తొలిప్రేమ.. సినిమా రివ్యూ

Sat,February 10, 2018 03:01 PM
Tholiprema movie review

కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్. ముకుంద కంచె వంటి చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. గత ఏడాది ఫిదా చిత్రంలో ఉన్నత భావాలు కలిగిన ప్రేమికుడి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారాయన. దాంతో వరుణ్‌తేజ్ తాజా ప్రేమకథా చిత్రం తొలిప్రేమ అందరిలో ఉత్సుకతను రేకెత్తించింది. అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయిన తొలిప్రేమ టైటిల్‌ను తిరిగి ఎంచుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి.

తొలిప్రేమ జ్ఞాపకాల్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేము. కడదాకా అవి మనల్ని వెంటాడుతుంటాయి. జ్ఞాపకాల్ని మననం చేసుకునే అందమైన ప్రయాణం తొలిప్రేమ అంటూ వరుణ్‌తేజ్ చిత్ర ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడంతో యువత ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిప్రేమ ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు నిజం చేసింది? ఈ తొలిప్రేమ జ్ఞాపకాలు ఎలాంటి హృదయానుభూతిని మిగిల్చాయి? ఈ సంగతులన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

కథ గురించి చెప్పుకుంటే..
ఆదిత్య (వరుణ్‌తేజ్) సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. ఓ రైలు ప్రయాణంలో వర్ష (రాశీఖన్నా) తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ప్రతి విషయంలో నిర్మొహమాటంగా వుంటే ఆదిత్య తన ప్రేమ గురించి వర్షకు చెబుతాడు. ఈ తర్వాత వీరిద్దరూ అనుకోకుండా ఒకే కళాశాలలో కలుస్తారు. వారి పరిచయం క్రమంగా ప్రేమకు దారితీస్తుంది. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ప్రేమికుల మధ్య అనుకోని మనస్పర్థలు తలెత్తుతాయి. ఇగో సమస్యలతో దూరమవుతారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ లండన్‌లో కలుసుకుంటారు. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? ఇద్దరి మధ్య తలెత్తిన అపార్థాలు తొలగిపోయాయా? చివరకు ఈ ప్రణయగాథ ఏ మజిలీకి చేరింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

కథలో ఏముందంటే..
తొలిచూపు ప్రేమ భావనలు, ఇగో సమస్యలు, సంయోగ వియోగాలు....ఇవన్నీ గతంలో ఎన్నో ప్రేమకథల్లో ఆవిష్కృతమయ్యాయి. తొలిప్రేమ సాధారణ ప్రేమకథే. అయితే దానిని వెండితెరపై అందంగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రథమార్థంలో నాయకానాయికల పరిచయం, ప్రేమకు దారితీసే సన్నివేశాలు మంచి ఫీల్‌తో సాగాయి. వర్ష తన ప్రేమను ఆదిత్యకు వ్యక్తం చేసే సన్నివేశం, తొలిముద్దుకోసం ప్రేమికులిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. విద్యుల్లేఖరామన్‌ను కథానాయకుడు వరుణ్‌తేజ్ అక్కా అక్కా ఆంటూ ఆటపట్టించే సన్నివేశాల్లో చక్కటి వినోదం పండింది. ప్రియదర్శి, హైపర్ ఆది తమదైన శైలి హాస్యంతో అలరించారు. కోపం, ప్రేమ భావనల కలబోతగా వరుణ్‌తేజ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగింది. కథానాయిక రాశీఖన్నా క్యూట్‌గా కనిపించింది. అనుక్షణం సంఘర్షణకులోనయ్యే పాత్రలో అద్భుతంగా రాణించింది. ఆమె కెరీర్‌లో ఉత్తమ అభినయంగా చెప్పవొచ్చు. భిన్న మనస్తత్వాలు కలిగిన నాయకానాయికల చుట్టూ భావోద్వేగాల్ని అల్లుకొని కథను ఆద్యంతం కన్విన్సింగ్‌గా నడిపించారు దర్శకుడు. ద్వితీయార్థంలో కథాగమనం కొంత మందగించినా ఎమోషన్స్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎవరూ ఎలా చేశారంటే..
ఈ సినిమాలో వరుణ్‌తేజ్-రాశీఖన్నా జోడీ చక్కగా కుదిరింది. కోపిష్టి స్వభావిగా వరుణ్‌తేజ్, అతన్ని ఎప్పుడూ అనునయించే ప్రయత్నం చేసే పాత్రలో రాశీఖన్నా చక్కటి నటనను కనబరిచారు. ముఖ్యంగా రాశీఖన్నా సన్నబడటంతో పాటు చూడచక్కనైన రూపంతో ఆకట్టుకుంది. సీనియర్ నరేష్, సుహాసినికి అర్థవంతమైన పాత్రలు దక్కాయి. తమన్ సంగీతం ఇదివరకు ఎప్పుడూ వినని కొత్త బాణీల్ని పలికించింది. మెలోడీ ప్రధానంగా పాటలన్ని ఆకట్టుకునేలా వున్నాయి. దర్శకుడు చక్కటి సంభాషణల్ని రాసుకున్నాడు. మనుషులం కదా.. ప్రేమను మర్చిపోతాం. తప్పుల్ని మాత్రమే గుర్తుంచుకుంటాం వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేముని అందంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో చిత్రీకరించిన ఉపోద్ఘాత గీతం, లండన్ అందాలు కన్నులపండువగా అనిపించాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

చివరకు చెప్పేది ఏమిటంటే..
జ్ఞాపకాల్ని తట్టిలేపే ప్రేమకథలు ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వుంటాయి. తొలిప్రేమ ఓ అందమైన అల్లికతో సాగిన ప్రేమకథ. సాధారణ కథను తనదైన సృజనతో దర్శకుడు ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా మలిచిన విధానం గొప్పగా అనిపిస్తుంది. ఎక్కడా అశ్లీలత, ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా చెప్పవచ్చు. తొలిప్రేమ వరుణ్‌తేజ్ కెరీర్‌లో మరో మంచి ప్రయత్నంగా నిలిచిపోతుంది.
రేటింగ్: 3.25/5

2987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS