సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ

Wed,October 2, 2019 02:21 PM

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంతో సినిమా చేయాలని చిరంజీవి పన్నెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఆయన కలను తనయుడు రామ్‌చరణ్‌ ‘సైరా’ సినిమాతో నెరవేర్చారు. అమితాబ్‌బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి లాంటి భిన్న భాషలకు చెందిన అగ్ర నటుల కలయికలో రూపొందిన ఈచిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న సురేందర్‌రెడ్డి ఈ చారిత్రక చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఉయ్యాలవాడ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తెరకెక్కించి తమ మనోభావాల్ని దెబ్బతీసారంటూ నరసింహారెడ్డి వారసులు కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎన్నో అవరోధాలు, వివాదాల్ని దాటుకుంటూ ఎట్టకేలకు నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
రేనాటి గడ్డపై ఉన్న సంస్థానాల్ని ఆక్రమించిన ఆంగ్లేయులు పాలెగాళ్లకు భరణాలు చెల్లిస్తూ తమకు అనుకూలంగా పాలనను కొనసాగిస్తుంటారు. ఆంగ్లేయుల శిస్తు వసూళ్లు, అక్రమాలపై నొస్సం పాలెగాడు జయరామిరెడ్డి దత్తపుత్రుడైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నతనం నుంచే ఎదురించడం మొదలుపెడతాడు. పాలెగాడుగా రాజ్యాన్ని చేపట్టిన నరసింహారెడ్డి ప్రజాపాలకుడిగా అందరి అభిమానాన్ని చూరగొంటాడు. కరువు కారణంగా శిస్తు కట్టడానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అంగ్లేయులు మాత్రం ఊళ్లపై పడి దోచుకుంటారు. అడ్డువచ్చిన వారిని చంపేస్తుంటారు. నరసింహారెడ్డికి భరణం చెల్లించడానికి నిరాకరిస్తారు. వారి అన్యాయాలపై ఆగ్రహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోవెలకుంట్లలోని ఆంగ్లేయుల రెజిమెంట్‌పై దాడిచేసి బ్రిటీష్‌అధికారి జాక్సన్‌ చంపుతాడు. దాంతో బ్రిటీష్‌ ప్రభుత్వం నరసింహారెడ్డిపై దోపిడిదొంగ అనే ముద్రవేసి అతడిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అతడి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. ప్రజాబలంతో ఒంటరిగా పోరును మొదలుపెట్టిన నరసింహారెడ్డికి రేనాటిలోని ఇతర పాలెగాళ్లు చేయూతనిస్తారు. వారి సహకారంతో ఆంగ్లేయులపై నరసింహారెడ్డి ఎలా పోరాటం సాగించాడు? అతడి ఉద్యమంలో ఒవుకు రాజు(సుదీప్‌), వీరపాండి(విజయ్‌ సేతుపతి), గోసాయివెంకన్న(అమితాబ్‌బచ్చన్‌), వీరారెడ్డి(జగపతిబాబు)లక్ష్మి(తమన్నా)ల పాత్ర ఏమిటి? తనను ప్రాణంగా ప్రేమించిన భార్య సిద్దమ్మ(నయనతార)కు ఇచ్చిన మాటను నరసింహారెడ్డి నిలబెట్టుకున్నాడా? తన మరణంతో అసలైన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజల్లో ఎలా రగిల్చాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.


ఆంగ్లేయుల్ని ఎదురించి పోరాడిన తొలితరం స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాలను తీసుకొని రూపొందించిన చిత్రమిది. తనకు రావాల్సిన భరణాన్ని అడిగినందుకు అవమానించిన ఆంగ్లేయులపై అతడి సాగించిన స్ఫూర్తిదాయక పోరాటం ఆధారంగా చేసుకుంటూ దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చారిత్రక పోరాటానికి కుటుంబ బంధాల్ని, ప్రేమ, హీరోయిజాన్ని మేళవిస్తూ కథనాన్ని అల్లుకున్నారు. ప్రథమార్థ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని, ధైర్యసాహసాల్ని చాటిచెబుతూ తీర్చిదిద్దారు. అవన్నీ నెమ్మదిగా సాగుతూ సినిమా నిడివిని పెంచాయి. నరసింహారెడ్డిలోని ఆవేశాన్ని అదుపుచేస్తూ అతడిని లక్ష్యసాధన వైపు గురువు గోసాయి వెంకన్న ఎలా నడిపించాడో చూపించాల్సింది. కానీ దర్శకుడు ఆ సన్నివేశాలపై కాకుండా ప్రజల కోసం నిరంతరం తపనపడే పాలకుడిగా నరసింహారెడ్డిని కీర్తిని చాటడంతో పాటు లక్ష్మితో నరసింహారెడ్డి ప్రేమాయణం, భార్య సిద్ధమ్మతో అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. కోవెల కుంట్ల ఆంగ్లేయుల సంస్థానంపై నరసింహారెడ్డి దాడిచేసే సన్నివేశంతోనే కథ వేగం అందుకుంటుంది. ఇతర పాలెగాళ్ల తోడ్పాటుతో అలుపెరకుండా అతడు సాగించిన యుద్ధం ప్రధానంగా ద్వితీయార్థం సాగుతుంది. తనను ఎదురించడానికి ఆంగ్లేయులు పన్నిన కుట్రల్ని నరసింహారెడ్డి తన ధైర్యసాహసాలతోఎలా తిప్పికొట్టాడో చూపించిన యుద్ధసన్నివేశాల్లో కొన్ని ఆసక్తిని పంచుతాయి. అయితే మూడు వందల ఆంగ్లేయుల సైన్యాన్ని ప్రజాబలంతో నరసింహారెడ్డి ముట్టుబెట్టే కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఉత్కంఠ లోపించింది. ఆ యుద్దంలో నరసింహారెడ్డి ధైర్యాన్ని చూసిన పాలెగాళ్లు అతడికి మద్దతుగా వచ్చారంటూ చూపించడం కొంత నమ్మశక్యంగా అనిపించదు. ఈ కీలకమైన ఎపిసోడ్‌ను కన్వీన్సింగ్‌గా రాసుకుంటే బాగుండేది. ద్వితీయార్థం మొత్తం యుద్ధ సన్నివేశాలు తప్ప కథను ముందుకు నడిపించే ఎమోషన్స్‌ కనిపించవు. నరసింహారెడ్డిని ఓడించడం అసాధ్యం అని గ్రహించి తమ కుయుక్తులతో ఎలా పట్టుకొని ఉరితీయడం, తాను చనిపోతూ నరసింహారెడ్డి ప్రజల్లో రగిల్చిన స్ఫూర్తిని పతాక ఘట్టాల్లో హృద్యంగా ఆవిష్కరించారు.

తొలి నుంచి ‘సైరా’ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ అని చెబుతూ వచ్చిన చిత్ర బృందం సినిమా విడుదల సమీపించిన తర్వాత తమ మాట మార్చారు. ఉయ్యాలవాడ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తెరకెక్కించి తమ మనోభావాల్ని దెబ్బతీసారంటూ.. తమకు నిర్మాత రాయల్టీ చెల్లించాలంటూ నరసింహారెడ్డి వారసులు కోర్టుకెక్కడంతో. ఉయ్యాలవాడ జీవితంలోని కొన్ని చారిత్రక సంఘటనలకు కాల్పానిక అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు. వారు చెప్పినట్లుగానే చరిత్ర కంటే చిత్రబృందం తీసుకున్న స్వేచ్ఛ సినిమాలో ఎక్కువగా ఉంది. నరసింహారెడ్డి గురించి చరిత్రలో, పలు గ్రంథాల్లో ఉన్న వివిధ గాథల్లోని నుంచి సానుకూల అంశాలను మాత్రమే తీసుకొని సినిమాను తెరకెక్కించారు. లక్ష్మితో నరసింహారెడ్డి ప్రేమగాథ, ఝాన్సీ లక్ష్మీభాయిలో నరసింహారెడ్డి నింపిన స్ఫూర్తి...ఇలా సినిమాలో చాలా అంశాల్ని కమర్షియాలిటీ కోసం తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే ఇదే తరహాలో పతాక సన్నివేశాల్లో కూడా మార్పు చేసుకుని..ఉయ్యాలవాడ తలను నరికే కూడా మార్చుకుంటే మరింత బాగుండేది. స్టెలిష్‌ ఫిలింమేకర్‌గా పేరుతెచ్చుకున్న సురేందర్‌రెడ్డి చారిత్రక కథాంశంతో తొలిసారి ఈసినిమా చేశారు. యుద్ద సన్నివేశాల్ని, హీరోయిజాన్ని రొమాంచితంగా ఆవిష్కరించడాకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. చారిత్రక కథను ఆసక్తికరంగా నడిపించడానికి యాక్షన్‌ సన్నివేశాలపై పట్టుంటే సరిపోదు. కథను నడిపించే బలమైన సంఘర్షణ, భావోద్వేగాలు పండాలి. వాటిపై దృష్టిసారిస్తే సినిమా మరోస్థాయిలో ఉండేది.

నరసింహారెడ్డి పాత్రలో పతాకస్థాయిలో చిరంజీవి నటనను కనబరిచారు. తన అనుభవంతో పాత్రకు ప్రాణంపోశారు. పతాక ఘట్టాల్లో ఆయన నటన మనసుల్ని కదలిస్తుంది. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో వయోభారం కారణంగా చురుకుగా కదలలేకపోయారు. సినిమా పూర్తి భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. అవుకురాజుగా సుదీప్‌ ప్రతినాయకఛాయలతో సాగే మంచివాడైన రాజుగా సుదీప్‌ నటన ఆకట్టుకున్నది. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ కనిపించేది కొద్ది క్షణాలే అయినా తన నటనతో ఆకట్టుకున్నారు. నయనతార, తమన్నా, విజయ్‌సేతుపతి, జగపతిబాబు ఇలా మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అతిథి పాత్రలకే పరిమితమయ్యారు.
సాంకేతికంగా రత్నవేలు ఛాయాగ్రహణం, రాజీవన్‌ ఆర్ట్‌ వర్క్‌ సినిమాకు ప్రాణంపోసింది. 18 దశకం నాటి కాలాన్ని తన కళప్రతిభతో అద్భుతంగా ఆవిష్కరించారు రాజీవన్‌. పాలేగాళ్ల కోటలు, ఆంగ్లేయుల సంస్థానాలు ఆ నాటి కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళతాయి. తన తండ్రి కలను నెరవేర్చడం కోసం రామ్‌చరణ్‌ ఎక్కడ రాజీపడకుండా సినిమాను నిర్మించారు.మిగతా సాంకేతిక వర్గం నుంచి దర్శకుడు సురేందర్‌రెడ్డికి చక్కటి తోడ్పాటు లభించింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు గతంలో ఇతర సినిమాల్లో చూసినట్లుగా అనిపించినా సైరా చిరంజీవి అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. వాస్తవ అంశాలకు ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతని పంచుతుంది. చరిత్రను యథాతధంగా తీసుకోకుండా చిరు ఇమేజ్‌ తగినట్లుగా పూర్తి కమర్షియల్‌ అంశాలతో నిండిన ‘సైరా నరసింహా రెడ్డి’కి దసరా సెలవులు కలిసిరావడంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లకు కొదువ లేదనిపిస్తుంది.
రేటింగ్‌: 3/5

8959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles