రంగస్థలం సినిమా రివ్యూ

Fri,March 30, 2018 03:39 PM
Ram charan Rangasthalam Movie Review

నటీనటులు: రామ్‌చరణ్, సమంత, ఆది, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అనసూయ, నరేష్, రోహిణి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమెరా: ఆర్.రత్నవేలు
ఆర్ట్: రామకృష్ణ, మౌనిక
పాటలు: చంద్రబోస్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్
దర్శకత్వం: సుకుమార్
సంస్థ: మైత్రీ మూవీమేకర్స్

సినిమాకు సంబంధించి దర్శకుడు సుకుమార్ సమీకరణాలు వేరుగా వుంటాయి. మానవ భావోద్వేగాల్లోని కన్ఫ్యూజన్‌ను తనదైన లెక్కల తూకంతో క్లారిటీగా ఆవిష్కరించడం ఆయన శైలి. ఆయన చిత్రాలకు తెలుగులో ఓ బ్రాండ్ ఇమేజ్ వుందనడం అతిశయోక్తికాదు. ఇక మెగాకుటుంబ వారసుడు రామ్‌చరణ్ కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాలతో కమర్షియల్ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను సృష్టించుకున్నారు. భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకొని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చలామణీ అవుతున్నారు. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. రంగస్థలం అనే పొయెటిక్ టైటిల్, 1985 నాటి కథాంశం కావడంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించింది.

ఇందులో రామ్‌చరణ్ చెవిటివాడి పాత్రను పోషించడం మరింత ఆసక్తికి కారణమైంది. గత సంవత్సరకాలంగా తెలుగు చిత్రసీమలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న రంగస్థలం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? సుకుమార్-రామ్‌చరణ్ అంచనాల్ని ఈ చిత్రం ఎంతవరకు నిజం చేసింది? ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

రంగస్థల కథా నేపథ్యం..


కోనసీమ ప్రాంతంలో వున్న రంగస్థలం అనే గ్రామంలో 1985 నాటి నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆ గ్రామంలో చిట్టిబాబు (రామ్‌చరణ్) పొలాలకు నీళ్లు అందించే ఇంజిన్‌ను నడుపుతుంటాడు. ఊరి వాళ్లందరితో సఖ్యతగా వుంటాడు. అయితే కొంచెం చెవుడు వుండటం వల్ల పెద్దగా మాట్లాడితే కాని వినిపించదు. ఊరిలో వుండే రామలక్ష్మిని(సమంత) తొలిచూపులోనే ప్రేమిస్తాడు చిట్టిబాబు. ఇదిలావుండగా రంగస్థలం గ్రామ ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) 30 ఏళ్లుగా పదవిలో కొనసాగుతుంటాడు. తన అధికారాన్ని ప్రశ్నించిన వారి అడ్డు తొలగించుకుంటూ గ్రామ ప్రజలతో నిరంకుశంగా ప్రవర్తిస్తుంటాడు. రైతులను మోసం చేస్తూ వారికి ప్రభుత్వం నుంచి మంజూరి అయిన రుణాలను కాజేస్తుంటాడు. అతడి ముందు చెప్పులు వేసుకొని నడవడానికి కూడా ప్రజలు భయపడిపోతుంటారు.

చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి రంగస్థలం ఊరికొస్తాడు. శాంతస్వభావి అయిన అన్న అంటే చిట్టిబాబుకు పంచప్రాణాలు. ఓసారి రామలక్ష్మి పొలానికి సంబంధించిన అప్పు చెల్లింపు విషయమై ప్రెసిడెంట్‌ను నిలదీస్తాడు కుమార్‌బాబు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఫణీంద్రభూపతి ఆగడాల్ని అరికట్టాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకుంటాడు కుమార్‌బాబు. అందుకోసం ఎమ్మెల్యే దక్షిణామూర్తి (పకాష్‌రాజ్) సహాయం తీసుకుంటాడు. ఆయన పార్టీ తరపున రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఫణీంద్రభూపతికి ఎదురు నిలిచిన కుమార్‌బాబుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న కోసం చిట్టిబాబు ఎంత వరకు వెళ్లాడు? రంగస్థలం రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకుపై ఎత్తులలో సాగిన సమరంలో ఎవరు విజేతలుగా నిలిచారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ.

రంగస్థలం ఎలా వుందంటే...


80వ దశకంలో గ్రామాల్లో భూస్వామ్య వ్యవస్థ ప్రాబల్యం ఎక్కవగా వుండేది. పెత్తందారులు చెప్పిందే శాసనంగా చెలామణి అయ్యేది. రంగస్థలం కూడా అదే ఇతివృత్తం. ఒక భూస్వామికి ఎదురొడ్డి పోరాడిన అన్నాదమ్ముల వీరోచిత స్ఫూర్తిదాయక కథ. అయితే అలనాటి ఈ కథాంశాన్ని తనదైన మార్క్ మాయజాలంతో ఆధ్యంతం రక్తికట్టించారు దర్శకుడు సుకుమార్.

ప్రథమార్థంలో చిట్టిబాబు, రామలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ప్రథమార్థమంతా చిట్టిబాబు-రామలక్ష్మి మధ్య జరిగే సరదా సంఘటనలు, ప్రెసిడెంట్ అరాచకాల నేపథ్యంలో కథను నడిపించారు. ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతిని ఎదిరిస్తూ కుమార్‌బాబు ఎలక్షన్లలో పోటీ చేయడంతో కథాగమనం కీలక మలుపు తీసుకుంటుంది.

ద్వితీయార్థాన్ని అనూహ్యమలుపులతో, భావోద్వేగభరిత సన్నివేశాలతో తీర్చిదిద్దారు. ఎలక్షన్ల ప్రచారానికి ఎమ్మెల్యే దక్షిణామూర్తి రంగస్థలం గ్రామానికి రావడం.. డబ్బులు తీసుకున్నాడంటూ చిట్టిబాబుపై ఊరి ప్రజలు అనుమానపడటం.. ఈ క్రమంలో సాగే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. కుమార్‌బాబుపై దాడి జరిగిన తర్వాత కథలోని భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుకుంటాయి.

చిట్టిబాబుకు ప్రతి విషయంలో చేదోడువాదోడుగా నిలిచే రంగమ్మత్త (అనసూయ) కథలో కీలకంగా అనిపిస్తుంది. ఆరంభం నుంచి ఎక్కడా బిగిసడలని స్క్రీన్‌ప్లేతో కథను ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు సుకుమార్. చివరగా దక్షిణామూర్తితో చిట్టిబాబు సంవాదం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్ని షాక్‌కు గురిచేస్తుంది. ఆ ఎపిసోడ్‌లో సుకుమార్ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరెవరు ఎలా చేశారంటే...


చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ పరకాయ ప్రవేశం చేశారు. అమాయకత్వం, ధీరత్వం మేళవించిన పాత్రలో ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేశాడు. వినికిడిలోపం వల్ల వచ్చే సన్నివేశాల్లో ఆయన అద్భుతమైన హాస్యాన్ని పండించారు. గోదావరి యాసలో సంభాషణలన్నీ అలవోకగా, సహజంగా పలికించాడు. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌గా అభివర్ణించవొచ్చు. ముఖ్యంగా పతాకఘట్టాల్లో రామ్‌చరణ్ అభినయానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. చిట్టిబాబు పాత్ర రామ్‌చరణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

ఇక రామలక్ష్మిగా అందం, అమాయకత్వం, చిలిపిదనం, కాస్త గడుసుదనం మూర్తీభవించిన పాత్రలో సమంత ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా 'రంగమ్మ మంగమ్మ' పాటలో సమంత పలికించిన హావభావాలకు హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే. సమంత కెరీర్‌లో గొప్పగా చెప్పుకునే పాత్రగా రామలక్ష్మి నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక చిట్టిబాబు అన్నయ్య పాత్రలో ఆది చక్కటి అభినయాన్ని కనబరిచాడు. మృదుస్వభావిగా కనిపిస్తూనే అన్యాయాల్ని సహించని నైజం వున్న వ్యక్తిగా కుమార్‌బాబు పాత్రకు జీవం పోశాడు. రంగమ్మత్తగా అనసూయ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. నటిగా తనలోని కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరించింది.

ఎమ్మెల్యేగా ప్రకాష్‌రాజ్, క్రూరస్వభావి అయిన ఫణీంద్రభూపతిగా జగపతిబాబు తమ పాత్రల్ని రక్తికట్టించారు. చిట్టిబాబు అమ్మానాన్న పాత్రల్లో రోహిణి, నరేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎక్కడా వేలెత్తి చూపించే వీలులేకుండా నటీనటులందరూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం రంగస్థలానికి కొత్త తళుకులద్దింది.

పాటలన్నీ సందర్భోచితంగా చక్కటి సంగీత, సాహిత్యాల మేలికలయికగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. పూజాహెగ్డే చేసిన 'జిగేలు రాణి' ఐటెంసాంగ్ హుషారెత్తించేలా సాగింది. ఇక ఈ సినిమాలో కళా దర్శకులు రామకృష్ణ-మౌనికలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రంగస్థలం గ్రామీణ సెట్‌ను వారు తీర్చిదిద్దిన విధానం నభూతోనభవిష్యత్‌గా చెప్పవచ్చు. ప్రేక్షకులందరూ 80వ దశకంలోకి వెళ్లామనే అనుభూతికిలోనవుతారు. అలనాటి వాతావరణాన్ని యథాతథంగా పునఃసృష్టించి ఉత్తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఛాయాగ్రాహకుడు రత్నవేలు గోదావరి అందాల్ని, కోనసీమ సోయగాల్ని తన కెమెరాలో అందంగా బంధించాడు. ప్రతి ఫ్రేములో నిర్మాణ విలువలు అత్యద్భుతంగా గోచరిస్తాయి.

చివరగా చెప్పేదేమిటంటే...


రంగస్థలం కోసం దర్శకుడు సుకుమార్ దాదాపు సంవత్సరకాలంగా శ్రమించారు. పర్‌ఫెక్షన్ కోసం ఆయన పడిన కష్టమేమిటో ప్రతి ఫ్రేములో కనిపించింది. తనలోని సృజనాత్మకతకు పతాకస్థాయిలో ఆవిష్కరిస్తూ సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని దృశ్యమానం చేశాడనంలో ఎటువంటి సందేహం లేదు. రంగస్థలం చిత్రంతో సుకుమార్ ప్రేక్షకుల్ని అలనాటి కాలంలోకి తీసుకెళ్లారు. తనదైన క్రియేటివిటీతో అనిర్వచనీయమైన అనుభూతిని అందించారు.

రేటింగ్: 3.5/5

12955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles