'సాక్ష్యం' రివ్యూ

Fri,July 27, 2018 06:05 PM
saakshyam cinema review

అల్లుడుశీను, జయజానకి నాయక చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. తన గత చిత్రాలకు భిన్నంగా కథను నమ్మి ఆయన నటించిన తాజా చిత్రం సాక్ష్యం. పంచభూతాలు, కర్మ సిద్ధాంతానికి వాణిజ్య హంగులను మిళితం చేసి దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, నిర్మాణ విలువలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవాలన్న శ్రీనివాస్ కల నెరవేరిందా? దర్శకుడు శ్రీవాస్ అతడికి విజయాన్ని అందించాడా లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే..

స్వస్తిక్‌పురం గ్రామానికి రాజుగారు(శరత్‌కుమార్) పెద్దదిక్కుగా ఉంటారు. పేదవారికి అన్యాయం జరిగితే సహించని మంచి మనసు ఆయనది. ఆ ఊరికే చెందిన మునుస్వామి(జగపతిబాబు) అతడి ముగ్గురు తమ్ముళ్లు చేసే అన్యాయాల్ని ఎదురిస్తారురాజుగారు. దాంతో అతడిపై పగను పెంచుకున్న మునుస్వామి సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు లేకుండా రాజుగారి కుటుంబం మొత్తాన్ని చంపేస్తాడు. అయితే ఆ ప్రమాదం నుంచి రాజుగారి కొడుకు బయటపడతాడు. అమెరికాకు చెందిన శివప్రసాద్ దంపతులు అతడిని చేరదీస్తారు. విశ్వగా(బెల్లంకొండశ్రీనివాస్) నామకరణం చేస్తారు.
అమెరికాలో పెరిగిన విశ్వ భారతీయ సంస్కృతల నేపథ్యంలో ఈ వీడియోగేమ్‌ను డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సౌందర్యలహరి(పూజాహెగ్డే) సహాయాన్ని కోరుతాడు. వారి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. తన తండ్రిఠాగూర్‌కు(రావురమేష్) ప్రమాదం జరగడంతో ఇండియా వచ్చిన సౌందర్యలహరిని వెతుక్కుంటూ విశ్వ కూడా ఇండియా వస్తాడు. అక్కడ మునిస్వామితో పాటు అతడి తమ్ముళ్ల మరణానికి కారణమవుతాడు. వారిని విశ్వ ఎందుకు చంపాడు? తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై పంచభూతాల అండతో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. తమ తప్పులకు కర్మసాక్షి అనుసరించి మనుస్వామి అతడు తమ్ముళ్లు ఎలా శిక్షింపబడ్డారు అన్నదే ఈ చిత్ర కథ.

నాలుగు దిక్కుల ఎవరూ చూడకుండా జరిగిన ఓ తప్పుకు పంచభూతాలు ఎలా బదులు తీర్చుకున్నాయి. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకపోతే కర్మసాక్షి ప్రకారం ఎలా శిక్షింపబడతారనే పాయింట్‌కు హీరోయిజం, ప్రేమ, కుటుంబ బంధాలను మేళవిస్తూ ఈ కథను రాసుకున్నారు దర్శకుడు శ్రీవాస్. ప్రతీకార డ్రామాకు పంచభూతాల నేపథ్యాన్ని జోడించి ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారు ఎవరోతెలియకపోయినా విధిని అనుసరించి హీరో శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్లి వారిని సంహరించడమనే కొత్త పాయింట్‌తో స్క్రీన్‌ప్లే ప్రధానంగా రూపొందించారు. పంచభూతాల ప్రతీకారం అనే పాయింట్‌తో తెలుగు తెరపై ఇప్పటివరకు సినిమాలు రాలేదు. ఆ అంశం కొత్త అనుభూతిని పంచుతుంది. గాలి, నీరు, నిప్పు, భూమితో ప్రతినాయకుల్ని హీరో సహరించే సన్నివేశాలు అలరిస్తాయి. ఓ పోరాట ఘట్టాల్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు.

కుటుంబ బంధాలు, ప్రేమ ఘట్టాలతో ప్రథమార్థం మొత్తం సరదాగా సాగుతుంది. ద్వితీయార్థాన్ని ప్రతినాయకులపై హీరో ప్రతీకారం తీర్చుకునే అంశాలతో భావోద్వేగ ప్రధానంగా నడిపించారు. కథలోని ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వెళ్లిన వైనం బాగుంది. వీడియోగేమ్ రూపంలో తన జీవితంలో జరుగబోయే సంఘటనల్ని చూపిస్తూ ఉత్కంఠభరితంగా కథనాన్ని నడిపించారు. కథను ఆసక్తికరంగా నడిపించే క్రమంలో కొన్ని లాజిక్‌లు మిస్సయ్యాయి. వాటిపై దృష్టిసారిస్తే బాగుండేది. అలాగే నాయకానాయికల ప్రేమకథలో ఫీల్ లోపించింది.

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా చాలా మెరుగయ్యాడు. భావోద్వేగాలు మిళితమైన పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా తపించారు. సంభాషణలు చెప్పడం, హావభావాలు పలికించడంలో పరిణితి కనబరిచాడు. పాటల్లో తన గ్లామర్ తళుకులతో ఆకట్టుకుంది పూజా హెగ్డే. జగపతిబాబులోని విలనిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించిన చిత్రమిది. ైస్టెలిష్ విలన్ అనే ముద్ర నుంచి దూరం కావడానికి మునుస్వామి పాత్ర ఉపయోగపడుతుంది. మిగతా ప్రతినాయకులుగా రవికిషన్,మధుగురుస్వామి, ఆశుతోష్‌రాణా ఆకట్టుకున్నారు.నిడివి తక్కువైన శరత్‌కుమార్, రావురమేష్, మీనా నటనానుభవంతో తమ పాత్రలకు ప్రాణంపోశారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ బాణీలు, నేపథ్యం సంగీతం, అర్థర్ విల్సన్ ఛాయాగ్రహణం సాంకేతికంగా ఈ సినిమాకు ప్రాణంపోశాయి.కథను శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించడంలో సాంకేతిక నిపుణుల నుంచి దర్శకుడికి చక్కటి సహకారం లభించింది. కథను నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు అభిషేక్ నామా.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే కొంత భిన్నమైన అనుభూతిని పంచే చిత్రమిది. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన హంగులన్నీ ఉంటూనే పంచభూతాలనే కొత్త పాయింట్‌ను తీసుకొని దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. వైవిధ్యతను కోరుకునే ప్రేక్షకుల్ని కొంత వరకు ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్:3/5

3913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles