‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ రివ్యూ..

Thu,December 7, 2017 04:26 PM
saptagiri llb Movie Review


తెలంగాణ అందాలను ఆవిష్కరిస్తూ తెలుగుతెరపై వచ్చిన సినిమాలు అరుదనే చెప్పవచ్చు. ఇక్కడి ప్రకృతి రమణీయతను, అడవితల్లి సొబగులను తమ సినిమాల్లో చూపించిన దర్శకనిర్మాతలు చాలా తక్కువమందే ఉన్నారు. నిర్మాత రవికిరణ్ మాత్రం తాను పుట్టిపెరిగిన అదిలాబాద్‌ జిల్లాపై ఉన్న మమకారాన్ని సినిమా ద్వారా చాటుకున్నారు. తాను నిర్మించిన సప్తగిరి ఎల్‌ఎల్‌బీలో పెన్‌గంగా తీర సోయగాలను అద్భుతంగా చూపించారు. స్వచ్ఛమైన పల్లె అందాలను కనులవిందుగా ఆవిష్కరిస్తూ సినిమాను రూపొందించారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తర్వాత హాస్యనటుడు సప్తగిరి, నిర్మాత రవికిరణ్ కలయికలో రూపొందిన చిత్రం సప్తగిరి ఎల్‌ఎల్‌బీ. సందేశాత్మక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చరణ్ లక్కాకుల దర్శకత్వం వహించారు.

ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన సప్తగిరి (సప్తగిరి) పెద్ద లాయర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. తన ఊరిలో అతడి కోరిక నెరవేరకపోవడంతో హైదరాబాద్‌కు వస్తాడు. చిన్నచితకా కేసులు చేపట్టిన అతడికి అన్నింట్లో అపజయమే ఎదురవుతుంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు బిచ్చగాళ్ల మరణానికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ కేసును దేశంలోనే గొప్ప లాయర్‌గా పేరు గాంచిన రాజ్‌పాల్ (సాయికుమార్) చేపడతాడు. తన తెలివితేటలతో దోషులను శిక్ష నుంచి తప్పిస్తాడు. ముగిసిపోయిందనుకున్న ఈ కేసును సప్తగిరి తిరిగిచేపడతాడు. చనిపోయింది బిచ్చగాళ్లు కాదని రైతులు అనే నిజాన్ని అందరికి తెలియజేస్తాడు. పేద రైతులకు న్యాయం చేయడానికి సప్తగిరి ఎలాంటి పోరాటం చేశాడు? ఆ కేసులో ఎలా గెలిచాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
saptagiri-llbm
న్యాయం విషయంలో ధనిక, పేదలకు మధ్య ఉన్న అంతరాల్ని ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రమిది. న్యాయం కోసం కోర్టుల్లో అడుగుపెట్టిన పేదవారికి అన్యాయమే జరుగుతుందని, డబ్బు, పలుకుబడి, అధికారంతో పాటు పలు అంశాలు న్యాయవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాలను ఆలోచనాత్మకంగా చూపించిన సినిమా ఇది. రాజ్యాంగం కల్పించిన అందరికి సమన్యాయం అనే హక్కు అమలులో జరుగుతున్న అవకతవకలని సినిమాలో చర్చించారు. ముఖ్యంగా సాక్ష్యాలు, వాయిదాల పేరుతో న్యాయం విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని, దానివల్ల సామాన్యుడు పడే అవేదనను అర్థవంతంగా వెండితెరపై చూపించారు దర్శకనిర్మాతలు.

జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్న హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బీ ఆధారంగా రూపొందిన చిత్రమిది. సందేశాత్మక కథాంశానికి కమర్షియల్ హంగులను మేళవించి జనరంజకంగా సినిమాను తీర్చిదిద్దారు. మాతృకతో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. రైతు సమస్యల ఇతివృత్తాన్ని ఎంచుకోవడం బాగుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా న్యాయస్థాన పరిసరాల్ని, న్యాయవాదుల జీవితాల్ని, కేసులు పరిష్కరించే క్రమంలో వారికి ఎదురయ్యే పరిమాణాల్ని కళ్లకు కట్టినట్లుగా వాస్తవిక కోణంలో తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సినిమాటిక్ ఫీల్‌ను కాకుండా నిజమైన కోర్టు వాతావరణాన్ని చూస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు పంచుతుంది. సప్తగిరి కేసు చిక్కుముడిని ఒక్కొక్కటికే విప్పే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా పతాక ఘట్టాల్లో సప్తగిరి చెప్పే ప్రతి డైలాగ్ ప్రేక్షకుడిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. దర్శకుడిగా చరణ్ లక్కాకులకు ఇదే తొలి చిత్రమైన ఎంతో అనుభవజ్ఞుడిలా రూపొందించారు. క్లిష్టతరమైన కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు. రీమేక్‌ను యదాథతంగా కాపీ చేయకుండా ఆసక్తికరంగా నడిపించాడు. వినోదం, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రతిభను చాటుకున్నాడు. కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించడంలో చాలా వరకు విజయవంతమయ్యారు.
saptagiri-llbm3
తెలుగు చిత్రసీమలో లాభనష్టాల గురించి ఆలోచించకుండా సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు చేసే నిర్మాతలు ప్రస్తుతం తగ్గిపోయారు. మార్కెట్ లెక్కలు, కమర్షియల్ విలువల గురించి ఆలోచించకుండా మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే నిర్మాత రవికిరణ్ తపనను మెచ్చుకోవచ్చు. కథపై నమ్మకంతో ఎక్కడ రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు. కామెడీతో పాటు సెంటిమెంట్, ఎమోషన్స్, ఫైట్స్, డ్యాన్సులు అన్ని చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నారు సప్తగిరి. నిజాయితీపరుడైన లాయర్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. నటుడిగా అతడిని కొత్త పంథాలో ఆవిష్కరించిన చిత్రమిది. అవినీతిపరుడైన న్యాయవాది పాత్రలో సాయికుమార్ అభినయం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తన అనుభవంతో పాత్రకు వన్నెతెచ్చారాయన. మరో కీలకమైన పాత్రలో శివప్రసాద్ మెప్పించారు.

పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సినిమాకు ఊపిరిపోశాయి. రైతుల జీవితాల్ని, న్యాయస్థానాల్లో పేదలకు జరుగుతున్న అన్యాయాల్ని తమ సంభాషణల ద్వారా అర్థవంతంగా చాటారు. బుల్గానిన్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఛాయాగ్రాహకుడు సారంగం స్విట్జర్లాండ్‌తో పాటు తెలంగాణ అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజానికి మంచి చెప్పాలనే ఆలోచనతో దర్శకనిర్మాతలు నిజాయితీతో చేసిన మంచి ప్రయత్నమిది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే భిన్నమైన అనుభూతిని పంచుతుంది.

రేటింగ్:3/5

4060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles