కోడి రామ‌కృష్ణ మృతితో శోక సంద్రంలో టాలీవుడ్

Fri,February 22, 2019 04:03 PM
tollywood condolence to Kodi Ramakrishna

శ్వాస‌కోస వ్యాధితో బాధ‌ప‌డుతూ ఈ రోజు మ‌ధ్యాహ్నం కోడి రామ‌కృష్ణ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతితో టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ శోక సంద్రంలో మునిగింది. అత్య‌ధికంగా గ్రాఫిక్స్, స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో కుటుంబ‌, గ్రామీణ‌, ఫాంట‌సీ వంటి చిత్రాలు చేశారు కోడి రామ‌కృష్ణ. ఆయ‌న తెరకెక్కించిన ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి చిత్రాలు ఇప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కుల క‌ళ్లెదుటే క‌ద‌లాడుతూ ఉన్నాయి. వంద‌కి పైగా చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కోడి రామకృష్ణ చివ‌రిగా క‌న్నడ భాష‌లో ‘నాగరహవు’ (తెలుగులో నాగభరణం) అనే చిత్రాన్ని తీసారు. ఈ చిత్రం 2016లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 10 నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ అవార్డుల‌ని ఆయ‌న అందుకున్నారు. 2012లో ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు అవార్డు కూడా అందుకున్నారు.

సినీ రంగంలో కోడి రామ‌కృష్ణ‌ది 30 ఏళ్ళ ప్ర‌స్థానం. ఆయ‌న తొలి చిత్రం చిరంజీవితో చేసిన‌ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ . ఈ మూవీ అప్ప‌ట్లో 500 రోజుల‌కి పైగా ఆడింది. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా కోడి రామకృష్ణ పనిచేశారు. తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ గ‌తంలో హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంట‌నే కోలుకున్నారు. ఇప్పుడు కూడా త్వ‌ర‌గా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వ‌స్తార‌ని అనుకున్న స‌మ‌యంలో ఆయ‌న ఇక లేర‌నే వార్త తెలుసుకున్న అభిమానుల కంట క‌న్నీరు ఆగ‌డం లేదు. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో కోడి రామ‌కృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించ‌నున్నారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

1760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles