శ్రీదేవి లోకాన్ని వీడి ఏడాది.. భావోద్వేగంలో అభిమానులు

Sun,February 24, 2019 07:09 AM

దివికెగిసిన అందాల తార శ్రీదేవి. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి ఓ క‌ల‌గానే ఉంది. స‌మీప బంధువు పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసింది . రాష్ట్రం, దేశం అని కాకుండా ప్ర‌పంచ‌మంతటా ఉన్న ఎంద‌రో అభిమానుల ఆద‌ర‌ణ పొందింది శ్రీదేవి. నాలుగో ఏటనే తమిళ సినిమాలో నటించింది శ్రీదేవి. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా బాలనటిగా అనేక పాత్ర‌లు పోషించింది . జూలీ సినిమాతో హిందీలోకి అడుగిడిన శ్రీదేవి తన పదహారో ఏట పదహారేళ్ల వయసు సినిమాలో చేసింది. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్. ఇప్పుడు కూడా శ్రీదేవి పేరు చెబితే... చాలామందికి ఆ సినిమా గుర్తొస్తుంది.


గ్లామరూ, నటనా పటిమ ఉన్న శ్రీదేవి ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన సినిమాల్లో తిరుగులేని మహారాణిగా కొన్నేళ్లు రాజ్యమేలింది. శ్రీదేవిని గ్లామర్ గాళ్ అని, బ్యూటీ క్వీన్ అనీ అనేవాళ్లు. హీరోలతో డ్యూయెట్లు పాడడమే కాదు...చాలా సినిమాల్లో మనల్ని కంట తడిపెట్టించే రోల్స్ కూడా వేసింది. పెళ్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సిరిదేవి ఇంగ్లీష్ – వింగ్లీష్ మూవీలో యాక్ట్ చేసి తన నటనా పటిమగాని, గ్లామర్ కానీ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది.

హీరోలతో పోటీ పడుతూ ఎక్కువ కాలం సినిమాలు చేసే హీరోయిన్స్ చాలా అరుదు. అలాంటివాళ్లు హీరోల మాదిరే కొన్ని వందల సినిమాలు చేయగలరు. ఎక్కువకాలం ఈ రంగంలో ఉండగలరు. శ్రీదేవి వంటి మోస్ట్ టాలెంటెడ్ ప‌ర్స‌న్స్‌కే అది పాజిబుల్ అవుతుంది. ఒకప్పటి ఇండియాస్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి 54 ఏళ్ల వ‌య‌స్సులో 300 సినిమాలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. చివ‌రిగా మామ్ చిత్రంలో న‌టించిన శ్రీదేవి జీరోలోను ఓ ముఖ్య పాత్ర పోషించి అల‌రించింది.

వయసు మీదపడుతున్నా గ్లామర్ ను మెయిన్ టెయిన్ చేయడం మామూలు విషయం కాదు. అది టాలీవుడ్ బాలీవుడ్ రంగాల్లో శ్రీదేవికే సాధ్యమైంది. నిజానికి శ్రీదేవి శ్రీదేవే. సినిమాల్లో నటించినా, ర్యాంప్ మీద వాక్ చేసినా శ్రీదేవి అందరినీ ఇట్టే ఎట్రాక్ట్ చేసేస్తుంది. దటీజ్ శ్రీదేవి. గ్లామర్ కాపాడుకోవడం అల‌నాటి నటీమణులకే కాదు, తనకూ చేతనవునని నిరూపించుకున్న అందాల భామ శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం ప్ర‌తి ఒక్క‌రిని కంట త‌డిపెట్టించింది . ఆమె లేర‌నే వార్త‌ని ఇప్ప‌టికి ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా తన ప్రియురాలు అంతర మోతీవాలాని వివాహ‌మాడ‌గా, ఆ వివాహ వేడుక‌కి దుబాయ్ వెళ్ళిన శ్రీదేవి పెళ్ళిలోను చాలా సంద‌డి చేశారు. కాని అనుకోకుండా శ్రీదేవి బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపోవ‌డం అత్యంత విషాదక‌రం. నేటితో శ్రీదేవి చ‌నిపోయి ఏడాది పూర్తి కావ‌డంతో ఆమె జ్ఞాప‌కాల‌ను అభిమానులు నెమ‌ర‌వేసుకుంటున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి 14న దివంగత శ్రీదేవి ప్రథమ వర్ధంతిని చెన్నైలోని తన నివాసంలో నిర్వ‌హించారు. తిథి ప్ర‌కారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిపారు. ఈ కార్యక్రమంలో బోనికపూర్, జాహ్నవి, కుషీ కపూర్, అనిల్ కపూర్ సతీమణి సునీత, అజిత్ కుటుంబ స‌భ్యులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. శ్రీదేవి భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో ఇప్ప‌టికి అల‌రిస్తూనే ఉంది. ఆమె వ‌ర్ధంతి సంద‌ర్భంగా శ్రీదేవి నివాళులు అర్పిద్ధాం.

1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles