చిన్నతనం నుంచే నాలో నటన పట్ల ఆసక్తి మొదలైంది!

Sun,May 6, 2018 07:11 PM
Tollywood comedian Kadambari kiran interview

ఆయనో కామన్‌మ్యాన్. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆస్తిపాస్తులు పెద్దగా సంపాదించుకోలేదు. కానీ ఇండస్ట్రీలో పేదవాడికి కష్టం వస్తే మాత్రం అందరికంటే ముందుంటారు. ఆ వ్యక్తే కాదంబరి కిరణ్. సహాయనటుడిగా, హాస్యనటుడిగా వందలాది చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మనం సైతం ద్వారా ఆర్థిక, అనారోగ్యసమస్యలతో బాధ పడుతున్న చిత్రపరిశ్రమలోని సామాన్యుడికి అండగా నిలుస్తున్నారు. పదిమందికి సహాయపడటంలోనే సంతోషముందని చెబుతున్నారు కాదంబరి కిరణ్. తన ప్రస్థానం బతుకమ్మతో ఇలా పంచుకున్నారు.

కాకినాడ దగ్గర గురజనాపల్లి నా జన్మస్థలం. చిన్నతనం నుంచే నటన పట్ల నాలో ఆసక్తి మొదలైంది. నాటకరంగంలో రాణించవచ్చనే ఆలోచనతో 1977లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అయితే నాటక రంగం అంతగా కలిసిరాకపోయినా టీవీ నన్ను అక్కున చేర్చుకున్నది. 1983లో తెలుగు టెలివిజన్ రంగం ప్రారంభమవ్వడం నా జీవితాన్ని మలుపుతిప్పింది. బుల్లితెరను నమ్ముకొని వృత్తిపరంగా బతుకవచ్చని నమ్మిన మొదటి వ్యక్తిని నేనే. ఆ రోజుల్లో కోటశ్రీనివాసరావు, సుబ్బరాయశర్మ, అశోక్ కుమార్, విద్యాసాగర్ ఉద్యోగాలు చేస్తూనే నటనా ప్రయత్నాలు చేసేవారు. కానీ నేను నటననే వృత్తిగా ఎంచుకున్నా. టీవీరంగంలో నా ప్రతిభను నిరూపించుకోవడానికి నిర్మాతగా, దర్శకుడిగా మారాను. పలు ధారావాహికలు, ఇతర కార్యక్రమాలూ రూపొందించాను. వాటి వల్ల అర్థికంగా చాలా నష్టపోయాను. 98 లక్షలు పోగొట్టుకున్నాను. నాకున్న బరువు బాధ్యతల కారణంగా మళ్లీ నిర్మాణరంగం జోలికి పోలేదు. ఆ తర్వాత నటననే నమ్ముకుంటూ బతుకుతున్నాను. సుకుమార్, కొరటాల శివ, వినాయక్, పూరి జగన్నాథ్ ఇలా చాలా మంది దర్శకులు నాపై ఉన్న ప్రేమతో వేషాలు ఇస్తున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటుడిగా కస్తూరి అనే సీరియల్‌లో సూర్య పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ప్రేమా జిందాబాద్‌తో సినిమాల్లోకి అరంగేట్రం చేశాను. ఆ సినిమాకు ముందు జంధ్యాలను కలవడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పటికీ ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. దాంతో జంధ్యాలను కలువడానికే చాలా కష్టాలు పడ్డాను. రచయిత ఆదివిష్ణు ద్వారా ఆయన్ని తొలిసారి కలిశాను. తన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేయమని జంధ్యాల నన్ను అడిగారు. కానీ నాకు నటన అంటే ఇష్టమని చెప్పాను. దాంతో ప్రేమా జిందాబాద్‌లో ఓ వేషం ఇచ్చారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బావా బావా పన్నీరు సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శివ, మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వుకేక.. ఇలా వందలాది సినిమాల్లో సహాయనటుడిగా చేశాను. పూరీ జగన్నాథ్ దర్శకుడిగా తెరకెక్కిన అమ్మ.. నాన్న.. ఓ తమిళ అమ్మాయిలో నేను పోషించిన బాలరాజు పాత్రంటే నాకు ఇష్టం. చనిపోయే వరకు నటుడిగానే ఉండాలన్నది నా లక్ష్యం. పాత్ర ఏదైనా నా పరిధుల మేరకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా చిత్రపరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. లవ్‌జంక్షన్, బుజ్జిబాబుతో పాటు మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. కుర్రాళ్ల రాజ్యం అనే చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టినా.. అవకాశాలు మాత్రం రాలేదు.

మనం సైతం


చిత్ర పరిశ్రమలోని కుటుంబాల్లో జరిగే వేడుకలకు ఎంతమందికి పిలుపు వెళుతుందో తెలియదుగానీ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి నాకు తప్పకుండా ఫోన్ వస్తుంది. దుఃఖసాగరంలో మునిగిపోయిన వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా జరుగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి పూర్తిచేసే బాధ్యతను నా భుజాలపై వేసుకుంటాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాను. ఎదుటివారికి సహాయం చేసినప్పుడు కృతజ్ఞతతో వాళ్లు చూసే చూపు అన్నింటికంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఆ అనుభూతినే పొందుతున్నాను. ఆర్థికంగా సంపన్నుడిని కాకపోయినా మనం సైతం రూపంలో నాకో పెద్ద కుటుంబం ఏర్పడింది. చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి అండదండలూ లేని సామాన్యుడు పడే కష్టాలేమిటో నాకు తెలుసు. అవన్నీ ప్రత్యక్షంగా అనుభవించాను. చాలామంది గొప్ప నటుడని, ఎంత పెద్ద సంభాషణనైనా అవలీలగా చెప్పగలనని పొగుడుతుంటారు. కానీ అవకాశాల్ని మాత్రం ఇవ్వరు. నాపై ప్రేమ ఉన్న కొందరు దర్శకులే అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అది కూడా నెలకు నాలుగు రోజులకు మించి పని ఉండదు. అయినా నేను ఏనాడు నిరాశ పడలేదు. పాత్రికేయుడు జి కృష్ణ మహా విద్వత్తు కలిగిన సాహిత్యకారుడు. ఆయన సహచర్యం నా ఆలోచనా విధానంలో మార్పును తీసుకొచ్చింది. పేదవాడి కష్టాన్ని తీర్చడానికి ముందడుగు వేసిన రోజునే ధనికుడినయ్యాను. కొన్ని కోట్ల కలలతో చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు. అందులో పదుల సంఖ్యలో కూడా కలలు నెరవేరవు. అవన్నీ తీరలేకపోయాయనే అసంతృప్తి దూరం చేయాలన్నదే మనం సైతం ఆశయం. సినిమా ఇండస్ట్రీలో పేదవాడు చనిపోయినా వాడి ఆశలు బతికే ఉంటాయి. తనకు జరుగరానిది ఏదైనా జరిగితే కుటుంబానికి అండగా నిలవడానికి ఓ వ్యక్తి ఉన్నాడనే మనోధైర్యాన్ని ఇవ్వడానికే కృషి చేస్తున్నాను. ఆ ధైర్యమే అవతలి వారిని బతికిస్తుందన్నది నా సిద్ధాంతం. తల్లిదండ్రులు ప్రసాదించిన జన్మకు సార్థకత ఉండాలి. పేరు తెచ్చుకోవడమొక్కటే కాకుండా తృప్తిగా బతకాలి. పేదోడిని ఆదుకోవడంలోనే ఆ సంతృప్తి నాకు దొరికింది. పది మందికి సహాయపడుతూ సంతోషంగా బతుకుతున్నాను.

ఓ రోజు చాలీచాలని జీతంతో పనిచేసే ఓ కెమెరా అసిస్టెంట్ తన భార్యకు క్యాన్సర్ వచ్చిందని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. బతికించడం కోసం సంక్రాంతి పండుగ రోజున క్యాన్సర్ ఆసుపత్రిలోకి అడుగుపెట్టాను. ఆ రోజు నుంచే పేదవాడికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాల్ని తెలియజేస్తూ నా వంతుగా తొలుత వేయి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తాను. సామాజిక మాధ్యమాల ద్వారా దాతల సహాయన్ని కోరుతాను. వారు అందజేసిన మొత్తాలకు నా ట్రస్ట్‌లోంచి కొంత జత చేస్తూ మనం సైతం ద్వారా సహాయం చేస్తున్నాను. గత ఏడాది రెండు వందల మందికి సహాయపడ్డాను. ప్రస్తుతం ప్రతి రెండు రోజులకొక సమస్యనైనా పరిష్కరిస్తున్నాం. ప్రతిరోజు ఎంతో మంది సామాన్యులు సమస్యలతో సతమతమవుతూ నా వద్దకు వస్తుంటారు. నా ఒక్కడితో మొదలైన మనం సైతం లక్షలాది మందితో బలోపేతమయ్యింది. ఒకప్పుడు ఓ నటుడు అనారోగ్యంతో బాధపడితే అందరూ కలిసి అతడిని వెలివేసేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, దిల్ రాజు, జెమినీ కిరణ్, కొరటాలశివ, హను రాఘవపూడి, శ్రీమిత్ర చౌదరి, సి.కల్యాణ్.. ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు మనం సైతంకు బలాన్నిచ్చారు. నిస్వార్థంగా నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటునందిస్తున్నారు. చిరంజీవి డబ్బులు ఇవ్వడమే కాకుండా నీ వెనకాల నేనున్నానంటూ భరోసానిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఏ సహాయం కావాలన్నా అండగా ఉంటానంటూ రెండు లక్షల వెయ్యి రూపాయలు మనం సైతంకు విరాళంగా అందజేశారు. రామ్ నామగిరి అనే ఎన్‌ఆర్‌ఐ నాతో ఎలాంటి పరిచయం లేకపోయినా చాలాసార్లు మా కార్యక్రమాలకు అండగా నిలిచారు. భవిష్యత్తులో ఆపదలో ఉన్నానంటూ పేదవాడు నన్ను సంప్రదించిన వెంటనే సహాయాన్ని అందించే స్థాయికి మనం సైతం సేవా కార్యక్రమాన్నీ విస్తరించాలనేది నా కల.
-నరేష్ నెల్కి, సెల్ : 9182777280

3592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles