త్రివిక్రమ్ ఆ లోటును తీర్చమన్నారు..

Sun,April 8, 2018 02:54 PM
Telugu Film young director venky kudumula exclusive interview

జీవితం అంటే స్ట్రగుల్ తప్పదు. సమస్యలు ఉన్నాయి కదా అని నమ్మిన సిద్ధాంతాన్ని, నచ్చిన మార్గాన్ని విడిచి మరోదారిని ఎంచుకోవడానికి కొంత మంది ఇష్టపడరు. చేరాల్సిన గమ్యం పట్ల పూర్తి స్పష్టత ఉంటే ఎప్పటికైనా విజయం మనల్ని తప్పక వరిస్తుంది. ఇదే యువ దర్శకుడు వెంకీ కుడుముల నమ్మిన సిద్ధాంతం. చిన్నతనం నుంచి సినిమానే శ్వాస..ధ్యాస. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి తనని వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగాన్ని కాదని సినిమానే తన లక్ష్యమని, తన జీవితం సినిమాతోనే ముడిపడి ఉందని స్ట్రగుల్స్‌ని లెక్కచేయకుండా ముందుకు సాగాడు.. చివరికి అనుకున్నది సాధించాడు. కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న వెంకీ ప్రస్థానం ఆయన మాటల్లోనే...
- రవి గోరంట్ల, సెల్ : 9182777593

మాది ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట. అక్కడే పుట్టాను. నాకు ఇద్దరు అక్కలు. ఒక చెల్లి. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను. చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడ జరిగినా తప్పకుండా పాల్గొనేవాడిని. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా చదువులో మాత్రం ఫస్ట్ ఉండేవాడిని. టెన్త్‌లో మా మండలంలో నేనే ఫస్ట్. ఇంటర్మీడియట్ కోసం విజయవాడకు వెళ్లాను. అక్కడే ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. అయినా సినిమాల వైపు మనసు లాగుతూనే ఉంది. చిన్నతనం నుంచి సినిమాలంటే అమితాసక్తి ఉండేది. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని అనుకునేవాడిని. విజయవాడలో హాస్టల్లో ఉంటున్న సమయంలో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూసేవాడిని.

నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఓ పేపర్‌లో సీరియల్‌కు నటీనటులు కావలెను అనే ప్రకటన పడింది. దాన్ని తీసుకెళ్లి మా అమ్మానాన్నలకు చూపించి ఎలాగైనా అందులో నేను నటించాల్సిందే అని వాళ్లని ఒప్పించాను. నా ఆసక్తిని కాదనలేక మా నాన్నగారు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఆ ప్రకటనతో పాటు, ఆ ప్రకటన చేసిన సంస్థ అంత జెన్యూన్ కాదని తెలిసింది. దాంతో మళ్లీ తిరిగి అశ్వారావు పేట వెళ్లిపోయాం. విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. దాంతో హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చేరాను. ఇప్పుడు సినిమాల వాళ్లకు దగ్గర కావడం ఎలా? అని ఆలోచిస్తుండగా.. కృష్ణానగర్‌లో ఉంటే బాగుంటుందని ఎవరో చెప్పారు. దాంతో కృష్ణానగర్ పక్కన ఉన్న వెంకటగిరిలో రూమ్ తీసుకొని కాలేజీకి వెళుతూనే సినిమా వాళ్ల గురించి వాకబు చేసేవాడిని. చదువు పూర్తయింది. మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉద్యోగం వచ్చింది.

నాకు మొదటి నుంచి నటున్ని కావాలని ఆసక్తి. దాంతో మహీద్రా అండ్ మహీంద్రా సంస్థలో ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఇంటి ఆడ్రస్ ఉండడంతో కాల్ లెటర్ ఇంటికి వెళ్లింది. ఆ జాబ్ లెటర్ చూసిన మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. పేరున్న కంపెనీ, మంచి సాలరీ.. అని హ్యాపీగా ఫీలయ్యారు. అయితే నాకు సినిమాలంటే ఆసక్తి అని అటే వెళతానని ఒప్పించాను. ఇంట్లో వాళ్లకు నేనంటే వళ్లమాలిన ప్రేమ, గట్టి నమ్మకం. నన్ను నన్నుగా వదిలేస్తే మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్‌లో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది. ఇవన్నీ గమనించిన మా వాళ్లు వీడు ఏదైనా సాధిస్తాడని నమ్మి నేను చెప్పినదానికి అంగీకరించారు. అయితే సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగడం నాకు తెలియదు. సినిమావాళ్లెవరూ నాకు పెద్దగా తెలియదు. ఈ దశలో నాకు దొరికిన వేదిక ఆర్కూట్, ఫేస్‌బుక్. వీటిల్లో ఖాతాలున్న సినిమావాళ్లకు మెసేజ్‌లు పంపించే వాడిని. నేను పంపించిన సందేశాలకు ప్రతీ ఒక్కరూ స్పందించేవారు.

ఫేస్‌బుక్ ద్వారానే నటుడు శ్రీనివాసరెడ్డి, శివబాలాజీ, నాగేంద్రబాబు గారు, హీరో రాజాతో ఇంకోసారి చిత్రాన్ని రూపొందించిన సుమన్ పాతూరి పరిచయమయ్యారు. నేను పెడుతున్న పోస్ట్‌లు చూసిన ఆయన నీ పోస్ట్‌లు బాగున్నాయి. చాలా బాగా రాస్తున్నావ్. నువ్వు నాతో కలిసి పనిచేస్తావా? అని అడిగారు. నాకు నటుడు కావాలని కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీతో కలిసి పని చేస్తాను కానీ మీ సినిమాలో నాకో క్యారెక్టర్ ఇవ్వాలి అన్నాను. అలాగే అన్నారు. ఆయన ద్వారా ప్రముఖ నవలా రచయిత బలభద్రపాత్రుని రమణి పరిచయమయ్యారు. ఆమె కూడా నేను రాసిన పోస్ట్‌లు బాగున్నాయని, సినిమా పట్ల చాలా ప్యాషన్ నాలో కనిపిస్తున్నదని అభినందించి ఓ రోజు నన్ను దర్శకుడు తేజ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన నీకూ నాకూ డాష్ డాష్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఆయన ఎవరిని చూసినా వారిలో ఎలాంటి టాలెంట్ ఉందో ఇట్టే చెప్పేస్తారని అంతా అంటుంటే విన్నాను. నన్ను చూసిన ఆయన రోడ్డుమీదకు తీసుకొచ్చి ఏవో కొన్ని డైలాగ్‌లు చెప్పించారు. ఆ తరువాత లోపలికి తీసుకెళ్లి నిన్ను చూస్తుంటే సాధించే వాడిలా కనిపిస్తున్నావు. నువ్వు నటుడిగా ఓకే కానీ డైరెక్షన్ టీమ్‌లో చేరు పని తెలుస్తుంది. నీ కళ్లల్లో ఏదో స్పార్క్ ఉంది. అది నితిన్ కళ్లల్లోనూ కనిపించింది. నువ్వు నా దగ్గరే ఉండిపో అన్నారు. అలా ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటుడిగానూ పని చేశాను.

తేజాగారి వద్ద పనిచేస్తున్న సమయంలో దర్శకత్వ శాఖపై మంచి అవగాహన ఏర్పడింది. చిత్రీకరణ విరామ సమయాల్లో తేజ కూర్చోవడం నేను ఎప్పుడూ చూడలేదు. భోజన సమయంలో తప్ప కూర్చునేవారు కాదాయన.

సినిమానే జీవితం.. సినిమా లేకపోతే తిండి కూడా ఉండదు అనే స్థాయిలో కఠోరంగా శ్రమిస్తారాయన. ఫలితాల విషయాన్ని పక్కన పెడితే ప్రతీ సినిమా విషయంలోనూ ఆయన ఇదే స్థాయిలో కష్టపడుతుంటారు. అందుకే ఆయనకు ఎన్ని పరాజయాలు వచ్చినా మళ్లీ విజయం వరించింది. ఆయన వల్లే నటున్ని కావాలనుకున్న నాలో దర్శకుడిని కావాలనే ఆలోచన మొదలైంది. తేజ గారి దగ్గర ఎక్కువ సినిమాలకు పనిచేస్తే ఆయన ప్రభావం నాపైన పడే ప్రమాదం ఉందని గ్రహించాను. సాధారణంగా మూడు లేదా నాలుగు చిత్రాలకు ఒకే దర్శకుడి వద్ద పనిచేస్తే వాళ్ల ప్రభావం కచ్చితంగా మనపైన పడుతుంది. అలా ఉండకూడదు. మనదైన ముద్ర కనిపించాలంటే ఎవరి దగ్గరా ఒక్క సినిమాకు మించి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే తేజ రూపొందించిన 1000 అబద్ధాలు చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే చేసి అక్కడి నుంచి తప్పుకున్నాను.

తేజ టీమ్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఫేస్‌బుక్ ద్వారా చింతకాయల రవి ఫేమ్ యోగి పరిచయమయ్యారు. ఆ సమయంలో రామ్‌చరణ్, నటిస్తున్న తుఫాన్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో నా స్టేటస్ చూసిన ఆయన వెంకీ నువ్వు రైటర్‌వా? నటుడివా? నీ స్టేటస్‌లు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. పైగా నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది. ఏం చేయాలనుకుంటున్నావ్? అని అడిగే వారు. నాకు సినిమా అంటే ఆసక్తి అని చెబితే మా టీమ్‌తో అసోసియేట్ కావాలన్నారు. రామ్‌చరణ్ సినిమా కావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమా తరువాత యోగి జాదూగాడు సినిమా మొదలుపెట్టారు. నాగశౌర్య హీరో. ఈ చిత్రానికి స్క్రిప్ట్ అసోసియేట్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమా సమయంలోనే హీరో నాగశౌర్యతో పరిచయం ఏర్పడింది. అది మంచి అనుబంధంగా మారింది. నాగశౌర్యకు నేనంటే గట్టి నమ్మకం ఏర్పడింది. నువ్వు దర్శకుడిగా పరిచయయ్యే తొలి సినిమా నాదే అని అప్పుడే చెప్పాడు.

నేను ఇంతవరకు పనిచేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే. ఒక్క హిట్ సినిమాకైనా పనిచేయాలి. అప్పుడే దర్శకుడిగా మారాలి అనుకున్నాను. నా అదృష్టం కొద్ది నా స్నేహితుడి నాన్న ఏపీ నరేందర్‌రెడ్డి నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మంచి మిత్రులు. ఆయనే రాధాకృష్ణగారికి ఫోన్ చేసి నా గురించి చెప్పారు. అప్పుడే అ ఆ మొదలవుతున్నది. నాకు త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇద్దరిలో ఎవరి దగ్గరైనా పనిచేయాలనుకున్నాను. లక్కీగా త్రివిక్రమ్ గారి వద్ద పనిచేసే అవకాశం దొరికింది. ఒక రోజు త్రివిక్రమ్‌గారి దగ్గరికి వెళ్లి కలిశాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన తరువాత ఇప్పటి వరకు నా దగ్గర పనిచేసిన వాళ్లల్లో ఎవరూ దర్శకులు కాలేదు. నువ్వైనా ఆ లోటును తీర్చు అన్నారు. అలా అ ఆ సినిమాకు పనిచేశాను. ఈ సినిమా తరువాత నాగశౌర్య ఫోన్ చేసి మనం కలిసి సినిమా చేస్తున్నాం అన్నాడు. అలా దర్శకుడిగా నా తొలి సినిమా ఛలో పట్టాలెక్కింది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత జరిగిందంతా అందరికీ తెలిసిందే!

నాన్న వ్యవసాయం చేస్తూనే స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. దాంతో అశ్వారావు పేటలో నన్ను అందరూ రంగారావుగారబ్బాయి అని పిలుస్తుండేవారు. అలా అందరూ పిలువడం గమనించిన నేను ఎప్పటికైనా మిమ్మల్ని వెంకీ వాళ్ల నాన్న అనేలా చేస్తాను అని చెప్పేవాడిని. నేను అలా అన్నప్పుడు అంత కన్నా ఆనందం ఏముంటుంది నాకు అనేవారు.

2999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles