సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ 'గరుడవేగ'...రివ్యూ

Fri,November 3, 2017 07:19 PM
Telugu hero rajashekar PSV Garuda Vega movie review

తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎమ్. పేరుతోనే తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించిందీ చిత్రం. రాజశేఖర్ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నారా? కెరీర్‌లో తొలిసారి యాక్షన్ సినిమా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీలో సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకుంటాడు శేఖర్(రాజశేఖర్). ఎలాంటి నేరాన్నైనా తన తెలివితేటలతో సులభంగా పరిష్కరిస్తుంటాడు. వృత్తిలో పడి కుటుంబ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అతడిపై కోపం పెంచుకుంటుంది భార్య స్వాతి(పూజా కుమార్). శేఖర్ నుంచి విడాకులు కోరుతుంది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంటాడు శేఖర్.

ఆ ఆలోచనలతోనే కారులో ప్రయాణిస్తున్న శేఖర్‌కు చిన్న ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదానికి కారకులైన ఇద్దరు వ్యక్తుల గురించి అన్వేషించే క్రమంలో లక్షల కోట్ల విలువైన మైనింగ్ స్కామ్‌కు సంబంధించిన రహస్యాలు తెలుస్తాయి. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో విదేశాలకు అక్రమంగా ఖనిజాల్ని తరలిస్తున్న ఆ స్కామ్ గుట్టును తన తెలివితేటలతో శేఖర్ ఎలా బయటపెట్టాడు? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి?నిరంజన్(అరుణ్ అదిత్) అనే హ్యాకర్‌తో శేఖర్‌కు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

వృత్తి నిర్వహణలో ఓ ఎన్‌ఐఏ అధికారి తనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. వృత్తికి, కుటుంబానికి మధ్య నలిగిపోతూనే తన బాధ్యతల్ని ఎలా చక్కబెట్టగలిగాడనే కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కమర్షియల్ హంగులకు రాజకీయ అంశాలు, మైనింగ్ స్కామ్‌లు, హ్యాకింగ్ వంటి వర్తమాన అంశాలను జోడించి కథను సిద్ధం చేసుకున్న ప్రవీణ్ సత్తారు తొలి సన్నివేశం నుంచి శుభం కార్డు వరకు బిగి సడలని స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా సినిమాను తీర్చిదిద్దారు. కథపై కంటే కథనంపై ఆయన పెట్టిన శ్రద్ధ తెరపై కనిపిస్తుంది. పోరాట ఘట్టాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల్ని తలపిస్తాయి.

కథానాయకుడిగా రాజశేఖర్‌కు ఈ సినిమా పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం తర్వాత తన ఇమేజ్‌కు అనుగుణంగా శక్తివంతమైన పాత్రలో కనిపించారాయన. ఎన్‌ఐఏ అధికారిగా సహజ నటనతో ఆకట్టుకున్నారు. అభినయానికి ప్రాధాన్యతనిస్తూ పూజా కుమార్, శ్రద్ధదాస్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళిలపై వచ్చే హాస్య సన్నివేశాలు అలరిస్తాయి. ప్రతినాయకుడిగా కిశోర్ తన సంభాషణలతో కంటే హావభావాలతో భయపెట్టారు. సన్నీలియోన్‌పై ప్రత్యేక గీతాన్ని మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కనులవిందుగా తీర్చిదిద్దారు. కథలో కీలకమైన నిరంజన్ పాత్రకు అరుణ్ అదిత్ ప్రాణప్రతిష్ట చేశారు. భారీ బడ్జెట్ చిత్రానికి నటీనటుల అనుభవం చాలా ఉపయోగపడింది.

సాంకేతికంగా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం, భీమ్స్ బాణీలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. కథపై నమ్మకంతో రాజశేఖర్ మార్కెట్ మించి ఖర్చు చేస్తూ రాజీపడకుండా ఈ సినిమా నిర్మించారు నిర్మాత కోటేశ్వరరాజు. సినిమా కోసం ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగింది.

యాక్షన్ కథాంశాల్ని, హాలీవుడ్ సినిమాల్ని ఇష్టపడే వారిని ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. వినోదం, కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడకుండా తాము నమ్మిన విలువలకు కట్టుబడి చిత్రబృందం నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ఈ చిత్రం పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

4940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles