కండక్టర్ కాకముందు రజినీకాంత్ ఏం చేసేవారో తెలుసా?

Sun,November 11, 2018 06:14 PM
Rajinikanths life Before conductor

స్టయిల్‌కి ఐకాన్. యాక్టింగ్‌లో సూపర్‌స్టార్. రియల్ లైఫ్ హీరో. రజినీకాంత్ అంటే గతంలో కండక్టర్‌గా పనిచేశాడని టక్కున చెప్పేస్తారు. కానీ అంతకన్నా ముందు ఏం చేశాడు? తలైవాలో ఎన్ని కోణాలున్నాయి? కండక్టర్ కన్నా ముందు కార్పెంటర్ అయిన సూపర్‌స్టార్‌లోని మరో మనిషి ఉన్నాడా?

సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటేనే ఓ స్టయిల్. బెంగళూరులో మరాఠి కుటుంబంలో 1950, డిసెంబర్ 12న రామోజీరావు గైక్వాడ్, జిజాబాయ్‌లకు జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కండక్టర్‌గా పని చేయకముందు రజినీకాంత్ కార్పెంటర్‌గా పనిచేశాడు. అంతకంటే ముందు సామాన్య కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. తాను వచ్చిన స్థాయిని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు. అందుకోసమే కొన్ని సినిమాల్లోనూ తన జీవితంలో దగ్గరగా ఉండే పాత్రలను పోషించాడాయన. ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునేవాళ్లలో రజినీది రెండో స్థానం.

వినమ్రుడు..భోజన ప్రియుడు


ఒకప్పుడు కమల్‌హాసన్‌కు అభిమాని రజినీకాంత్. సూపర్‌స్టార్ అయిన తర్వాత కూడా తాను ఎక్కడ నుంచి వచ్చాడో మరిచిపోలేదు. ప్రేక్షకులకు చెప్పేందుకు పరోక్షంగా తనకంటే కమల్‌హాసనే గొప్పవాడని చాలాసార్లు కితాబిచ్చాడు. రజినీకాంత్ హీరో అయిన కొన్నాళ్లకు కమల్ బండి మీద ఎక్కివెళ్లాడు. అప్పుడు అది కలా? నిజమా? అనుకొని రజినీకాంత్ తనను తాను గిచ్చుకొని మరీ తేరుకున్నాడట. అదే విషయాన్ని సూపర్ స్టార్ మరోసారి గుర్తు చేస్తూ కమల్ తర్వాతే నేను అని తన వినమ్రతను చూపాడు.

తన కంటే పెద్ద వాళ్లను స్వామి అని సంబోధిస్తుంటాడు. రజినీకాంత్ సూపర్‌స్టార్ అయినా రోడ్‌సైడ్ ఫుడ్‌ను మాత్రం వదల్లేదు. స్టార్ కాక ముందు నుంచే హోటల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడు. ప్రయాణంలో ఎక్కడైనా మంచి ఆహారం కనిపిస్తే కారు ఆపి రుచి చూస్తుంటాడు. అప్పుడప్పుడూ పోరూర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి రుచులను ఆరగిస్తుంటాడు. ఒకవేళ చెన్నైలో రజినీ సినిమా షూటింగ్ ఉంటే ఆ షూటింగ్ ముగిసే వరకూ ఇంటి నుంచి తనతో పాటు మరో 25 మందికి భోజనం తెప్పించి తోటి వారికి పెడుతుంటాడు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో అమ్మే పల్లీలంటే ఎంతో ఇష్టమట. మటన్, తలకాయ కూరలను అమితంగా ఇష్టపడి తింటాడు.

దానకర్ణుడు.. ప్రతిభను ప్రోత్సహిస్తాడు


తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, ఇంగ్లిష్ వంటి భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలడు రజినీ. రోజూ ఒకటి, రెండు సినిమాలను చూస్తుంటాడు. అన్ని ప్రాంతాలకు చెందిన సంప్రదాయాలను, సంస్కృతులను గౌరవిస్తుంటాడు. సంగీతం బాగా ఆస్వాదిస్తాడు. వీలైతే ఆ సంగీత దర్శకులకు ఫోన్ చేసి మరీ ప్రశంసిస్తుంటాడు. తన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వారందరికీ రజినీ తరపున నగదు బహుమతులను అందిస్తూ ప్రోత్సహిస్తుంటాడు.

దానగుణంలో రజినీ తర్వాతే ఎవరైనా అంటారు దగ్గరివాళ్లు. ఎందుకంటే తన దగ్గర పని చేసే వారందరికీ చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ప్లాట్లు కూడా కొనిచ్చాడు. వారి బాగోగుల కోసం బ్యాంకులో కొంత మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశాడు. పేద పిల్లలకు చదువు చెప్పించి వారికి అండగా నిలుస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. తన వద్ద 25 యేండ్లు పనిచేసి పదవీ విరమణ పొందిన తన వ్యక్తిగత సహాయకుడైన జయరామన్‌కు ఇప్పటికీ వేతనం చెల్లిస్తూ తన ఉదారతను చాటుకుంటున్నాడు.

చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ ఉండేది. తన సినిమాల్లో కూడా దైవ సంబంధిత పాత్రలకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. తన సినిమాలు విడుదలైన సమయంలో ఎవరికీ కనిపించకుండా ఏకాంతంగా హిమాలయాల్లో గడుపుతుంటాడు. అరుదైన రుద్రాక్షలు సేకరిస్తూ ధరిస్తుంటాడు. పోయస్ గార్డెన్‌లోని రజినీ నివాసం పేరు బృందావన్. ఈ పేరును ఆయనే ఎంపిక చేశాడు. ఆ పేరుపై సత్యమేవజయతే అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. వేదాల్లో ఉండే ఆసక్తికరమైన అంశాలను గురించి చదివి తెలుసుకుంటూ నిజ జీవితంలోనూ ఆచరిస్తుంటాడు. అందుకే తన ఇంటి గుమ్మంలో స్వామి వివేకానంద సూక్తుల్లో ఒకటైన ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలో ఏ శక్తి ఆపజాలదు అని రాయించుకున్నాడు.

12565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles