బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి నవంబర్ 20న ఇటలీలోని కోమో సరస్సు వేదికగా జరగనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . వీరి వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లనున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న దీప్ వీర్ జంట ముంబైలో రిసెప్షన్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వరలో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయనున్నారని అంటున్నారు. అయితే వీరి వివాహ వేడుకకు సెల్ ఫోన్లు అనుమతించకూడదని కూడా ఈ జంట నిర్ణయించారట. వేడుక అనంతరం వీరిద్దరే వివాహ ఫోటోలను అందరికీ షేర్ చేయాలని భావించారట. ఈ కారణంగా మా పెళ్లికి సెల్ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా-రణ్వీర్ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని కూడా వీరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.రణ్వీర్ ప్రస్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాలతో బిజీగా ఉండగా వెన్ను నొప్పి నుండి కోలుకుంటున్న దీపికా త్వరలో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది.