శ్రీదేవిని చంపింది ఇండియన్ టీవీ ఛానళ్లే !

Thu,March 1, 2018 01:01 PM
Sridevi killed by Indian TV media, alleges Khaleej Times

హైదరాబాద్: ప్రముఖ నటి శ్రీదేవిని ఇండియన్ మీడియానే హత్య చేసిందని దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ అభిప్రాయపడింది. శ్రీదేవి మృతిపై భారతీయ టీవీ ఛానళ్లు నడిపిన ప్రత్యేక కథనాలను ఆ పత్రిక తీవ్రంగా తప్పుపట్టింది. వాస్తవాలను తెలుసుకోకుండా, అసత్య, అసందర్భ కథనాలతో ప్రజలను తప్పుదోవపట్టించారని ఆ సంస్థ పేర్కొన్నది. శ్రీదేవి మృతిపై ఇవాళ ఖలీజ్ టైమ్స్ ప్రత్యేక ఎడిటోరియల్‌ను రాసింది. ఆ కథనంలో మన ఇండియా పరువును తీసింది ఆ సంస్థ. చాలా మంది భారతీయలు ఇండ్లల్లో బాత్‌టబ్‌లు ఉండవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. టీవీ ఛానళ్లు రిపోర్టింగ్ చేసిన శైలిని ఆ సంస్థ తీవ్రంగా పరిగణించింది. దుబాయ్‌లోని జుమేరా హోటల్ రూమ్‌లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై క్రైమ్ సీన్‌ను పరిశీలించకుండానే ఇండియన్ మీడియా చేసిన హంగామాను దుబాయ్ మీడియా తప్పుపట్టింది.

బాత్‌టబ్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ.. లేనిపోని ప్రశ్నలతో టీవీ ఛానళ్లు అనైతిక రిపోర్టింగ్‌కు పాల్పడినట్లు దుబాయ్ సంస్థ ఆరోపించింది. సుబ్రమణ్యస్వామి, అమర్ సింగ్ లాంటి రాజకీయ నాయకులు చేసిన అనుచిత కామెంట్స్‌ను కూడా ఆ సంస్థ నిర్ద్వందంగా తప్పుపట్టింది. బాత్‌టబ్ సన్నివేశాలను రిక్రియేట్ చేయడానికి ప్రత్యేక నిపుణులను రప్పించి మరీ టీవీ ఛానళ్లు హీనంగా ప్రవర్తించాయని తన కథనంలో పేర్కొన్నది. అసలు క్రైమ్ సీన్‌లో ఉన్నది తాము ఒక్కరమే అని, కానీ తాము ఇస్తున్న సమాచారాన్ని భారతీయ మీడియా వక్రీకరిస్తూ విభిన్న కథనాలను ప్రసారం చేసిందని ఖలీజ్ వెల్లడించింది. చిన్న అంశాన్ని కూడా వదలకుండా, తమ రిపోర్టర్లు క్షణం క్షణం సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని, కానీ ఆ సమాచారంతో కొందరు ప్రేత కథలు అల్లారని ఆ సంస్థ విమర్శించింది. నాన్ జర్నలిస్టులు, షాడో క్యారక్టర్లతో శ్రీదేవిని ఇండియన్ టీవీ ఛానళ్లే హత్య చేశాయన్న అభిప్రాయాన్ని ఖలీజ్ వ్యక్తం చేసింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

7032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles