శమంతకమణి సినిమా రివ్యూ

Fri,July 14, 2017 06:32 PM
Samanthakamani cinema review

మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ తెలుగులో తక్కువే. అడపాదడపా ఈ తరహా కథాంశాలతో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పంథాలో మార్పు వచ్చింది. కథ బాగుంటే తమ ఇమేజ్‌లను పక్కనపెట్టి మరో హీరోతో కలిసి నటించడానికి సిద్ధపడుతున్నారు నవతరం హీరోలు. ఈ పంథాలోనే రూపొందిన తాజా చిత్రం శమంతకమణి. నారా రోహిత్, ఆది, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు కలిసి నటించిన ఈ చిత్రంపై తొలి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. భలేమంచిరోజు చిత్రంతో తొలి ప్రయత్నంలోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీరామ్‌ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మల్టీస్టారర్ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? ద్వితీయ విఘ్నాన్ని శ్రీరామ్ ఆదిత్య దాటగలిగారా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే....

నగరంలోని ఓ ఖరీదైన హోటల్ నుంచి శమంతకమణి అనే 1940ల కాలం నాటి ఐదు కోట్ల విలువైన కారు దొంగిలించబడుతుంది. ఆ కారును తన అమ్మ జ్ఞాపకంగా భావించే కృష్ణ(సుధీర్‌బాబు) దానిని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. ఈ కేసును చేపట్టిన సీఐ రంజిత్‌కుమార్(నారా రోహిత్) అనుమానితుల కోసం వేట మొదలుపెడతాడు. కారు దొంగతనంతో సంబంధం ఉందనే భావనతో కోటిపల్లి శివ(సందీప్‌కిషన్), కార్తీక్(ఆది), ఉమా మహేశ్వరరావు అలియాస్ మహేష్‌బాబుల(రాజేంద్రప్రసాద్)లను అదుపులోకి తీసుకుంటాడు రంజిత్‌కుమార్. శమంతకమణితో ఆ ముగ్గురికి ఉన్న సంబంధమేమిటి? ఆ కారును దొంగతనం చేసిందెవరూ? ఆ కారు కారణంగా వారి జీవితాలు ఎలా తలక్రిందులు అయ్యాయి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథ ఇది. సాధారణ కథకు మలుపులను జోడించి దర్శకుడు మరోసారి తన ప్రతిభను చాటారు శ్రీరామ్‌ఆదిత్య. తొలి చిత్రం భలేమంచిరోజు తరహాలోనే స్క్రీన్‌ప్లే ప్రధానంగా సినిమాను నడిపించారు. కథ పక్కదారి పట్టకుండా పాటలు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌లు పెట్టకుండా ఆద్యంతం సస్పెన్స్‌తో చిత్రాన్ని తెరకెక్కించడంలో విజయవంతమయ్యాడు. పతాక ఘట్టాలను ఊహకందని మలుపుతో ముగించిన తీరు బాగుంది. నలుగురు హీరోలున్న ఎలాంటి తడబాటు లేకుండా కథతో పాటు వారి పాత్రలను ఆద్యంతం సరదాగా ఆవిష్కరించిన తీరు బాగుంది. హీరోలందరికి సమప్రాధాన్యత ఉంటుంది. భిన్న నేపథ్యాలతో వారి పాత్రలను చక్కగా దృశ్యమానం చేశారు. కథద్వారా వినోదాన్ని పండించాలనే దర్శకుడి ప్రయత్నాలు చాలా చోట్ల ఫలించాయి. సంభాషణలు ఆకట్టుకుంటాయి. అయితే ద్వితీయార్థంతో పోలిస్తే ప్రథమార్థం కాస్త నిదానంగా సాగుతుంది. పాత్రల పరిచయం కోసం ఎంచుకున్న సన్నివేశాలు మూసధోరణిలా సాగాయి. విరామం తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన యువకులుగా నలుగురు హీరోల పాత్రలు వైవిధ్యంగా సాగుతాయి. ఒకరికొకరు సంబంధం లేకపోయినా వారి పాత్రలను కలిపిన తీరు ఆసక్తిని పంచుతుంది. అమ్మ ప్రేమ కోసం తపించే యువకుడిగా సుధీర్‌బాబు పాత్ర భావోద్వేగ ప్రధానంగా సాగుతుంది. ఆస్తిలేదనే నెపంతో ప్రేమించిన అమ్మాయి కాదనడంతో డబ్బు సంపాదించాలని లక్ష్యంతో హైదరాబాద్ వచ్చిన అల్లరి యువకుడిగా సందీప్‌కిషన్ పాత్ర మాస్ పంథాలో సాగుతుంది. ప్రేమించిన యువతిని ఎలాగైన దక్కించుకోవాలని ఆరాటపడే యువకుడిగా ఆది పాత్ర హుషారుగా సాగుతుంది. ప్రియురాలు తనను నిర్లక్ష్యం చేయడంతో పంతంతో ఆమెకు బుద్దిచెప్పాలని భావించి చివరకు కారు దొంగతనం కేసులో ఇరుక్కున్న అమాయకుడిగా అతడి నటన నవ్విస్తుంది. లంచాలకు అలవాటు పడిన పోలీస్ అధికారిగా నారా రోహిత్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. తన అవసరం కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడే పోలీస్‌గా ఆయన కనిపిస్తారు. హుందాతనంతోపాటు వినోదాత్మకంగా ఆయన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. నలుగురు హీరోలతో సమానమైన కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించారు. తాము కోల్పోయిన జీవితాల్ని తిరిగి పోందాలని ఆరాటపడే మధ్య వయస్కులుగా రాజేంద్రప్రసాద్, ఇంద్రజ పాత్రలు ఆకట్టుకుంటాయి. కారు కారణంగా వారందరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఆకట్టుకుంటుంది. తెలంగాణ యాసతో రఘు కారుమంచి తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.

సాదాసీదా కథకు తన నేపథ్య సంగీతం ప్రాణం పోశారు మణిశర్మ. మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కథాగమనానికి అడ్డుగా మారుతాయనే ఉద్దేశ్యంతో ఒక్క పాటకు మాత్రమే సినిమాలో చోటుకల్పించారు. సినిమాకు సహజత్వాన్ని తీసుకురావడంలో సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం తోడ్పడింది. పాటలు, రొమాంటిక్ అంశాలు తావులేని ఈ సినిమాను చాలా అందంగా చూపించారు. కథ, దర్శకుడి ఆలోచనలను నమ్మి భారీగా ఈ సినిమాను తెరకెక్కించారు నిర్మాత ఆనంద్‌ప్రసాద్. అయితే దర్శకుడు కథ మీద మరింత కసరత్తు చేసి వుంటే శమంతకమణి పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే చిత్రంగా నిలిచేది. హీరోయిజాలు, ప్రయోగాలకు తావు లేని ఓ సాధారణ మల్టీస్టారర్ చిత్రమిది. క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు సంతృప్తిని మిగిల్చే చిత్రమిది.
రేటింగ్: 3/5

4079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS