రజనీకాంత్ 'కాలా' రివ్యూ

Thu,June 7, 2018 05:57 PM
Rajinikanth Kaala cinema review

రజనీకాంత్ సినిమా అంటే భాషాభేదాలతో సంబంధంలేకుండా యావత్‌సినీప్రేక్షకులంతా అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. తమిళం, తెలుగు, హిందీ ఇలా భిన్న భాషల్లో స్టార్‌ఇమేజ్‌ను కలిగిన నటుడాయన. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కాలా. కబాలి తర్వాత రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కలయికలో రూపొందిన చిత్రమిది. కబాలి నిరాశపరచిన పా రంజిత్‌పై ఉన్న నమ్మకంతో ఆయనకు మరో అవకాశం ఇవ్వడంతో ఇందులో ఏదో ఒక కొత్తదనం తప్పకుండా ఉంటుందని అందరూ ఎదురుచూశారు. దానికి తోడు రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో సినిమా విడుదలకావడంతో ఆయన అరంగేట్రానికి ఈ సినిమా నాందిగా నిలవబోతున్నట్లు ప్రచారం జరిగింది.

కరికాలుడు అలియాస్ కాలా(రజనీకాంత్)ముంబాయిలోని ధారవి అనే మురికివాడకు నాయకుడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది ఆ మురికివాడను వదలివెళ్లినా కాలా, అతడి కుటుంబం మాత్రం అక్కడే స్థిరపడుతుంది. ఆ ప్రాంతం, అక్కడి ప్రజలంటే కాలాకు ప్రాణం. తన రాజకీయ పలుకుబడితో ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని హరిదాదా(నానా పటేకర్) అనే రాజకీయనాయకుడు కుట్రలు పన్నుతాడు. కాలా తెలివితేటలు ధైర్యసాహసాల ముందు అతడి పాచికలు పారవు. దాంతో కాలాను చంపడానికి ప్రయత్నిస్తాడు హరిదాదా. ఈ ప్రమాదంలో భార్య, కొడుకును కోల్పోతాడు కాలా. హరిదాదా నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మైస్థెర్యం, ప్రజాబలంతో పోరాటం సాగిస్తాడు కాలా. ఈ పోరులో కాలా ఎలా విజయం సాధించాడు? కాలాను చంపి ధారవిని ఆక్రమించుకోవాలని చూసిన హరిదాదా ప్రయత్నాలు నెరవేరాయా?కాలా తన ఆశయాన్ని ఎలా సాధించాడు? అన్నదే ఈ చిత్ర కథ.

దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించేందుకు కనీస స్థలం లేక మురికివాడల ప్రజలు ఎన్నో అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారనే సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగులను జోడించి దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తరతరాలుగా తాము బతుకుతున్న ప్రాంతాన్ని కార్పొరేట్ పరంగా కాకుండా కాపాడుకోవడానికి రాజకీయ శక్తులపై పోరాటం సాగించిన ఓ మురికివాడ నాయకుడి కథ ఇది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబాయిలోని ధారవి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకొని దానికి రజనీకాంత్ ఇమేజ్, మాస్ హంగులను జోడించి ఈ కథను నడిపించారు దర్శకుడు పా రంజిత్.

కాలా రౌడీగా మారడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ మురికివాడతో అతడికున్న అనుబంధం, కుటుంబ సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. రజనీకాంత్‌కు, హుమా ఖురేషికి మధ్య వచ్చే ఓల్డ్ ఏజ్ లవ్‌స్టోరీ వినోదాన్ని పంచుతుంది. నానా పటేకర్ ఎంట్రీ సమయంలో వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచి ధారవికి ఆక్రమించుకోవడానికి హరిదాదా వేసే ఎత్తులు, రజనీకాంత్ వాటిని తిప్పికొట్టే సన్నివేశాలతో కథాగమనం ఆసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్థం మొత్తం ఇద్దరి పాత్రల చుట్టే కథ సాగుతుంది. సినిమాను ముగించిన తీరు వినూత్నంగా ఉంటుంది.

రజనీకాంత్ ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకొని పా రంజిత్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా కోసం అతడు ఎంచుకున్న కథలో కొత్తదనం లోపించింది. దానికి తోడు కథనం నిదానంగా సాగడం సినిమాకు ప్రధాన అవరోధంగా మారింది. విలన్‌ను ఎదుర్కోవడానికి హీరో చేసే ప్రయత్నాలన్నీ సుదీర్ఘంగా సాగుతాయి. రజనీకాంత్ హీరోయిజాన్ని పూర్తిస్థాయిలో వినిపయోగించుకోలేకపోయారు. రజనీకాంత్ సినిమాల్లో కనిపించే పంచ్ డైలాగ్‌లు, పవర్‌ఫుల్ పోరాట ఘట్టాలు ఇందులో కనిపించవు. రజనీకాంత్‌కు కాకుండా ఇతర పాత్రలకు అతిగా ప్రాముఖ్యతనిచ్చారు.

సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు చేయడం పా రంజిత్‌కు కొత్తేమీ కాదు. తన తొలి సినిమా నుంచి సమాజంలోని అణగారిన వర్గాలు, వారి ఆచార వ్యవహారాలు, నేపథ్యాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్న ఆయన కాలాతో అదే దారిని అనుసరించారు. మురికివాడల ప్రజలు ఎదుర్కొంటున్న వ్యథల్ని, వారి జీవితాల్ని వాస్తవిక కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ సన్నివేశాలన్నీ ధారవి ప్రాంతాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేశాయి.

కరికాలుడు అనే మంచిమనసున్న రౌడీగా రజనీకాంత్ పాత్ర ైస్టెలిష్‌గా సాగుతుంది. ఆయనలోని హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించారు పా రంజిత్. ద్వితీయార్థంలో రజనీకాంత్‌పై వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా నానాపటేకర్ తన అనుభవంతో హరిదాదా పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. రజనీకాంత్, నానా పటేకర్ మధ్య వచ్చే ప్రతిసన్నివేశం ఈసినిమాను నిలబెట్టింది. రజనీకాంత్ ప్రాణ స్నేహితుడిగా సముద్రఖని చక్కటి వినోదాన్ని పంచారు. ఈశ్వరీరావు, హుమా ఖురేషి, అంజలీపాటిల్ పాత్రలకు ప్రాధాన్యత తక్కువే.

సాంకేతిక విభాగంలో ఆర్ట్ డెరైక్టర్ పనితనం ఆకట్టుకుంటుంది. ధారవి సెట్‌ను యథార్థంగా సృష్టించిన తీరు మెప్పిస్తుంది. ధనుష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సంతోష్‌నారాయణ నేపథ్యం సంగీతం, బాణీలు కబాలి పాటలను తలపించాయి.

తమ కెరీర్‌లో రజనీకాంత్‌తో ఒక్క సినిమానైనా చేయాలని ప్రతి దర్శకుడు కలలుకంటుంటారు. కబాలి, కాలా రూపంలో రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేసిన దర్శకుడు పా రంజిత్ అవకాశాలను సద్వినియోగపరుచోవడంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేదు. కబాలిలో చేసిన పొరపాట్లను ఈ సినిమా ద్వారా ఆయన దిద్దుకుంటే కాలా ఫలితం మరింత మెరుగ్గా వుండేది. ఆయన సాదాసీదాకథకు, స్లో సాగే స్క్రీన్‌ప్లేను జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. సినిమా ద్వారా తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని శక్తివంతంగా చూపించలేకపోయారు. దాంతో కాలా కేవలం రజనీకాంత్ అభిమానుల్ని మాత్రమే మెప్పించే సినిమాగా నిలిచే అవకాశం ఉంది. సాధారణంగా రజనీకాంత్ సినిమాలకు వుండే ప్రారంభ వసూళ్లు ఈ సినిమా కూడా వున్నాయి. అయితే ఈ చిత్రం ఈ సినిమా కమర్షియల్‌గా ఎంత వరకు సేఫ్ జోన్‌లో వుంటుందో లేదో వేచి చూడాలి.
రేటింగ్: 2.75/5

5142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles