మగధీర, యమదొంగతో జక్కన్న.. ఫోటో వెనుక మర్మమేంటి?

Mon,November 20, 2017 11:20 AM
మగధీర, యమదొంగతో జక్కన్న.. ఫోటో వెనుక మర్మమేంటి?

బాహుబలి అఖండ విజయంతో దర్శకుడు రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో ఆయన తదుపరి చిత్రమేమిటన్నది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో తాను కలిసి వున్న ఓ ఫొటోను శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రాజమౌళి. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు కలిసి చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం ప్రేక్షకుల్లో అనేక ఊహాగానాలకు తెరతీస్తున్నది. డి.వి.వి. దానయ్య నిర్మాతగా రాజమౌళి తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2018లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

ఇందులో కథానాయకుడెవరనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. మహేశ్ బాబు ఈ మూవీలో నటిస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. రాజమౌళి తాజా ఫోటో ట్వీట్‌తో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరో ఒకరు కథానాయకుడిగా ఆయన తదుపరి చిత్రాన్ని రూపొందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌తో రాజమౌళి సినిమా ఖరారైందని, ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్తుందని గతంలో వార్తలొచ్చాయి.

అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. తాజా ఫొటో ట్వీట్‌ను బట్టి రామ్‌చరణ్ నటించే చిత్రంలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో నటిస్తాడేమోనని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. ఎలాంటి క్యాప్షన్ లేకుండా రాజమౌళి పెట్టిన ఈ ఫొటో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయింది.

ఇదిలావుండగా వ్యక్తిగతంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో..రాజమౌళికి సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్‌చరణ్‌కు మగధీర, ఎన్టీఆర్‌కు యమదొంగ వంటి భారీ కమర్షియల్ విజయాల్ని అందించారు రాజమౌళి. ఈ ముగ్గురి కలయిక కార్యరూపలం దాల్చాలని సోషల్‌మీడియా వేదికగా అభిమానులు కోరుకుంటున్నారు.

మొత్తానికి రాజమౌళి తదుపరి చిత్రంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా సినీ ప్రియులకు టెన్షన్ ఎక్కువ చేస్తున్నారు. ఒకవేళ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో వీళ్లిద్దరిని అతిథి పాత్రలో జక్కన్న నటింప జేస్తాడా? అనే కొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారు సినీ ప్రియులు. ఏది ఏమైనా.. రాజమౌళి తదుపరి చిత్రం ఈ ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరు పూర్తి స్థాయి కథానాయకుడిగా.. మిగితా వాళ్లు కామియో రోల్ లో నటించే అవకాశాలు ఉండొచ్చని సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుతున్నది.1931

More News

VIRAL NEWS