హారర్ థ్రిల్లర్ కథాంశం నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో చాలా వరకు విజయాన్ని సాధించాయి. అయితే అది నిన్నటి మాట. ప్రస్తుతం హారర్ చిత్రాలు ఆ స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. హారర్ కథాంశానికి హాస్యాన్ని జోడించి భయపెడుతూ ఆకట్టుకున్న సినిమా ‘ప్రేమకథాచిత్రమ్'. హారర్ థ్రిల్లర్ కథలకు వినోదాన్ని జోడించి ప్రేక్షకుల్ని నవ్వించి ఆకట్టుకోవచ్చనే ఫార్ములాకు ఒక విధంగా ఈ సినిమానే నాంది పలికింది. ఈ చిత్రానికి దాదాపు ఆరేళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరపైకొచ్చిన సినిమా ‘ప్రేమకథాచిత్రమ్-2’. సమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని నాయకా నాయికలుగా నటించారు. హరికిషన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. హిట్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం కావడం, అదే చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించడంతో సీక్వెల్‌పై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సీక్వెల్ ఆ అంచనాలకు అనుగుణంగానే వుందా?. హారర్ చిత్రాలు గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. చాలా రోజుల తరువాత తొలి భాగం స్ఫూర్తితో తెరపైకొచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్-2’ ఆకట్టుకునే స్థాయిలో వుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సుధీర్(సుమంత్ అశ్విన్)ని కాలేజీలో పరిచయమైన బిందు (సిద్ధి ఇద్నాని) ప్రేమించడం మొదలుపెడుతుంది. అది నచ్చని సుధీర్ ఆమె ప్రేమని తిరస్కరిస్తాడు. దాంతో మనస్తాపం చెందిన బిందు ఆత్మహత్యకు యత్నిస్తుంది. ఇది గమనించిన సుధీర్ ఆమెని కాపాడి తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఆ తరువాత అతనికి చిత్ర (అపూర్వ) అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. అయితే అప్పటికే సుధీర్ నందు ( నందితా శ్వేత) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. దాంతో ఆ పెళ్లి ఇష్టం లేని సుధీర్ ఆ అమ్మాయిని, పెళ్లిని నిరాకరిస్తాడు. దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఆత్మ హత్య చేసుకుంటుంది. అక్కడి నుంచి సుధీర్ చుట్టూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో సుధీర్ అనుకోకుండా ఓ ఫామ్ హౌజ్‌కు వెళతాడు. అక్కడ కనిపించిన నందు (నందితా శ్వేత) అనే అమ్మాయిని చిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. పగలు కనిపింకుండా పోయి రాత్రి వేళల్లో మాత్రమే ప్రత్యక్షమౌతుంటుంది. దయ్యంలా ప్రవర్తిస్తూ సుధీర్‌ని, అతని స్నేహితుడు బబ్లూను ఆటపట్టిస్తుంది. అసలు నందు ఎందుకు వింతగా ప్రవర్తిస్తోంది?. తనకు తానుగా ఎందుకు ఈ ఫామ్ హౌజ్‌కు వచ్చింది?. అసలు తన చుట్టూ ఏం జరుగుతోంది?. దీని వెనక ఎవరున్నారు? అని సుధీర్ తన మిత్రుడు బబ్లూ సహాయంతో అన్వేషించడం మొదలు పెడతాడు. ఆ అన్వేషణలో అతనికి తెలిసిన నిజం ఏంటి?. సుధీర్ చుట్టూ జరుగుతున్న సంఘటనలకు కారణం ఎవరు?. నందు విచిత్రంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘ప్రేమకథా చిత్రమ్' చిత్రంలో ప్రతీకారంతో రగిలిపోయే ఓ ఆత్మ కథకి హాస్యాన్ని జోడించి హారర్ అంశాల డోస్‌ని తగ్గించి హాస్యానికే పెద్దపీట వేసి జనరంజకంగా తెరకెక్కించడంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కథని రాసుకుని దాన్ని అదే స్థాయిలో రక్తికట్టించాలని దర్శకుడు హరికిషన్ ప్లాన్ చేశాడు కానీ అందులో ఏ మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో కన్ఫ్యూజన్గా పాత్రలని వరుసగా తెరపైకి తీసుకొచ్చి కథాగమనాన్ని ప్రారంభించిన దర్శకుడు చిత్ర చనిపోవడానికి గల బలమైన కారణాన్ని మాత్రం చూపించలేకపోయాడు. ఆ తరువాత నందు, సుధీర్ల ప్రేమాయణాన్ని కూడా అంత ప్రభావంతంగా చూపించకపోవడం, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంలో నందితా శ్వేత దయ్యం ఆవహించిన అమ్మాయిగా నటించిన తీరు, పలికించిన హావభావాలు ఆ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి నటిని ప్రధాన పాత్రకు ఎంచుకుని ఆమె నుంచి తనకు కావాల్సిన నటనని రాబట్టలేకపోయాడు. ఒక దశలో ఏం చేయాలో తెలియక నందితా శ్వేత ఎఫెక్ట్ కోసం ఖాలీగా అటు ఇటు నడుస్తున్న ఫీలింగ్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుందంటే దర్శకుడు సన్నివేశాలతో పాటు పాత్రల్ని ఎంత పేలవంగా రాసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక హీరో పాత్రధారి సుమంత్ అశ్విన్ ఫేస్‌లో కీలక సన్నివేశాలతో పాటు నందితను దయ్యం ఆవహించిన సందర్భంలోనూ నోటీస్ చేయడానికి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా కనిపించదు. అతని కంటే బాబ్లూ పాత్రలో నటించి కాస్తో కూస్తో హ్యాస్యాన్ని పండించిన వ్యక్తే నయం అనిపిస్తుంది. ఇక సుధీర్‌ని (సుమంత్ అశ్విన్)ని ప్రేమించే అమ్మాయిగా సిద్ధా ఇద్నాని కనిపించింది కానీ అది వన్ సైడ్ లవ్ కావడంతో ఆమెకు నటించడానికి ఇందులో ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. బబ్లూ పాత్రతో నవ్వించే ప్రయత్నం చేసినా ఒకదానికి వెనక ఒకటి వచ్చే వరుస సన్నివేశాలు సగటు ప్రేక్షకుడికి తెలిసిపోతుండటంతో కథాగమనం ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. ఫామ్‌హౌజ్‌కు కథ మారిన దగ్గరి నుంచి దర్శకుడు కథపై, టేకింగ్‌పై కూడా పూర్తిగా పట్టు కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. ‘ప్రేమకథా చిత్రమ్' విషయంలో ఏదైతే ప్లస్‌గా మారిందో ఆ అంశాన్నే పక్కప పెట్టి సినిమాని చిందరవందర గందరగోళంగా నడిపించిన తీరు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. ఇక పతాక ఘట్టాల్లో దర్శకుడు భయపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నవ్వుకునేలా వున్నాయి. అంటే అంత పేలవంగా తీశాడన్నమాట. అనుభవజ్ఞడైన కెమెరామెన్ సి. రామ్‌ప్రసాద్ వున్నా అతని అనుభవాన్ని ఈ చిత్రానికి ఉపయోగించుకోలేకపోయాడు. ప్రతి సన్నివేశం ఏదో కొత్త కెమెరామెన్ తీసినట్టుగా వుంటుందే కానీ ఎక్కడా హారర్ చిత్రంలా కనిపించదు. జేబీ నేపథ్య సంగీతం, అనంతశ్రీరామ్, కాసర్తశ్యామ్ అందించిన పాటలు ఆకట్టుకునే విధంగా వున్నాయి. గణేష్ రాసిన సంభాషణలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
హారర్ ఎంటర్టైనర్స్ ఒకప్పుడు భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఆ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. పేలవమైన కథ, కథనాలే ఇందుకు ప్రధాన కారణంగా మారాయి. ఆ కోవలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్-2’ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోగా అసహనాన్ని కలిగిస్తుంది. హారర్ కథాంశంతో రూపొంది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘ప్రేమకథా చిత్రమ్'కు సీక్వెల్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్-2’ గత సినిమాని దృష్టిలో పెట్టుకుని థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకుడిని నిరాశని కలిగిస్తుంది.
రేటింగ్: 2.5