ఉంగరాల రాంబాబు సినిమా రివ్యూ

Fri,September 15, 2017 04:20 PM
Ungarala Rambabu cinema review

-నటీనటులు: సునీల్, మియాజార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్‌రాజ్
- దర్శకుడు: క్రాంతి మాధవ్
- బ్యానర్, నిర్మాత: యునైటెడ్ మూవీస్, పరుచూరి కిరీటి

హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా మారిన సునీల్‌కు గత కొన్నాళ్లుగా అదృష్టం కలిసిరావడం లేదు. వరుస పరాజయాలు పలకరిస్తుండటంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్న సునీల్ దర్శకుడు క్రాంతిమాధవ్‌ను నమ్ముకున్నారు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న క్రాంతిమాధవ్ తన పంథాకు భిన్నంగా కామెడీ కథాంశంతో తొలిసారి ఈ సినిమా చేశారు. ఈ సినిమాతో సునీల్ తిరిగి విజయాల బాట పట్టారా? క్రాంతిమాధవ్ అతడికి సక్సెస్‌ను అందించాడా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమవ్వడంతో రాంబాబును(సునీల్) తాతయ్యే పెంచి పెద్దచేస్తాడు. తాత చనిపోవడంతో తమకు అన్ని అప్పులే ఉన్నాయని ఆస్తులేవి లేవనే నిజం రాంబాబుకు తెలుస్తుంది. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రాంబాబు బాదం బాబా(పోసాని కృష్ణమురళి)ని ఆశ్రయిస్తాడు.

అనుకోకుండా రాంబాబుకు రెండు వందల కోట్ల నిధి దొరుకుతుంది. బాబా వల్లే తాను పోగొట్టుకున్న ఆస్తి తిరిగివచ్చిందని నమ్ముతాడు రాంబాబు. అతడి ఆఫీస్‌లోనే ఉద్యోగిగా పనిచేసే సావిత్రి(మియాజార్జ్)కు రాంబాబు చాదస్తం నచ్చదు. రాంబాబులోని మూఢనమ్మకాల్ని పోగొట్టి అతడిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. సావిత్రిని పెళ్లి చేసుకుంటే తనకు ఆస్తి నిలుస్తుందని బాబా చెప్పిన మాటలు నమ్మి రాంబాబు కూడా సావిత్రిని ప్రేమిస్తాడు. తన తండ్రి రంగానాయర్(ప్రకాష్‌రాజ్) ఒప్పుకుంటేనే తమ పెళ్లి జరుగుతుందని సావిత్రి షరతు విధిస్తుంది. కమ్యూనిస్టు నాయకుడైన రంగానాయర్ దృష్టిలో మంచివాడుగా గుర్తింపు పొందడానికి రాంబాబు ఎలాంటి తంటాలు పడ్డాడు? తన ప్రేమను ఎలా గెలుపించుకున్నాడు? డబ్బే సర్వస్వం అనుకున్న రాంబాబు మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

వినోదానికి ఎమోషన్స్‌ను మేళవించి రూపొందించిన చిత్రమిది. హబ్‌లు, సెజ్‌లు పేరిట వ్యవసాయ భూములను లాక్కోవడం సరికాదు, బీడు భూముల్లో వాటిని నెలకొల్పితే బాగుంటుందనే పాయింట్‌ను సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో కొంత తడబాటుకు లోనయ్యాడు. తాను చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత లోపించడంలో సినిమా అంతా గందరగోళంగా తయారైంది. తెరపై ఏం జరుగుతుందో, ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు. సినిమాలో దర్శకుడు ఏం చెబుతున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో అంతుపట్టకుండా ఉంటుంది. కథకుడిగా, దర్శకుడిగా ఈ సినిమాతో పూర్తిగా విఫలయ్యారు క్రాంతిమాధవ్. కామెడీ, సందేశం, ప్రేమకథా దేనిపై సరిగా దృష్టిసారించలేదు.

సునీల్ సినిమా అంటేనే కామెడీని ఆశిస్తారు ప్రేక్షకులు. ఆయన శైలి వినోదం సినిమాలో ఎక్కడ కనిపించదు. అతడి పాత్రను ఆసక్తికరంగా దర్శకుడు తీర్చిదిద్దలేకపోయారు. హీరోయిన్ మియాజార్జ్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది. గ్లామర్, అభినయపరంగా ఏమీ చేయలేకపోయింది. పవర్‌ఫుల్ కమ్యూనిస్టు లీడర్‌గా ప్రకాష్‌రాజ్ పాత్రను పరిచయం చేసిన దర్శకుడు గుర్తుంచుకోదగ్గ పాత్రగా దానిని మలచలేకపోయారు. దాంతో సాధారాణ క్యారెక్టర్‌గా మిగిలిపోయింది. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యతలేదు.

సాంకేతికపరంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. చంద్రమోహన్ సంభాషణల్లో బలం లేదు. జిబ్రాన్ బాణీలు సినిమాకు ఉపయోగపడలేదు. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఒక్క పాట లేదు. సినిమా నిడివి ఎక్కువే అన్న భావన కలుగుతుంది. సునీల్‌ను తన పంథాను మారుస్తూ చేసిన సినిమా ఇది. కామెడీ మాత్రమే కాకుండా ఎమోషన్స్‌ను పండించగలనని నిరూపించుకోవాలని తపించారు. కానీ ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. కొంతవరకు ఆయన అభిమానులను ఈ సినిమా మెప్పించే అవకాశం ఉంది.
రేటింగ్-2/5


4278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles