రాజా ది 'గ్రేట్' రివ్యూ

Wed,October 18, 2017 06:24 PM
Raja the great movie review

బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ నుంచి సినిమాలేవీ రాలేదు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన చిత్రం రాజా ది గ్రేట్. తొలిసారి రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్న సినిమా కావడం, దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కడంతో ప్రారంభం నుంచి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పటాస్, సుప్రీమ్ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించింది?అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడా?లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే....

రాజా(రవితేజ) పట్టుకతోనే అంధుడైన ఆత్మవిశ్వాసం ఎక్కువ. కళ్లు లేవని ఎదుటివారు తనపై జాలి చూపిచండం రాజాకు నచ్చదు. తల్లి అనంతలక్ష్మి(రాధిక) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. తన మాదిరిగానే కొడుకు పోలీసుగా చూడాలన్నది ఆమె కల. కానీ రాజా అంధుడు కావడంతో చట్టప్రకారం వీలుపడదు. పోలీసు కల తీరకపోవడంతో కనీసం ఓ ఆపరేషన్‌లో రాజాను భాగం చేయమని డీఐజీ సంపత్‌ను కోరుతుంది అనంతలక్ష్మి. ప్రకాష్(ప్రకాష్‌రాజ్) నిజాయితీపరుడైన పోలీస్ అధికారి. కూతురు లక్కీ(మోహరీన్) అంటే అతడికి పంచప్రాణాలు. చిన్నతనంలోనే లక్కీకి తల్లి దూరమవడంతో కూతురుని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. దేవరాజ్ అనే రౌడీ, తన తమ్ముడితో చేసే అక్రమాలను అడ్డుకుంటాడు ప్రకాష్. దేవరాజ్ తమ్ముడిని చంపేస్తాడు. తన తమ్ముడి చావుకు కారణం ప్రకాష్, లక్కీలని తెలుసుకున్న దేవరాజ్ వారిపై పగపడతాడు. ప్రకాష్‌ను చంపేస్తాడు. కానీ లక్కీ మాత్రం అతడికి దొరకకుండా తప్పించుకుంటుంది. దాంతో ఆమెను రక్షించే బాధ్యతను పోలీసులు రాజాకు అప్పగిస్తారు. దేవరాజ్ బారీ నుంచి అంధుడైన రాజా..లక్కీని ఎలా కాపాడగలిగాడు? ఆమె మనసును ఎలా గెలుచుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
రెగ్యులర్ కమర్షియల్ కథకు అంధుడి పాత్రను జోడించి ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అంధత్వం వల్ల హీరో ఎదుర్కొనే ఇబ్బందులు, అవమానాలు లాంటి అంశాల జోలికి పోకుండా అతడి పాత్రను శక్తివంతంగా, ధైర్యస్తుడిగా తీర్చదిద్దిన తీరు బాగుంది. ఆ పాత్ర నుంచే చక్కటి వినోదాన్ని పండించారు. ఒక్క హీరోకే కాకుండా ప్రతి పాత్ర విభిన్నంగా డిజైన్ చేసుకున్నారు. యాక్షన్, సెంటిమెంట్ ఇలా ప్రతి సన్నివేశం నుంచి కామెడీని పండించారు అనిల్ రావిపూడి. జీవితం ఓ పెయింట్ లాంటిది దానిని ఎలా తీర్చిదిద్దుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుందని సంభాషణల రూపంలో సందేశాన్ని అంతర్లీనంగా చెప్పారు.

అగ్రకథానాయకుడు అంధుడి పాత్రలో నటించడమనేది ఒకరకంగా సాహసమనే చెప్పాలి. అంధుడి పాత్రకు రవితేజ ప్రాణప్రతిష్ట చేశారు. ఎక్కడ ఎనర్జీలెవల్స్ తగ్గకుండా సహజ నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్, హావభావాలతో మెప్పించారు. మోహరీన్ గ్లామర్ పరంగా ఒకే అనిపించింది. రవితేజ చిన్ననాటి పాత్రలో ఆయన తనయుడు మహాధన్ కనిపించారు. శ్రీనివాసరెడ్డి, రాజేంద్రప్రసాద్, పృథ్వీ, బిత్తిరిసత్తి, అలీ, అన్నపూర్ణమ్మ, తనికెళ్లభరణిలు కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వారిపై వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ప్రకాష్‌రాజ్, రాధిక పాత్రలు భావోద్వేగాలతో ముడిపడి చక్కటి అనుభూతిని పంచుతాయి.

మాస్ సినిమాకు తగినట్లుగా చక్కటి బాణీలను అందించారు సాయికార్తీక్. ఛాయాగ్రహకుడు మోహనకృష్ణ అందంగా సినిమాను తీర్చిదిద్దారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. లాజిక్‌లు, కొత్తదనాన్ని పక్కనపెడితే రెండు గంటల పాటు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది. రవితేజ అభిమానుల్ని మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్:3/5

4771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles