‘రంగులరాట్నం’ రివ్యూ..

Sun,January 14, 2018 04:26 PM
Rangula ratnam Movie Review


నటీనటులు: రాజ్‌తరుణ్, చిత్రశుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు...
సంగీతం:శ్రీచరణ్
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకత్వం: శ్రీరంజని


యూత్‌ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు రాజ్‌తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన మరో ప్రేమకథా చిత్రం రంగులరాట్నం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్. చాలా విరామం తర్వాత అదే బ్యానర్‌లో ఆయన నటించిన రంగులరాట్నం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం ద్వారా శ్రీ రంజని దర్శకురాలిగా పరిచయమైంది. భారీ చిత్రాల మధ్య ఈ సంక్రాంతి బరిలో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ముందుకొచ్చిన రంగుల రాట్నం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

కథా సంగ్రహణం...
తల్లి ప్రేమతో ఎంతో గారాబంగా పెరుగుతాడు విష్ణు (రాజ్‌తరుణ్). ఓ సంస్థలోఉద్యోగం చేస్తుంటాడు. అతనికి ఓ చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలన్నది తల్లి (సితార) కోరిక. ఈ క్రమంలో విష్ణుకు అనుకోకుండా కీర్తి (చిత్ర శుక్లా) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేసే కీర్తిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు విష్ణు. ఆమెను తన తల్లికి కూడా పరిచయం చేస్తాడు. కీర్తికి తన ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాలనుకుంటాడు విష్ణు. ఈలోగా అనూహ్యంగా విష్ణు తల్లి చనిపోతుంది. తల్లి మరణంతో తీవ్రమైన దుఃఖంలో వున్న విష్ణుకు కీర్తి ఓదార్పునిస్తుంది. అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అయితే ప్రతి విషయంలో అతిజాగ్రత్తగా వ్యవహరించే కీర్తి ప్రవర్తనతో విష్ణు విసిగిపోతాడు. ఆమె జీవితం నుంచి దూరంగా జరగాలనుకుంటాడు. కీర్తి అతిజాగ్రత్తగా వుండటానికి బలమైన కారణమేమిటి? చివరకు ఈ జంట ఒక్కటయ్యారా? వారి ప్రేమాయణం ఏ తీరాలకు చేరింది? ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


నటీనటుల పనితీరు...
సినిమా ప్రథమార్థమంతా తల్లీకొడులకు అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. అయితే కథాగమనం నెమ్మదిగా వుండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ ముందు తల్లి చనిపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ద్వితీయార్థం భావోద్వేగభరితంగా సాగుతుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే అక్కడ కూడా కథపై దృష్టిపెట్టకపోవడంతో ఏ దశలోనూ ప్రేక్షకులు సినిమాలో లీనం కాలేకపోతారు. అయితే రాజ్‌తరుణ్, ప్రియదర్శిల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు రిలీఫ్ నిస్తాయి. తల్లికొడుకుల మధ్య వుండే అనుబంధాన్ని బలంగా ఆవిష్కరించే అవకాశం వున్నా ఆ సన్నివేశాలు అనుకున్న విధంగా తీయలేకపోయారనిపిస్తుంది. శ్రీచరణ్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఛాయాగ్రహణం బాగుంది. అన్నపూర్ణ సంస్థ నిర్మాణ విలువలు చక్కటి ప్రమాణాలతో వున్నాయి.

రాజ్‌తరుణ్ తనదైన హుషారైన నటన కనబరిచాడు. చిత్రాశుక్లా చక్కటిరూపంతో ఆకట్టుకుంది. అయితే రాజ్‌తరుణ్ పక్కన ఆమె కొంచెం పెద్ద వయస్కురాలిగా అనిపిస్తుంది. సితార తల్లి పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కథలో ఎంచుకున్న పాయింట్ బాగానే వున్నప్పటికి దానిని ఆవిష్కరించే విధానంలో దర్శకురాలు తడబడ్డట్లుగా అనిపించింది. కొత్తవారిని ప్రోత్సహించడానికి అన్నపూర్ణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలిస్తూ అన్నపూర్ణ బ్యానర్ ఎన్నో సినిమాల్ని నిర్మించింది. అయితే నూతన దర్శకురాలు శ్రీరంజని..అన్నపూర్ణ సంస్థ ఇచ్చిన చక్కటి అవకాశాన్ని నిలబెట్టుకోలేదనిపిస్తుంది.

రేటింగ్: 2.5

3736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles