ప్రత్యేక హోదా మా హక్కు : పవన్ కళ్యాణ్

Sat,August 27, 2016 05:30 PM
ప్రత్యేక హోదా మా హక్కు : పవన్ కళ్యాణ్

మోడీ మాటలు హామీలకే పరిమితమా?
ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తాం
చంద్రబాబు ముందుకు ఎందుకు వెళ్లడం లేదు?
వెంకయ్య మీనమేషాలు లెక్కపెట్టడం సరికాదు


తిరుపతి : ప్రత్యేక హోదా మా హక్కు.. మీరు ఇచ్చి తీరాలి అని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కోరారు. ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కేంద్రంపైనా, బీజేపీ ఎంపీలపైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాను, అప్పటికీ స్పందించకపోతే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతామన్నారు. టీడీపీ ఎంపీలు సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారే తప్ప ప్రత్యేక హోదా కోసం పోరాడడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 9న కాకినాడలో తొలి సభ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఎంపీలు హిందీ నేర్చుకుంటే బాగుంటుందని సూచించారు. ప్రజల కోసం నిస్వార్థ రాజకీయం చేస్తానని ఉద్ఘాటించారు. తిరుపతి ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.

పవన్ ప్రసంగం.. ‘కేంద్రం నిధులు ఇచ్చిందంటూ గందరగోళం లెక్కలు మాకొద్దు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా.. దాని గురించి పట్టించుకోండి. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం, విపక్షాలు ఒకటే మాటగా ఉండాలి. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా ఉండకూడదు. రాజకీయ పార్టీల ప్రథమ లక్ష్యం ప్రజాశ్రేయస్సే.

నా పోరాటంలో నేను గెలవొచ్చు, ఓడిపోవచ్చు, కానీ వెనకడగు వేయను. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ముగ్గురు సీఎంలు ఒప్పుకోవడం లేదంటున్నారు. మన నేతలకు కేంద్ర ప్రభుత్వమంటే ఎందుకంత భయం. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మ రాక్షసి కాదు.. అది కూడా మనుషులే కదా? ప్రత్యేక హోదా అంటే తమపై సీబీఐని ప్రయోగిస్తారని మన నేతల భయం. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేయండి. ప్రజల ద్వారా, ప్రజల కోసం పోరాటం చేయడమే మా ఉద్దేశం. మున్ముందు టీడీపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తాను.

రాష్ట్ర కోసం ముఖ్యమంత్రి కష్టపడుతున్నప్పటికీ.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకెళ్లడం లేదు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా 5 కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు వెంకయ్యనాయుడు మీనమేషాలు లెక్కపెట్టడం సరికాదు. వెంకయ్య ముందు జాతి ప్రయోజనాలను పట్టించుకోవాలి. ఢిల్లీలో మన ఎంపీలకు హిందీ రాదు. అక్కడి వారికి ఆంగ్లం రాదు. మన ఎంపీలు హిందీ నేర్చుకొని ప్రత్యేక హోదా అడగాలి. నేను రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తాను’ అని స్పష్టం చేశారు.

2198

More News

VIRAL NEWS