ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి బంగారు ప‌త‌కం

Sun,July 22, 2018 08:44 AM
rajamouli recieves behindwoods gold medal award

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న రాజ‌మౌళికి బాహుబ‌లి చిత్రాన్ని తెర‌కెక్కించినందుకు ప‌లు అవార్డులు వ‌రించాయి. తాజాగా ఆయ‌న‌కి ‘బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌’ అవార్డుల్లో భాగంగా ఉత్తమ దర్శకుడి( విజిన‌రీ ఆఫ్ ఇండియ‌న్ సినిమా)గా బంగారు పతాకం అందుకున్నారు. చెన్నైలోని నండంబక్కంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, రాజ‌మౌళికి అక్క‌డ ఘన స్వాగ‌తం ల‌భించింది. అవార్డు అందుకునేందుకు స్టేజ్‌పైకి వెళుతున్న క్ర‌మంలో అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌ముఖులు అంద‌రు నిలుచొని రాజ‌మౌళికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అభిమానులు అల్ల‌ర్ల‌తో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా చేశారు . ఇక సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, మేకప్‌ తదితర విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ర‌మా రాజమౌళితో పాటు దేవ సేన పాత్ర పోషించిన అనుష్క కూడా కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. కార్తీ, దేవి శ్రీ ప్ర‌సాద్, శింబు, నాజ‌ర్‌, న‌య‌న‌తార‌, ర‌మ్య‌కృష్ణ త‌దిత‌రులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. రాజ‌మౌళికి ప‌త‌కం అందించే స‌మ‌యంలో వ్యాఖ్యాత‌లు కింద కూర్చొని ఉన్న ర‌మా రాజ‌మౌళిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. త‌మిళ భాష‌లో చెప్ప‌డంతో ర‌మాకి అర్ధం కాక కింద‌నే కూర్చుంది. దీంతో రాజ‌మౌళి మైక్ అందుకొని చిన్నీ .. స్టేజ్‌పైకి ర‌మ్మంటున్నారు అని ఎంతో ఆప్యాయంగా పిలిచారు. స్టేజ్‌పైకి వెళ్లిన త‌ర్వాత రమాతో క‌లిసి రాజ‌మౌళి ర్యాంప్ వాక్ చేశారు. ఇది చూప‌రుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. బాహుబ‌లి సిరీస్‌తో భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు జ‌క్క‌న్న‌కి మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఎంత ఆద‌ర‌ణ ల‌భించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాజాగా రాజ‌మౌళికి ద‌క్కిన గౌర‌వానికి సంబంధించిన వీడియోని ‘బిహైండ్‌వుడ్స్‌’ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది. శుక్రవారం (జులై 20) విడుదలైన ఈ వీడియోను ఇప్పటికే లక్షకు పైగా అభిమానులు వీక్షించారు.

2882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles