రాక్స్ ఉండేవి.

కొందరు డిటెక్టివ్ రచయితల నవలలను ప్రచురించడమే కాకుండా స్వయంగా రావుగారి చావు వంటి డిటెక్టివ్ నవలలు కూడా బాపినీడు రాశారు.

ఇక సినిమా రంగం ఎంట్రీలో కూడా ఓ విశేషముంది. యవ్వనం కాటేసింది అనే దాసరి సినిమాకు నిర్మాతగా ఆయన సినిమారంగంలోకి ప్రవేశించినట్టు చెప్తారు. కానీ అంతకుముందు బాలచందర్ మన్మథలీల సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేశారు బాపినీడు. తమిళంలో ఉన్న సాగదీతలను కుదించి అక్కడక్కడా స్టిల్స్ వేసి నేపథ్య వివరణతో సినిమా నడుస్తుంది. ఇందుకు బోలెడంత ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే తన సినిమాను ఎడాపెడా ఎడిట్ చేసినందుకు బాలచందర్ నొచ్చుకోలేదు. పైగా బాగా చేశావు అని మెచ్చుకున్నారట.

2502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles