నాని 'జెర్సీ' రివ్యూ

Fri,April 19, 2019 01:30 PM

క్రికెట్ నేపథ్యంలో మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో వచ్చిన సినిమాలు తక్కువేనని చెప్పవచ్చు. క్రికెట్‌కు ఉన్న ఆకర్షణను ఉపయోగించుకునే ప్రయత్నం తెలుగు హీరోలెవరూ ఇప్పటివరకు చేయలేదు. తొలిసారి హీరో నాని జెర్సీతో ఈ దిశగా అడుగు వేశాడు. కథాంశాలు, పాత్రల పరంగా కొత్తదనం కోసం ప్రయత్నించే నాని కెరీర్‌లో తొలిసారి స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ కథను ఎంచుకొని చేసిని సినిమా ఇది. మళ్లీరావా సినిమాతో దర్శకుడిగా తొలి అడుగులోనే ప్రతిభను చాటుకున్న గౌతమ్ తిన్ననూరి ఫిక్షనల్ కథాంశానికి కుటుంబ అనుబంధాలు, క్రికెట్ ఆటను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


అర్జున్(నాని) 1980 దశకంలో రంజీల్లో గొప్ప క్రికెటర్‌గా పేరుతెచ్చుకుంటాడు.దేశం తరపున ఆడాలన్నది అతడి కల. రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆ అవకాశం అతడికి దక్కదు. రంజీల్లో 36 సెంచరీలు చేసిన అతడి ప్రతిభను విస్మరించి మరొకరికి అవకాశాలు ఇస్తుంటారు. తన కోరిక నెరవేరకపోవడంతో క్రికెట్‌కు దూరమైన అర్జున్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోతాడు. కానీ వృత్తిలో అవినీతికి పాల్పడ్డాడనే కారణంతో ఆ ఉద్యోగం నుంచి అతడిని తొలగిస్తారు. దాంతో కుటుంబ భారాన్ని అర్జున్ భార్య సారా(శ్రద్ధాశ్రీనాథ్) తీసుకుంటుంది. బాధ్యతల్ని పూర్తిగా విస్మరించిన అర్జున్ అందరి దగ్గర అప్పులు చేస్తూ స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. చివరకు తన కొడుకు నాని ఆశపడిన చిన్న బహుమతిని కొనివ్వలేని స్థితికి చేరుకుంటాడు. తన కలకు, జీవితానికి మధ్య సంఘర్షణకు లోనైన అర్జున్ మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంటాడు. 36 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టిన అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? క్రికెట్ ఆడాలనే అతడి కల నెరవేరిందా?లేదా?కుటుంబం, సమాజం దృష్టిలో చేతకానివాడిగా ముద్రపడిన అర్జున్ చివరకు విజేతగా ఎలా నిలిచాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

కుటుంబ అనుబంధాలు, తండ్రీకొడుకుల అనురాగానికి క్రికెట్ నేపథ్యాన్ని మేళవించి భావోద్వేగభరితంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించారు. వయసు లక్ష్యానికి అడ్డుకాదనే సందేశాన్ని అందించారు. 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా నిరూపించుకోవాలనే అర్జున్ తపనను హృదయాల్ని హత్తుకునేలా చూపించారు. ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. అవాంతరాలు ఎదురయ్యాయని ప్రయాణాన్ని మధ్యలోనే ఆపడం కాకుండా లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించవద్దని అర్జున్ పాత్ర ద్వారా చక్కగా చూపించారు.

తన లక్ష్యానికి, ఉద్యోగానికి దూరమై కుటుంబ బాధ్యతలతో అర్జున్ సతమతమయ్యే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని ఎమోషనల్‌గా నడిపించారు దర్శకుడు. తన కొడుకు సంతోషం కోసం అర్జున్ పాత్ర ఎదుర్కొనే సంఘర్షణ రియలిస్టిక్‌గా ఉంటుంది. అర్జున్,నాని పాత్రల నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. తన కొడుకు దృష్టిలో ఎప్పటికీ హీరోగానే ఉండాలనే లక్ష్యంతో మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకోవడం, రంజీ జట్టులోకి తిరిగి ఆటగాడిగా ఎంపికయ్యే సన్నివేశాల్ని వాస్తవికతకు దగ్గరగా రాసుకున్నారు.

36 ఏళ్ల వయసులో క్రికెట్ పట్ల తనలోని మక్కువ కొంత కూడా తగ్గలేదని ప్రపంచానికి అర్జున్ ఎలా చాటిచెప్పాడో ద్వితీయార్థంలో చూపించారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా చివరకు ఎలా లక్ష్యాన్ని చేరుకున్నాడనేది స్ఫూర్తివంతంగా ఆవిష్కరించారు. ద్వితీయార్థం మొత్తం క్రికెట్ ఆట నేపథ్యంలో సాగుతుంది. తన కొడుకు కలను ఇరవై మూడేళ్ల తర్వాత అర్జున్ ఎలా తీర్చాడో పతాక పతాక ఘట్టాల్లో విభిన్నంగా చూపించారు.

సినిమా ఆద్యంతం నెమ్మదిగా సాగింది. అయితే కథను ఎటువంటి డైవర్షన్స్ లేకుండా నడిపించడం వల్ల ఈ భావన కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థం మొత్తం అర్జున్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లపైనే ఎక్కువగా దృష్టిసారించారు దర్శకుడు. ఈ సన్నివేశాలు క్రికెట్ పట్ల ఇష్టం ఉన్న ప్రేక్షకుల్ని మాత్రమే మెప్పిస్తాయి. అయితే కథ విషయంలో పూర్తి సహజంగా వెళ్లకుండా కాస్త సినిమా టిక్ అంశాలు చేర్చడం వల్ల అర్జున్ తన లక్ష్యాన్ని సింపుల్‌గా చేరుకున్నట్లుగా చూపించారు.

చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నిజాయితీగా తాను ఏం చెప్పాలని అనుకున్నాడో ఆ కథను తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. కథ గమనాన్ని పక్కదారి పట్టించే సన్నివేశాలు సినిమాలో కనిపించవు. కామెడీని కూడా కథలో అంతర్భాగంగా రాసుకున్న తీరు బాగుంది. క్రికెట్ ఆటకు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సమంగా మేళవించిన తీరు బాగుంది. క్లిష్టతరమైన పాయింట్‌ను సింపుల్‌గా అందంగా తెరపై చూపించారు. మూడు కాలల మధ్య తేడాల్ని చూపిస్తూ కథను నడిపిన విధానం బాగుంది. ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా తన వైవిధ్యతను చాటుకున్నారు.
క్రికెటర్, భర్తగా, తండ్రిగా భిన్న పార్శాలున్న పాత్రల్లో నాని జీవించారు. వైవిధ్యతను ప్రదర్శిస్తూ నటించిన తీరు మెప్పిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో సహజమైన నటనను ప్రదర్శించారు. అర్జున్ పాత్రకు వందశాతం న్యాయంచేశారు. శ్రద్ధాశ్రీనాథ్ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. భర్తకు అమితంగా ప్రేమిస్తూనే అతడిలో మార్పు కోసం తపనపడే భార్యగా చక్కటి నటనను కనబరిచింది. నాని కొడుకు పాత్రను పోషించిన బాలనటుడి అభినయం బాగుంది. సహాయకోచ్ మూర్తి పాత్రలో సత్యరాజ్ తన అనుభవంతో పాత్రలో ఒదిగిపోయాడు. ప్రవీణ్ తనదైన పంచ్ డైలాగ్‌లతో ప్రథమార్థ నవ్వించారు. సాంకేతికంగా అనిరుధ్ నేపథ్య సంగీతం సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా అందంగా కుదిరాయి.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని పంచే చిత్రమిది. క్రికెట్ ఆటను ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ పోటీగా లేకపోవడం, వేసవి సెలవుల అడ్వాంటేజీతో ఈ క్రికెట్ నేపథ్య సినిమా బాక్సాఫీస్ లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటుంది. దీంతో జెర్సీకి రెండు వారాల పాటు తిరుగు ఉండకపోవచ్చు.

రేటింగ్ 3.25/5

5521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles